
- వన సంరక్షణ సమితులకు ఉపాధి యూనిట్లు
- రాష్ట్రంలో తొలిసారిగా ఖమ్మం జిల్లాలో అటవీశాఖ అమలు
- రూ.10 లక్షల విలువైన మెషీన్లు ఫ్రీగా అందజేత
- లీఫ్ ప్లేట్లు, దీపం వత్తులు, సబ్బుల తయారీపై శిక్షణ
- డీఎఫ్‌వో ప్రత్యేక చొరవపై గిరిజనుల్లో సంతోషం
ఖమ్మం, వెలుగు : అటవీ సంపదను నమ్ముకుని జీవించే గిరిజనులు మెరుగైన ఆదాయం పొందేందుకు ఖమ్మం జిల్లా అటవీ శాఖ ప్లాన్ చేసింది. స్వయం ఉపాధిని కల్పించేందుకు కొత్త టెక్నాలజీని అందించడంతో పాటు శిక్షణను కూడా ఇచ్చింది. అటవీ సంపద రక్షణలో వన సంరక్షణ సమితుల (వీఎస్ఎస్) సభ్యులకు దీపం వత్తులు, భోజనం ప్లేట్లు, పచ్చళ్లు, సబ్బులు, జ్యూస్‌లు వంటివి తయారు చేసే మెషీన్లను రాష్ట్రంలోనే తొలిసారిగా వారం రోజుల కింద ఫారెస్ట్ ఆఫీసర్లు ఉచితంగా అందజేశారు.
అంతేకాకుండా శిక్షణ ఇవ్వడంతో పాటు మార్కెటింగ్ అవకాశాలను కూడా కల్పిస్తున్నారు. అవసరమైన ముడిసరుకును ముందస్తుగా ఇస్తున్నారు. ఉత్పత్తుల తయారీలో నైపుణ్యాన్ని పొందేందుకు ఫారెస్ట్ ఆఫీసర్ల ప్రోత్సాహాన్ని గిరిజనులు సద్వినియోగం చేసుకుంటూ మరింత ఆదాయం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.
రూ.10 లక్షల విలువైన మెషీన్లు ఫ్రీగా..
చాలా ఏండ్లుగా అటవీ సంరక్షణలో వన సంరక్షణ సమితులు కీలకంగా పని చేస్తున్నాయి. అటవీశాఖ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కింద అడవుల పెంపకం చేస్తున్నాయి. వెదురు, టేకు, సుబాబుల్, జామ వంటి తోటలు సాగు చేసి, వాటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని పంచుకుంటున్నాయి. పూర్తిగా అటవీపైనే ఆధారపడకుండా వీఎస్ఎస్ సభ్యులకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు కల్పించాలని ఖమ్మం జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్ ప్లాన్ చేశారు. జార్ఖండ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలను పరిశీలించారు.
అలాంటి పైలెట్ ప్రాజెక్టును ఖమ్మం జిల్లాలోనూ అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ద్వారా రూ.10 లక్షల విలువైన వివిధ రకాల మెషీన్లను తెప్పించారు. వాటిపై వీఎస్ఎస్సభ్యులకు శిక్షణ అందించారు. ఇప్పటివరకు దీపం వత్తుల తయారీ మెషీన్లు 2, మోదుగు ఆకులతో భోజనం ప్లేట్ల తయారీ మెషీన్లు నాలుగు, మల్టీ పర్పస్ఫుడ్ ప్రాసెసింగ్ మెషీన్ ఒకటి, వాటర్ కూలర్మెషీన్ ఒకటి తెప్పించారు. తల్లాడ మండలం గూడూరు వీఎస్ఎస్కు లీఫ్ప్లేట్స్ మేకింగ్ మెషీన్ , కాటన్వికింగ్ మెషీన్ (దీపం వత్తుల తయారీ), మల్టీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అందించారు.
