సూర్యాపేట, వెలుగు: సర్పంచులు గ్రామాల్లో సమస్యలను పరిష్కరించాలని ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ సూచించారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు, లంబాడి హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు భూక్య రాజు నాయక్ అధ్యక్షతన గిరిజన సర్పంచులను సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్మాట్లాడుతూ.. దేశంలో రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి లేని చెక్ పవర్ సర్పంచ్‌కు మాత్రమే ఉందన్నారు. డైరెక్ట్‌గా సంతకం పెట్టి నిధులను గ్రామ అభివృద్ధికి ఉపయోగించుకోవచ్చని తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులను సద్వినియోగం చేసుకుంటూ తండాల అభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. ట్రైకార్ నుంచి కూడా నిధులిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం సమితి న్యూ ఇయర్క్యాలెండర్ఆవిష్కరించారు. సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాంబల్‌నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరావత్ భిక్షం నాయక్, జాతీయ ప్రధాన కార్యదర్శి భూక్య కోటియా నాయక్, మాజీ ఎంపీపీ ధరావత్ వీరన్న నాయక్, నాయకులు బానోత్ నందులాల్, మోతీలాల్, వాంకుడోత్ వెంకన్న, ధరావత్ అజయ్ తదితరులు పాల్గొన్నారు.
