- రూ.15 లక్షలతో స్మృతివనం అభివృద్ధి చేస్తం: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు
గుడిహత్నూర్ (ఇంద్రవెల్లి), వెలుగు : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి అమరులకు సోమవారం ఆదివాసీలు ఘనంగా నివాళులర్పించారు. 45 ఏండ్ల తర్వాత స్మృతివనంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా ఆదివాసీలు స్వేచ్ఛగా అమరులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మాజీ ఎంపీ సోయం బాపూరావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ హాజరై.. అమరవీరుల స్తూపం వద్ద జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ.. అమరుల కుటుంబాలను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. స్మృతివనం అభివృద్ధికి ఇప్పటికే రూ.15 లక్షలు కేటాయించామని, కాంపౌండ్ వాల్, సోలార్ విద్యుత్ వంటి సౌలతులు సైతం కల్పిస్తున్నామని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో భూహక్కులు, ఇందిరమ్మ ఇండ్లు, తాగునీరు, విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఐటీడీఏ, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ మాట్లాడుతూ... స్మృతివనం అభివృద్ధి పనులను మూడు నెలల్లో పూర్తి చేస్తామని, గిరిజన గ్రామాల్లో నీటి సమస్య పరిష్కారానికి బోర్‌వెల్స్ వేయిస్తామని చెప్పారు. ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. ఆడపిల్లల విద్యపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఆదివాసీ సంఘాల నాయకులు, గ్రామ పటేళ్లు, సార్‌మేడీలు పెద్ద సంఖ్యలో హాజరై ఇంద్రవెల్లి అమరులకు నివాళులర్పించారు. అనంతరం అత్రం భుజంగ్‌రావు రచించిన ‘ఆ గాయానికి 44 ఏళ్లు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

