రైతు బాంధవుడు .. మరువలేని నేత వైఎస్సార్​

రైతు బాంధవుడు .. మరువలేని నేత వైఎస్సార్​

వైఎస్సాఆర్‌‌’  అంటేనే తెల్లని పంచకట్టుతో నిలువెత్తు మనిషి రూపం కళ్ల ముందు మెదులుతుంది. ఆయన పాలనలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఇంటికీ అందడంతో ఇప్పటికీ ఆయన ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. మహిళలు, రైతులు, విద్యార్థులు, బడుగువర్గాల వారు, ఉద్యోగులు ఒకటేమిటి అన్ని రంగాల వారు వైఎస్సాఆర్‌‌ పాలనలో అలా ఉండేది అని ఆ మంచి రోజులను 14 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు.  

పావలావడ్డీ, అభయహస్తం పథకాలను ప్రవేశపెట్టి ఆడపడుచులు ఆర్థికంగా స్థిరపడడానికి కృషి చేశారు. పేదవారి సొంతింటి కల నెరవేరేలా ‘ఇందిరమ్మ ఇళ్లు’ అందజేశారు. ఇప్పటికీ ఆ ఇండ్లలో సేదతీరుతున్న ఆడపడుచులు రాజశేఖర్‌‌రెడ్డి చలువతోటే చల్లంగా ఉన్నామని చెప్పుకుంటున్నారు. పావలా వడ్డీ పథకాన్ని తొలుత స్వయం సహాయక సంఘాల మహిళలకే అమలు చేసినా, దాని ప్రయోజనాలను గుర్తించి ఈ తర్వాత రైతులతో పాటు వివిధ వర్గాలకు అందజేశారు. ప్రతి మహిళను లక్షాధికారి చేయాలనేదే రాజన్న లక్ష్యంగా ఉండేది.

ఉచిత విద్య, వైద్యం..

ఒక పేదింటి బిడ్డ ఉన్నత చదువులు చదివితే ఆ కుటుంబం దశ, దిశ తిరుగుతుందని ఆయన ఎప్పుడూ చెప్పేవారు. అందుకు అనుగుణంగా పేదింటి విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలని కంకణం కట్టుకొని ఆయన ప్రవేశపెట్టిన ‘ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌‌’ పథకం ఒక విప్లవాత్మకమైంది. దీంతో పేదలు కూడా ఒక ఇంజినీర్‌‌గా, ఒకడాక్టర్‌‌గా తమ కలలను సాకారం చేసుకున్నారు. ఈ పథకంతో ఎస్సీ నుంచి ఓసీ దాకా పేద విద్యార్థులకు పెద్ద చదువులు అందుబాటులోకి వచ్చాయి. 

వృత్తిరీత్యా వైద్యుడైన రాజశేఖర్​రెడ్డి కడపలో ‘రూపాయి డాక్డర్‌‌’గా గుర్తింపు పొందారు.  ‘ఆరోగ్య శ్రీ’ పథకంతో పేదలు కూడా కార్పొరేట్‌‌ వైద్యం పొందగలుగుతున్నారంటే అది ఆయన చలువే. ఆపద సమయంలో ఆదుకునేలా ‘108’, ‘104’ అంబులెన్స్‌‌లను ప్రవేశపెట్టి దేశానికే మార్గదర్శకంగా నిలిచారు. రాజశేఖర్​రెడ్డి వృద్ధులకు, మహిళలకు, పేదలకు సహాయంగా ఉండేలా ఆసరా పింఛన్లు ప్రవేశపెట్టి అమలు చేశారు.

ప్రజాదర్బార్​లతో..

 ఎంత పని ఒత్తిడిలో ఉన్నా తెల్లవారుజామునే నిద్రలేవడం, ఎవరు ఏ సహాయం కోరి ఇంటికొస్తే తన హోదాను పక్కనపెట్టి వారి అవసరం తెలుసుకొని సాయపడేవారు. ప్రజాదర్బార్​లు పెట్టి ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేవారు. అలా ప్రజలను కలిసే సీఎంలు ఈ కాలంలో కరువయ్యారు. ప్రజల  బాగోగుల కోసం పాలకుడిలో ఉండాల్సిన స్పష్టత, చిత్తశుద్ధి, దూరదృష్టి, దార్శనికత వై.ఎస్‌‌. రాజశేఖరరెడ్డిలో ఉండడం వల్లనే ఆయనొక మరువలేని మహానేతగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.

రైతు బాంధవుడు 

ప్రతిపక్ష నేతగా రాష్ట్ర వ్యాప్తంగా వందల కిలోమీటర్లు పాదయాత్ర  చేసిన రాజశేఖరరెడ్డి అప్పటి కరువు కాటకాలను చూసి చలించిపోయారు. అన్నదాతల అష్టకష్టాలను ప్రత్యక్షంగా చూసిన ఆయన అధికారంలోకి వచ్చాక రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారు.  ముఖ్యమంత్రిగా రాజశేఖరరెడ్డి వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌‌పై, విద్యుత్‌‌ బకాయిల మాఫీపై తొలిసంతకం చేసి రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందనే విశ్వాసాన్ని కలిగించారు.  

వ్యవసాయమంటేనే చెవి కోసుకునే రాజన్నకు రైతులు, చేను, మొక్క, చెట్టు, మట్టి, గ్రామీణం ఇష్టమైన పదాలని ఆయనతో సన్నిహితంగా ఉండేవారు చెబుతుండేవారు. జలయజ్ఞంతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారు. దేవాదుల, ఎల్లంపల్లి వంటి అనేక ప్రాజెక్టులు నిర్మించారు. చెక్​డ్యాంలు నిర్మించారు.  వెనుకబడిన ప్రాంతాల్లోని బీడు భూములు పచ్చగా మారేలా నీటిని పారించారు.   ప్రాణహిత– చేవెళ్ల కూడా ఆయన కన్న కలనే. రాజన్న పనులు జరిపిన ఎస్​ఎల్​బీసీ ఇప్పటికీ అక్కడే ఉంది. ‘రచ్చబండ’ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలోని సాధకబాధకాలు తెలుసుకోవడానికి ప్రజల వద్దకు వెళ్లారు. అక్కడికక్కడే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుని వాటిని అమలుపరిచే ‘చేతల మనిషి’గా నిలిచారు.

- జి. శ్రీలక్ష్మి, సోషల్​ ఎనలిస్ట్​