
ఖైరతాబాద్, వెలుగు: బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కృషి చేసిన నాయకుడు వెంకటస్వామి (కాకా) అని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య అన్నారు. ఆయన కృషి వల్లే హైదరాబాద్‌లో ఎంతో మంది పేదలు సొంతింటిలో ఉంటున్నారని గుర్తుచేశారు. కాకా పేదల నాయకుడు అని, ఎప్పుడు వారి అభివృద్ధి కోసమే తపించేవారని పేర్నొన్నారు. గురువారం ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్‌లోని అంబేద్కర్ స్ఫూర్తి భవన్‌లో మాల మహనాడు ఆధ్వర్యంలో మాజీ కేంద్ర మంత్రి వెంకట స్వామి 9వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట స్వామి, మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు పీవీ రావు చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించి, మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ కోసం కాకా నిరంతరం తపించే వారని, స్వరాష్టం కోసం కృషి చేశారని తెలిపారు. అంబేద్కర్ ఆశయాల కోసం తన ఐఏఎస్ ఉద్యోగాన్ని వదులుకుని, సామాజిక న్యాయం కోసం కొట్లాడిన నాయకులు పీవీ రావు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాల మహనాడు వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా శ్రీనివాస్, ఆనంద్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
బడుగుల కోసం అహర్నిశలు కృషి
ముషీరాబాద్: బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కాకా వెంకటస్వామి అహర్నిశలు కృషి చేశారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోపోజు రమేశ్ బాబు అన్నారు. కాక వర్ధంతి సందర్భంగా గురువారం ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న విగ్రహానికి రమేశ్‌బాబు పూలమాల వేసి నివాళులర్పించారు.
ఓయూలో కాకా వర్ధంతి
ఓయూ: కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత కాకా గడ్డం వెంకటస్వామి వర్ధంతిని గురువారం ఓయూలో ఘనంగా నిర్వహించారు. ఓయూ జేఏసీ నాయకుడు సురేశ్యాదవ్ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీ వద్ద కాకా చిత్ర ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాకా చేసిన సేవలను, సంక్షేమ కార్యక్రమాలను గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో మట్టపల్లి మహేశ్, శ్రవణ్ యాదవ్, మహేశ్ గౌడ్, ప్రవీణ్, రవి, రిషి, శివ, శ్రీకాంత్, రమేశ్, బాషా తదితరులు పాల్గొన్నారు.