అమ్మకానికి ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ

అమ్మకానికి ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ
  • 49 ఏళ్ల నాటి మరో నిజాం ఫ్యాక్టరీ క్లోజ్ 
  • మే నెల రెండో వారంలో వేలానికి అధికారుల ఏర్పాట్లు
  • వచ్చిన పైసలతో చెరకు రైతుల బకాయిలు కడ్తరట
  • రోడ్డున పడనున్న 1,680 మంది కార్మికులు
  • తాజాగా అధికారుల బృందాన్ని అడ్డుకున్న రైతులు
  • బకాయిలు చెల్లించి ఫ్యాక్టరీని రీ ఓపెన్ చేయాలని డిమాండ్

సంగారెడ్డి/జహీరాబాద్, వెలుగు : మెతుకు సీమగా విరాజిల్లిన ఉమ్మడి మెదక్ జిల్లాలోని భారీ ఫ్యాక్టరీలు ఒక్కొక్కటే మూతపడుతున్నాయి. మొన్న పటాన్ చెరు ఆల్విన్, నిన్న మెదక్ నిజాం దక్కన్ షుగర్స్ బాటలోనే నేడు జహీరాబాద్ నిజాం షుగర్స్ (ట్రైడెంట్) ఫ్యాక్టరీ కథ ముగియబోతున్నది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని ట్రైడెంట్(ఒకప్పటి నిజాం షుగర్స్) ఫ్యాక్టరీ ఆస్తులను అమ్మేందుకు జిల్లా ఆఫీసర్లు ముహూర్తం పెట్టారు. చెరుకు రైతులకు ఫ్యాక్టరీ యాజమాన్యం బాకీ పడ్డ రూ.12 కోట్లు చెల్లించే నెపంతో మే నెల రెండోవారంలో ఆస్తులు వేలం వేయనున్నట్లు కలెక్టర్ హనుమంతరావు ప్రకటించారు. ఈ షుగర్ ఫ్యాక్టరీ మూతపడడంతో ప్రత్యక్షంగా 180 మంది పర్మినెంట్ కార్మికులు, పరోక్షంగా మరో 1,500 మంది కార్మికులు ఉపాధి కోల్పోతారు. ఎంతలేదన్నా సుమారు 2 వేల కుటుంబాలు రోడ్డున పడ్తాయి. ఇక ఫ్యాక్టరీపై ఆధారపడి చెరుకు పంట సాగుచేస్తున్న వేలాది మంది రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. టెంపరరీగా మూతపడ్డ ఫ్యాక్టరీని రీ ఓపెన్ చేస్తారని ఇన్నాళ్లూ ఆశించిన కార్మికులు, రైతులు ఇక శాశ్వతంగా మూసేస్తారని తెలిసి తట్టుకోలేకపోతున్నారు. తాజాగా ఫ్యాక్టరీలోని ఆస్తుల వివరాలు సేకరించేందుకు కేన్ కమిషనర్, పోలీస్, రెవెన్యూ ఆఫీసర్ల టీమ్ మంగళవారం ఫ్యాక్టరీకి రాగా, రైతులు ఆందోళన చేశారు. తమ బకాయిలను చెల్లించి, ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. 
రూ.12 కోట్ల బకాయిలు..
ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం గత రెండేళ్లుగా రైతులకు చెరుకు బిల్లులు చెల్లించడంలో నిర్లక్ష్యం చేస్తోంది. ప్రతి ఏడాది రైతులు ధర్నాలు చేస్తే తప్ప బిల్లులు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. 2019-–20లో క్రషింగ్ ఆలస్యంగా స్టార్ట్ చేశారు. డిసెంబర్ 3న క్రషింగ్ ప్రారంభించి ఆ సీజన్లో 1.11లక్షల టన్నుల చెరుకును గానుగాడించారు. ఇదే సీజన్కు సంబంధించి రూ.34.31 కోట్లు రైతులకు  ఇవ్వాల్సి ఉంది. ఇందులో అనేక ఒత్తిళ్ల మేరకు 6 నెలల క్రితం రూ.21.61 కోట్లను రైతులకు చెల్లించారు. మిగిలిన రూ.12.69 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఫ్యాక్టరీని గతేడాది జులైలో టెంపరరీగా మూసేశారు. క్రషింగ్ సీజన్ ముగిసి ఏడాది గడుస్తున్నా  రైతులకు ఇవ్వాల్సిన బకాయి బిల్లులు ఇస్తలేరు. బిల్లుల కోసం రైతులు ఫ్యాక్టరీ ముందు ఆమరణ నిరాహార దీక్షలు కూడా  చేశారు. 
ఇక్కడి చెరుకు కర్ణాటకకు..
ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీని నమ్ముకుని 2020–-21సీజన్లో 32 వేల ఎకరాల్లో రైతులు చెరుకు పంట వేశారు. వర్షాలు బాగా పడడం వల్ల పంట దిగుబడి కూడా బాగా వచ్చింది. సుమారు 7 లక్షల టన్నుల చెరుకు దిగుబడి వచ్చినట్టు కేన్ డిపార్ట్ మెంట్ ఆఫీసర్లు ప్రకటించారు. ఈసారి ఫ్యాక్టరీలో క్రషింగ్ ఉంటుందా? ఉండదా? అనే అనుమానంతో నెల రోజులపాటు చెరుకు కట్చేయకుండా అలాగే ఉంచారు. సీజన్ దాటి పోతున్నా ఫ్యాక్టరీ తెరవకపోవడంతో రైతులు పక్కనే ఉన్న కర్ణాటకకు పంటను తరలించి తక్కువ ధరకు అమ్ముకున్నారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా నెత్తిన పడడంతో ఆర్థికంగా నష్టపోయారు. ఈ క్రమంలో ఫ్యాక్టరీ యాజమాన్యంపై నమ్మకం పోయిన రైతులు పెండింగ్ బిల్లులు కోసం ఆందోళన తీవ్రతరం చేశారు. దీంతో యాజమాన్యం నుంచి బిల్లులు ఇప్పించి, ఫ్యాక్టరీ రీ ఓపెన్కు ప్రయత్నించాల్సిన ప్రభుత్వం అలా చేయకుండా ఫ్యాక్టరీ ఆస్తులు తెగనమ్మి రైతులకు బిల్లులు చెల్లించాలని నిర్ణయించింది. 
1972లో నిజాం పేరుతో షురూ..
1972లో జహీరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న  ఎం.బాగారెడ్డి కృషితో అప్పటి ప్రభుత్వం నిజాం షుగర్స్ మధునగర్ యూనిట్-3 పేరుతో జహీరాబాద్ మండలం కొత్తూరు (బి) గ్రామ శివారులో ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. 115 ఎకరాల్లో ఫ్యాక్టరీతో పాటు ఆఫీసర్లు, కార్మికుల కుటుంబాలు నివాసం ఉండేందుకు క్వార్టర్స్ కూడా నిర్మించారు. నిజాం ఫ్యాక్టరీ నష్టాల్లో ఉన్నదన్న సాకుతో 2002లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు  రూ.18.5 కోట్లకు గణపతి షుగర్స్ కు అమ్మేశారు. మూడేళ్లు నడిపిన గణపతి యాజమాన్యం 2006లో రాజశ్రీ గ్రూపునకు విక్రయించింది. రాజశ్రీ గ్రూపు యాజమాన్యం 2015లో న్యాటమ్స్ ట్రైడెంట్ యాజమాన్యానికి అమ్మింది. మూడేళ్ల పాటు ఫ్యాక్టరీని నడిపిన ట్రైడెంట్ యాజమాన్యం చెరుకు తీసుకోవడంతో పాటు బిల్లుల చెల్లింపుల్లో మొదటినుంచీ రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చింది. 2020–-21 సీజన్లో క్రషింగ్ నిర్వహించకుండా బకాయిలు రూ.12 కోట్లు ఇవ్వకుండా ఆపేసింది.

