బీజేపీ కార్యకర్తలకు తృణమూల్​ ఎమ్మెల్యే వార్నింగ్​

బీజేపీ కార్యకర్తలకు తృణమూల్​ ఎమ్మెల్యే వార్నింగ్​
  • ఓటేసేందుకు బయటకు రావొద్దంటూ బెదిరింపులు

కోల్​కతా: బీజేపీకి ఓటెయ్యొద్దంటూ తృణమూల్​ కాంగ్రెస్​ ఎమ్మెల్యే బెదిరింపులకు దిగారు. బీజేపీ కార్యకర్తలెవరైనా బయటకు వచ్చి ఓటేస్తే.. ఆ తర్వాత జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. వచ్చే నెల 12న పశ్చిమ బెంగాల్​లోని అసన్సోల్​ లోక్​సభ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలోనే ఆ లోక్​సభ నియోజకవర్గంలో భాగమైన పాండవేశ్వర్​ ఎమ్మెల్యే నరేన్​ చక్రవర్తి కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ మీటింగ్​ సందర్భంగా బీజేపీకి హార్డ్​కోర్​ అభిమానులపై ఓ కన్నేసి ఉంచాలని, అవసరమైతే బెదిరించాలని సూచించారు. ‘‘పోలింగ్​ రోజు బయటకు రావొద్దని వాళ్లకు చెప్పండి. ఓటేస్తే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించండి. పోలింగ్​ రోజు బయటకొస్తే.. బీజేపీకే ఓటేసినట్టు అనుకుంటామని వారికి చెప్పండి. ఇంట్లోనే ఉంటే మాకు మద్దతిచ్చినట్టు అనుకుంటామని వివరించండి. పోలింగ్​ నాడు బయటకు రాకుండా ఉంటే అన్ని విషయాల్లో సాయం చేస్తామనండి’’ అంటూ ఆయన టీఎంసీ​ కార్యకర్తలను రెచ్చగొట్టారు. ఆ వీడియో కాస్తా వైరల్​ అయింది. 

బీజేపీ నేతల మండిపాటు

తృణమూల్​ పార్టీ తీరుపై బీజేపీ నేతలు మండిపడ్డారు. వీడియోను జతచేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. నరేన్​ చక్రవర్తి వీడియోను పోస్ట్​ చేసిన బీజేపీ ఐటీ సెల్​ చీఫ్​ అమిత్​ మాలవీయ.. ఇలాంటి నేరస్థులను మమత బెనర్జీ పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. నరేన్​ చక్రవర్తికి ముందునుంచే నేర చరిత్ర ఉందని బీజేపీ బెంగాల్​ చీఫ్​ సువేందు అధికారి మండిపడ్డారు. బహిరంగంగా బెదిరింపులకు దిగిన నరేన్​పై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. కాగా, ఎంపీ బాబూల్​ సుప్రియో.. బీజేపీని వీడి టీఎంసీ​లో చేరడంతో ఆ స్థానం ఖాళీ అయింది. దీంతో అక్కడ ఉప ఎన్నిక జరగనుంది.