ప్లేట్స్ మేకింగ్మెషీన్ లో మోదుగు ఆకులతో భోజనం ప్లేట్లు, పేపర్ తో భోజనం ప్లేట్లు, ప్రసాదం తినే గిన్నెలు తయారు చేసేలా శిక్షణ ఇచ్చారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తో సబ్బులు తయారు చేయడంతో పాటు, పండ్ల జ్యూస్ లు, పచ్చళ్లు, పిండి తయారు చేయొచ్చు. కల్లూరు మండలం పడమటి లోకారం వీఎస్ఎస్ కు కాటన్ విక్ మెషీన్, లీఫ్ ప్లేట్ మేకింగ్ మెషీన్ పంపిణీ చేశారు. సత్తుపల్లి మండలం చంద్రాయపాలెం వీఎస్ఎస్కు కాటన్విక్మెషీన్, లీఫ్ ప్లేట్ మేకింగ్ మెషీన్ ఇచ్చారు. పులిగుండాలలో సిబ్బంది కోసం వాటర్ కూలర్ మెషీన్, ఆర్వో ప్లాంట్ ను ఏర్పాటు చేశారు.
మార్కెటింగ్ సౌకర్యం కూడా..
ఫ్రీగా మెషీన్లు అందించి, శిక్షణ ఇవ్వడమే కాకుండా తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ పైనా ఫారెస్ట్ ఆఫీసర్లు దృష్టిపెట్టారు. ప్లేట్లు, గిన్నెలు, దీపం వత్తులను ఖమ్మం మహిళా మార్ట్ లో అమ్మేందుకు చర్యలు చేపట్టారు. ఇక వెలుగుమట్ల అర్బన్‌పార్క్, సత్తుపల్లి అర్బన్‌పార్క్, పులిగుండాలలో ఏర్పాటు చేసే క్యాంటీన్లకు లీఫ్ ప్లేట్లు, గిన్నెలు సప్లయ్చేయనున్నారు. మెషీన్లను ఏర్పాటు చేసుకునేందుకు వీఎస్‌ఎస్‌ల మీటింగ్ హాళ్లలో సౌకర్యాలు కల్పించి కేటాయించారు.
గూడూరు వీఎస్ఎస్ లో 80 మంది, పడమటి లోకారం వీఎస్ఎస్ లో 100 మంది, చంద్రాయపాలెంలో 25 మంది వరకు సభ్యులు ఉన్నారు. ఇద్దరు, లేదా ముగ్గురికి మెషీన్లపై పూర్తి స్థాయిలో పనిచేసేలా బాధ్యతలిచ్చి, తయారైన ఉత్పత్తులను అమ్మడం ద్వారా వచ్చిన ఆదాయం నుంచి నెలవారీ జీతం ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. మిగిలిన ఆదాయాన్ని వీఎస్ఎస్ లోని మిగిలిన సభ్యులకు కూడా పంచాలని భావిస్తున్నారు. మిగిలిన వీఎస్ఎస్ సభ్యులు అడవుల్లో తోటల పెంపకం, ఇతర వ్యవసాయ పనులపై దృష్టిపెట్టనున్నారు.
ఎలా పనిచేయాలో నేర్పించారు
మాకు మోదుగు చెట్ల ఆకులతో ప్లేట్లు, గిన్నెలు, దూదితో దీపం వత్తులు తయారు చేసే మెషీన్లను అధికారులు ఇచ్చారు. వాటిపై ఎలా పనిచేయాలో ఒకరోజు శిక్షణలో నేర్పించారు. అడవిలోంచి మోదుగు ఆకులు తెచ్చి, వాటితో ప్లేట్లు తయారు చేస్తున్నాం. ఇప్పుడు వ్యవసాయ పనులు బాగా ఉండడంతో సాయంత్రం ఒకట్రెండు గంటలు మాత్రమే మెషీన్లపై పని చేస్తున్నాం.
- చంద్రాయపాలెం వీఎస్ఎస్మెంబర్
వీఎస్ఎస్లను ప్రోత్సహిస్తున్నాం
జిల్లాలో ఉత్సాహంగా పని చేస్తున్న వన సంరక్షణ సమితిలకు ఆర్థికాభివృద్ధి ఉండేలా సభ్యులను ప్రోత్సహిస్తున్నాం. వీరి కోసం వివిధ రకాల మెషీన్లను తెప్పించాం. స్వయం ఉపాధి ద్వారా ఆదాయం పొందేలా చూస్తున్నాం. గిరిజన యువత, మహిళలకు మెషీన్లపై శిక్షణ ఇస్తున్నాం. మరికొందరికి గేదెలు, మేకలతో పశుపోషణ, తేనెటీగల పెంపకం, ట్రాక్టర్, ఆటో వంటి వనరులు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. - సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, ఖమ్మం జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్