ట్రిగనామెట్రీ.. ఇండియాను చూపించింది!

ట్రిగనామెట్రీ.. ఇండియాను చూపించింది!

ఎన్ని జనరేషన్లు మారినా స్కూళ్లలో చాలా మంది పిల్లలకు అర్థం కానీ బ్రహ్మపదార్థం ఏదైనా ఉందంటే గణితమే. అందులోనూ ట్రిగనామెట్రీ! త్రికోణమితి!!  సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా అంటూ సారు పాఠం చెబుతుంటే, అదేంటో తెలీక కళ్లు మూతలు పడతాయి. స్వర్గంలో తేలుతున్నాం అనుకుంటుండగా, స్కూల్ బెల్లు మోగి మెలకువ వస్తుంది. ఈలోగా టీచర్ పాఠం అయిపోయిందంటారు. మళ్లీ ట్రిగనామెట్రీ గురించి తెలుసుకోవాలంటే అష్టకష్టాలు పడాలి. రియల్ టైమ్ అప్లికేషన్లలో ట్రిగనామెట్రీని టీచర్లు, స్టూడెంట్స్ కు చెప్పకపోవడం వల్లే ఇదంతా జరుగుతోంది.

ఇప్పుడైతే శాటిలైట్స్ ఇవీ ఉన్నాయి. మన ప్రపంచం ఎలా ఉందో వెళ్లి గూగుల్ ఎర్త్ లో చూసేసుకుంటున్నాం. మరీ టెక్నాలజీ లేక ముందో? కార్టోగ్రాఫర్స్ ఉండేవాళ్లు. ట్రిగనామెట్రీ సూత్రాలను నావగా మలిచి ప్రపంచ చిత్ర పటాల ఊహారేఖలను కలిపారు. ఇండియాకు అతి దక్షిణాన ఉన్న ఇందిరా పాయింట్ నుంచి ఉత్తరాదినున్న కాశ్మీర్, వాయువ్యాన ఉన్న పాకిస్థాన్ మ్యాప్స్ ను గీశారు. అప్పట్లో మనకు దిక్సూచిగా మారాయి. అయితే ఇందుకోసం వాళ్లు కొన్నేళ్లపాటు శ్రమించాల్సివచ్చింది.

ది గ్రేట్ ట్రిగనామెట్రికల్ సర్వే ఆఫ్ ఇండియా

ట్రిగనామెట్రీతో ఇండియాను కొలిచి మ్యాప్స్ తయారు చేయొచ్చనే ఐడియా బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ విలియమ్ లాంబ్టన్ ది. ట్రిగనామెట్రీతో మాత్రమే సైంటిఫిక్ గా ఇండియా అణువణువును కొలవచ్చని ఆయన నమ్మారు. బెంగాల్ అట్లాస్ ఫెయిల్యూర్ ను దృష్టిలో పెట్టుకుని ‘ట్రైయాంగ్యులేషన్’ అనే కొత్త టెక్నిక్ ను తీసుకొచ్చారు. తొలిసారి మద్రాసులోని సెయింట్ థామస్ మౌంట్ పై ఓ ట్రైయాంగిల్ బేస్ లైన్ ఏర్పాటు చేశారు. ఎంతో శ్రద్ధతో రెండు పాయింట్స్ నుంచి మూడో పాయింట్ కున్న లైన్ ఆఫ్ సైట్ ను లెక్కించారు. ఆ తర్వాత ట్రయాంగిల్ మూడు పాయింట్ల ఇంటీరియర్ యాంగిల్స్ ను లాంబ్టన్ గుర్తించారు. వీటి సాయంతో రెండు సైడ్ లైన్స్ పొడవును లెక్కించారు. వీటి సాయంతో మూడో పాయింట్ కచ్చితంగా ఎక్కడ ఉందో కనిపెట్టారు. ఆ తర్వాత రెండు సైడ్ లైన్స్ సాయంతో, కొత్త ట్రయాంగిల్స్ ను క్రియేట్ చేసుకుంటూ మద్రాస్ మొత్తాన్ని లెక్కించేశారు. భారత ఉపఖండాన్ని కొలవడానికి ట్రయాంగిల్స్ టెక్నిక్ ను వాడాలనే నిర్ణయానికి వచ్చారు. ఆ తర్వాతి కాలంలో లాంబ్టన్ మ్యాప్స్ సర్వేకు ‘ది గ్రేట్ ట్రిగనామెట్రికల్ సర్వే ఆఫ్ ఇండియా’ అని బ్రిటిషర్లు పేరు పెట్టారు.

