‘ధరణి’లో తప్పులతో గిరిజన రైతులకు తప్పని గోస

‘ధరణి’లో తప్పులతో గిరిజన రైతులకు తప్పని గోస

ఇతరుల పేర్లపై భూముల ఎంట్రీ

మహబూబ్​నగర్​, వెలుగు: ఏండ్లు గడుస్తున్నా ‘ధరణి’లో తప్పులను సరిదిద్దకపోవడంతో గిరిజన రైతులు గోస పడుతున్నరు. వారి పేరు మీద ఉన్న పట్టా భూములను పోర్టల్​లో ఇతరుల పేరు మీద ఎక్కించిన ఆఫీసర్లు వారికే డిజిటల్​పాసు పుస్తకాలు సైతం ఇచ్చారు. డిజిటల్​పాసు బుక్కులు అందుకున్న వ్యక్తులు ఆ భూములను ఇతరులకు విక్రయిస్తుండటంతో అసలు రైతులు ఆందోళనకు దిగుతున్నారు. న్యాయం చేయాలని ఏండ్లుగా రెవెన్యూ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. మహబూబ్​నగర్ జిల్లా బాలానగర్​ మండలంలోని బిల్డింగ్​తండా కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పాటైంది. ఈ పంచాయతీ కింద బాలాజీగుట్ట తండా, నాచారం తండా, గున్యా తండా, కోయిల్​కుంట తండాలు ఉన్నాయి. ఇందులో బాలాజీతండా, బిల్డిండ్​తండాలో 350 ఇండ్లు ఉండగా 120 మంది రైతులు ఉన్నారు. ఇందులో వంద మంది రైతులకు సర్వే నంబర్లు 262, 263, 264, 265, 266, 267, 268, 269, 270, 271, 272లో  220 ఎకరాల భూమి వారసత్వంగా వచ్చింది. రెవెన్యూ రికార్డుల్లో కూడా వీరి పేరే ఉంది. కానీ 2017లో నిర్వహించిన ల్యాండ్​రికార్డ్స్ అప్​డేటింగ్​ప్రోగ్రాం(ఎల్ఆర్ యూబీ) తర్వాత వీరికి సమస్యలు మొదలయ్యాయి. అప్పట్లో తండాలను విజిట్​చేసిన ఆర్ఐ, తహసీల్దార్, గిర్దావర్​రైతుల నుంచి పట్టాదారు పాసు పుస్తకాలు, ఆధార్​ కార్డులను తీసుకున్నారు. మీ భూమి వివరాలను ఆన్​లైన్​లో ఎంట్రీ చేస్తామని చెప్పారు. అయితే ధరణిలో చాలామంది భూ వివరాలు ఇతరుల పేరు మీద ఎంట్రీ అయ్యాయి. పాస్​ బుక్కులు కూడా వారికే వచ్చాయి. ఇందులో కొందరికి అసలు భూమి లేకున్నా, వారి పేరు మీద భూమి ఉన్నట్లు ఆఫీసర్లు బుక్కులు ఇచ్చారు. అసలైన రైతుల పేరు మీద ఎలాంటి భూమి చూపించడం లేదు. కొందరు రైతులకు రెండు, మూడు ఎకరాలు ఉంటే, ధరణిలో కేవలం ఎకరా, అర ఎకరా ఉన్నట్లు ఎంట్రీ చేశారు. 

భూములు అమ్మేస్తున్నరు

బాలాజీగుట్ట తండా, బిల్డింగ్​తండాలు హైదరాబాద్​కు 60, శంషాబాద్​కు 30 కిలోమీటర్ల దూరం ఉండటం, ఎన్​హెచ్​-44కు ఆరు కిలోమీటర్ల దూరమే ఉండటంతో ఇక్కడ భూములకు విపరీతమైన డిమాండ్​ ఉంది. ఇప్పటికే ఈ ఏరియాలో రియల్​వెంచర్లు, ఫామ్​హౌస్​లు ఏర్పాటయ్యాయి. అసలు రైతులకు కాకుండా వేరే వారికి పట్టాదారు పాసు పుస్తకాలు రావడం, ధరణిలో వారి పేరే ఉండటంతో ఏడాదిగా వారు భూములను అమ్మకానికి పెట్టారు. ఇప్పటికే నలుగురు రైతులకు చెందిన భూములను షాద్​నగర్, ఫరూక్​నగర్​ మండలాలకు చెందిన టీఆర్ఎస్​ లీడర్లకు ఎకరం రూ. 70 లక్షల చొప్పున అమ్మేశారు. అసలు రైతులు ఈ భూములు తమవని, మీరెట్లా కొంటారని ప్రశ్నిస్తే మా డబ్బులు మాకు తిరిగిస్తే మీ భూములు ఇస్తామని చెబుతున్నారు. 

తిరిగి తిరిగి విసిగిపోయిన్రు

2018 నుంచి రైతులు తమకు న్యాయం చేయాలని రెవెన్యూ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రజావాణి, ఇతర సందర్భాల్లో ఇప్పటివరకు దాదాపు 30 సార్లు కంప్లైంట్​చేసినా స్పందన రాలేదు. తహసీల్దార్​దగ్గరే సమస్యను పరిష్కరించుకోమని కలెక్టర్​ చెబుతున్నారని రైతులు అంటున్నారు. తహసీల్దార్​దగ్గరకు వెళితే ఆర్డీవో వద్దకు వెళ్లండని సమాధానం ఇస్తున్నారని తెలిపారు. ఏడాదిన్నర కిందట ఈ ప్రాంతానికి చెందిన ఓ ఆర్ఐ ఎకరాకు రూ.2 వేలు ఇస్తే మీ భూములు ధరణిలో ఎక్కిస్తామని బాధితుల నుంచి రూ.1.70 లక్షలు వసూలు చేశాడు. కానీ పని చేయలేదు. ప్రస్తుతం ఆయన స్థానంలో మరో వ్యక్తి అక్కడ డ్యూటీలో ఉన్నాడు.

ఎంక్వైరీ చేస్తాం

ధరణిలో ఎడిట్​ ఆప్షన్​ లేదు. గతంలో ఎల్​ఆర్​యూబీలో ఇచ్చిన వివరాల ప్రకారం ఆన్​లైన్​లో ఎంట్రీ చేశారు. కొందరు ఈ భూములను అమ్ముతున్నారు. ఈ విషయం తెలిసి రైతులు కంప్లైంట్​చేస్తే రిజిస్ట్రేషన్​ కాకుండా ఆపుతున్నాం. త్వరలో రెండు టీంలను ఏర్పాటు చేస్తాం. ఎవరెవరికి భూ సమస్యలు ఉన్నాయో తెలుసుకుంటాం. తర్వాత ఆ రిపోర్ట్​కలెక్టర్​కు పంపిస్తాం.

– శ్రీనివాసులు, తహసీల్దార్, బాలానగర్