మంచిర్యాల జిల్లా అక్కళ్లపల్లిలో గొడ్డలి చూపించి అధికారులను అడ్డుకున్న గిరిజన రైతు

మంచిర్యాల జిల్లా అక్కళ్లపల్లిలో గొడ్డలి చూపించి అధికారులను అడ్డుకున్న గిరిజన రైతు

బెల్లంపల్లి రూరల్, వెలుగు: క్రీడా మైదానం ఏర్పాటుతో తన భూమి పోతుందని తెలిసిన ఓ రైతు అధికారులను బెదిరించి మరీ పనులు అడ్డుకోవాలని చూశాడు. మాటలతో వినడం లేదని గొడ్డలి పట్టుకొని తన భూమిని కాపాడుకునే ప్రయత్నం చేశాడు. బుధవారం మంచిర్యాల జిల్లా భీమిని మండలం అక్కళ్లపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని సర్వే నం.69లో 20 గుంటల భూమిని అధికారులు క్రీడా మైదానం కోసం గుర్తించారు. అయితే, ఆ భూమి తనదేనని అదే గ్రామానికి చెందిన అశోక్​ అనే గిరిజన రైతు చెప్తున్నాడు. తనకున్న కొద్దిపాటి భూమిని అధికారులు స్పోర్ట్స్ గ్రౌండ్​కు గుర్తించడంపై  ముందు నుంచీ అడ్డగిస్తూనే వస్తున్నాడు. 

బుధవారం ఉదయం స్థానిక గ్రామపంచాయతీ అధికారులు క్రీడా మైదానం పనులు చేసేందుకు అక్కడికి చేరుకోగా.. ముందే గమనించిన అశోక్​ గొడ్డలి చేతబట్టుకొని అధికారుల వద్దకు చేరుకున్నాడు. తన భూమిలో అడుగు పెడితే ఊరుకోనని గొడ్డలి చూపిస్తూ బెదిరించాడు. వెంటనే అక్కడ ఉన్న డీఎల్​పీవో ఫణీందర్​ జెడ్పీ సీఈవో నరేందర్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆశోక్​ను సముదాయించారు. రెవెన్యూ అధికారులు గుర్తించిన భూమిలోనే పనులు చేస్తున్నామని ఆఫీసర్లు చెప్పారు. అయితే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు భూమి కోసం గొత్తికోయలు ఫారెస్ట్ ఆఫీసర్ ను హత్య చేసిన ఘటన మరుసటి రోజే ఈ ఘటన జరగడం చర్చనీయాంశమైంది.