
భద్రాచలం,వెలుగు: చర్ల మండలం పులిగుండాల గ్రామంలో పోడు భూమిలో మిడియం లక్ష్మీ అనే రైతు ఏడాది క్రితం ఏర్పాటు చేసుకున్న వ్యవసాయ బోరును ఫారెస్ట్ ఆఫీసర్లు ధ్వంసం చేశారు. ఐటీడీఏ, జిల్లా కలెక్టర్ ఆఫీసుల నుంచి అనుమతులు తీసుకుని ఈ బోర్ను ఆదివాసీ మహిళ తవ్వించారు. కానీ పోడు భూమిలో ఉన్న ఈ బోరును ధ్వంసం చేసి, అందులో రాళ్లను వేశారు. ఆగ్రహించిన ఆదివాసీలు సోమవారం చర్ల మండలం రాళ్లగూడెం వద్ద ధర్నా చేపట్టారు. ఆదివాసీ రైతులపై ఫారెస్ట్ సిబ్బంది కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని నినాదాలు చేశారు.
ధ్వంసం చేసిన ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని, ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పోరేషన్ ఛైర్మన్ పొదెం వీరయ్య ఈ ధర్నాకు సంఘీభావం తెలిపారు. పులిగుండాల మాజీ సర్పంచ్ సోడె చలపతి మాట్లాడుతూ...ఆర్ఓఆర్ పట్టాభూమిలో నుంచే ఇసుక ర్యాంపులకు మట్టిని, గ్రావెల్‌ను తోలుతుంటే ఆఫీసర్లు ఏం చేస్తున్నారని నిలదీశారు. రైతులు వేసుకున్న బోర్లను మాత్రం ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. పొదెం వీరయ్య హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.