బకాయిలు ఇచ్చి తెరిపించాలి 
ట్రైడెంట్ ఫ్యాక్టరీ రైతులకు బకాయి పడిన బిల్లులు వెంటనే చెల్లించి ఫ్యాక్టరీని తిరిగి పునరుద్ధరించాలి. స్థానికంగా ఉన్న చెరుకు ఫ్యాక్టరీతో చేసుకున్న ఒప్పందం ప్రకారమే ఏడెకరాల్లో ప్రతి సీజన్లో చెరుకు పండిస్తున్నా. పోయినేడుకు సంబంధించి ఇంకా రెండు లక్షలు రావాల్సి ఉన్నది. బయట ప్రైవేటు ఫైనాన్స్లో  అప్పుచేసి మిత్తిలు కడుతూ ఇబ్బంది పడుతున్న. కొత్తగా మళ్లీ పంట వేసిన. ఫ్యాక్టరీ మాత్రం ఇంకా తెరుచుకోలేదు. –అంజయ్య, చెరుకు రైతు, మొగుడంపల్లి.
ఫ్యాక్టరీనే నమ్ముకున్నం
దాదాపు 50 ఏళ్ల చరిత్ర గల చెరుకు ఫ్యాక్టరీని నమ్ముకొని వ్యవసాయం చేస్తున్న. ఈ రెండు మూడేళ్ల నుంచి పంట తీసుకోవడంలోనూ బిల్లులు చేయడంలోనూ ఫ్యాక్టరీ యాజమాన్యం సతాయిస్తున్నది. టెంపరరీగా మూసేస్తున్నామని చెప్పి ఇప్పుడు పర్మినెంట్గా మూసే ప్రయత్నం చేయడం బాగాలేదు. యాజమాన్యంతో జిల్లా ఆఫీసర్లు, లీడర్లు చర్చలు జరిపి మళ్లీ తెరిపించాలి. -మల్లికార్జున్ రెడ్డి, చెరుకు రైతు, ధనసిరి

మరో ఉద్యమం తప్పదు..
జహీరాబాద్ ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలి. లేకుంటే చెరుకు రైతుల పక్షాన మరో ఉద్యమానికి తెర లేపుతం. ఈ ప్రాంతంలో చెరుకు పంట దిగుబడికి ఎక్కువ ఆస్కారం ఉన్నందున ఫ్యాక్టరీ తప్పనిసరి. లేకుంటే పక్క రాష్ట్రానికి వెళ్లి చెరుకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుంది. పాలకులు రైతుల గురించి ఆలోచించి ప్రభుత్వం తరఫున ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చలు జరిపి పునరుద్ధరించాల్సిందే.- పల్లె సిద్దిరాములు గౌడ్, కన్వీనర్, నిజాం షుగర్స్ జేఏసీ