ది గ్రేట్ థియోడొలైట్

ట్రయాంగిల్స్ హారిజాంటల్, వర్టికల్ యాంగిల్స్ ను కొలిచేందుకు లాంబ్టన్ కనుగొన్న పరికరమే ది గ్రేట్ థియోడొలైట్. ఈ పరికరం దాదాపు 500 కేజీల బరువుండేదట. దాదాపు 12 మంది దీన్ని మోసుకొని వెళ్లేవారని ది గ్రేట్ ఆర్క్ పుస్తకంలో బ్రిటిష్ చరిత్రకారుడు జాన్ కే రాశారు. అప్పట్లో కావేరి డెల్టాలో చెట్లు విపరీతంగా ఉండేవి. దీంతో లైన్ ఆఫ్ సైట్ అబ్జర్వేషన్ చాల కష్టమైంది. దీంతో దేవాలయాల గోపురాలపైకి థియోడొలైట్ తో ఎక్కి అబ్జర్వేషన్స్ తీసుకోవాలని లాంబ్టన్ ఆదేశించారట! తంజావూరులోని బృహదీశ్వర దేవాలయంపైకి థియోడొలైట్ ను ఎక్కిస్తున్నప్పుడు, అది పట్టు జారి గోపురానికి తగిలింది. దీంతో ఆలయ గోపురం, థియోడొలైట్ రెండూ దెబ్బతిన్నాయి. మరలా అబ్జర్వేషన్ల కోసం లాంబ్టనే స్వయంగా థియోడొలైట్ ను బాగు చేశారు.

ది గ్రేట్ ఆర్క్

ది గ్రేట్ ట్రిగనామెట్రికల్ ఇండియా సర్వే అంతా ది గ్రేట్ ఆర్క్ ఆఫ్ మెరిడియన్ మీద ఆధారపడే జరిగింది. కన్యాకుమారికి దగ్గరలోని 78 డిగ్రీల రేఖాంశం వద్ద కొన్ని ట్రయాంగిల్స్ ను లాంబ్టన్ గీశారు. ఈ ట్రయాంగిల్స్ వరుసనే గ్రేట్ ఆర్క్ ఆఫ్ మెరిడియన్ అని పిలుస్తారు. ట్రాపికల్ ప్రాంతాలు కావడంతోనే ఎరస్తోనియస్ వాడిన ఆర్క్ టెక్నిక్ ను లాంబ్టన్ ఇక్కడ వాడారు. 1823లో లాంబ్టన్ చనిపోయారు. ఆ తర్వాత మరో బ్రిటిష్ ఆఫీసర్ ఆండ్రూ స్కాట్ వా ఈ పనిని భుజాలకు ఎత్తుకున్నారు. 1843లో ఆండ్రూ ఇండియా సర్వేయర్ జనరల్ గా నియమితులయ్యారు. 1856లో అతి ఎత్తైన పర్వతాన్ని కనుగొన్నట్లు ఆండ్రూ ప్రకటించారు. ఆ శిఖరానికి తన కంటే ముందు ఈ ప్రాజెక్టులో పని చేసిన జార్జ్ ఎవరెస్ట్ పేరు మీదుగా ఎవరెస్ట్ అని నామకరణం చేశారు. బ్రిటిషర్లు చేసిన సర్వే వల్ల రోడ్లు, రైలు, టెలిగ్రాఫ్ మార్గాలు అభివృద్ధి చెందాయి. ప్రస్తుతం ఇలాంటి ఆపరేషన్లకు సర్వే ఆఫ్ ఇండియా, నావిక్ శాటిలైట్ సిస్టం సాయం చేస్తున్నాయి.

ఆస్ట్రోనమీ,
టోపోగ్రఫీ టెక్నిక్స్ ఫెయిల్

అది 18వ శతాబ్దం. భారత ఉపఖండంలో బ్రిటిష్ రాజ్యం శరవేగంగా విస్తరిస్తున్న సమయం. అఖండ భారతదేశాన్ని రాజకీయంగా, మిలటరీ పరంగా అదుపులో ఉంచుకోవాలంటే ‘మ్యాప్’ అవసరమని బ్రిటిషర్లు గుర్తించారు. తొలిసారిగా ‘బెంగాల్ అట్లాస్’ను ఆస్ట్రోనమీ అబ్జర్వేషన్స్, టోపోగ్రఫీ మెజర్ మెంట్స్ సాయంతో తయారు చేయించారు. చాలాకాలం పట్టినా ఈ ప్రయత్నం సరైన ఫలితాన్నివ్వలేదు. మ్యాప్స్ తప్పుల తడకగా వచ్చాయి.