
- నాన్ పర్మనెంట్ మెంబర్‌షిప్ కోసం ఆ దేశానికి భారత్ సపోర్ట్
- సంయుక్తంగా ప్రకటించిన ఇరు దేశాలు
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కోసం తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రకటించింది. 2028–29కి గాను నాన్ పర్మనెంట్ మెంబర్‌షిప్ కోసం కూడా సపోర్టు చేస్తామని తెలిపింది. అలాగే 2027–28కి గాను యూఎన్‌ఎస్సీలో ట్రినిడాడ్ అండ్ టొబాగోకు నాన్ పర్మనెంట్ మెంబర్‌షిప్ కోసం తాము మద్దతు ఇస్తామని భారత్ ప్రకటించింది.
ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటనలో భాగంగా శనివారం ఆ దేశ అధ్యక్షురాలు క్రిస్టెన్ కార్లా కంగా, ప్రధాని కమ్లా పెర్సాద్ బిస్సేసర్‌తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. అనంతరం రెండు దేశాలు ప్రకటన చేశాయి. ‘‘ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు రావాలి. భద్రతా మండలిని విస్తరించాలి. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొంది. ఏ సమస్యకైనా చర్చలు, దౌత్య మార్గాలే పరిష్కారం” అని ప్రకటనలో పేర్కొన్నాయి. ఉగ్రవాదంపై కలసికట్టుగా పోరాటం చేయాలని నిర్ణయించాయి.
వివిధ రంగాలపై చర్చలు..
రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ట్రినిడాడ్ ప్రధాని కమ్లా పెర్సాద్‌తో మోదీ చర్చించారు. డిఫెన్స్, అగ్రికల్చర్, హెల్త్‌కేర్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, యూపీఐ పేమెంట్స్, కెపాసిటీ బిల్డింగ్ తదితర రంగాల్లో పరస్పరం సహకారం అందించుకోవాలని ఇరు దేశాల నేతలు నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆరు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఫార్మా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కల్చర్, స్పోర్ట్స్, డిప్లమాటిక్ ట్రైనింగ్‌కు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
అర్జెంటీనాకు చేరుకున్న ప్రధాని..
ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటన ముగించుకున్న మోదీ అర్జెంటీనాకు చేరుకున్నారు. ఆ దేశ రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లోని ఎజీజా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి హోటల్‌కు చేరుకున్న మోదీకి ప్రవాస భారతీయులు వెల్‌కమ్ చెప్పారు. ‘మోదీ..మోదీ’, ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేశారు. కాగా, 57 ఏండ్ల తర్వాత ద్వైపాక్షిక సమావేశాల కోసం అర్జెంటీనాకు భారత ప్రధాని వెళ్లారు.
ట్రినిడాడ్ మహిళా క్రికెటర్లకు భారత్ లో ట్రైనింగ్: మోదీ
ట్రినిడాడ్ లో క్రికెట్ అభివృద్ధికి సహకారం అందజేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. ఆ దేశ మహిళా క్రికెటర్లకు భారత్‌లో ట్రైనింగ్ ఇస్తామని తెలిపారు. ఆ దేశంలోని భారత సంతతి పౌరుల్లో ఆరో తరం వరకూ ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా కార్డులు అందజేస్తామని ప్రకటించారు. ‘‘ట్రినిడాడ్ అభివృద్ధికి భారత సంతతి ప్రజలు ఎంతో కృషి చేస్తున్నారు. అన్ని రంగాల్లోనూ మీరంతా కలిసి మంచి దేశాన్ని నిర్మించారు” అని అన్నారు.