2వేల మంది టర్కీ-అజర్‌బైజాన్ పర్యటనలు రద్దు.. దేశమే ముందంటున్న ఇండియన్స్

2వేల మంది టర్కీ-అజర్‌బైజాన్ పర్యటనలు రద్దు.. దేశమే ముందంటున్న ఇండియన్స్

పహల్గామ్ దాడి తర్వాత కూడా పాకిస్థాన్ కి అండగా నిలుస్తూ భారత్ పై దాడికి డ్రోన్లను టర్నీ సరఫరా చేయటం బయటపడింది. ప్రపంచానికి ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్న పాకిస్థానుకు టర్కీ, అజర్‌బైజాన్ అండగా నిలవటంపై ప్రస్తుతం భారతదేశంలో తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలో దేశమే ముందంటున్న టూరిస్టులు వరుసగా తమ పర్యాటక ప్రయాణాలను ఈ రెండు దేశాలకు రద్దు చేసుకుంటున్నారు.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఏకంగా 2వేల మంది భారతీయ పర్యాటకులు తమ బుకింగ్స్ ఈ రెండు దేశాల్లో రద్దు చేసుకున్నట్లు వెల్లడైంది. మే నుంచి జూలై మధ్య కాలంలో తమ పర్యటనలను వారు రద్దు చేసుకున్నట్లు తేలింది. మెుత్తానికి దాదాపు 5 శాతం మంది ప్రయాణికులు తమ టూర్ క్యాన్సిల్ చేసుకున్నట్లు తేలింది. ప్రముఖ ట్రావెల్ ఫ్లాట్ ఫారమ్ యాత్ర సీఓఓ మాట్లాడుతూ 50 శాతం హాలిడే ప్యాకేజీలు ఈ రెండు దేశాలకు క్యాన్సిల్స్ చూస్తున్నట్లు వెల్లడించారు. ఇదే క్రమంలో క్లియర్ ట్రిప్ క్యాన్సిలేషన్స్ 260 శాతం పెరిగాయని పేర్కొంది. 

 

ఇదే క్రమంలో ప్రముఖ దేశీయ వ్యాపారవేత్త హర్ష గోయంకా తన ఎక్స్ ఖాతాలో కీలక పోస్ట్ చేశారు. టర్కీ, అజర్ బైజాన్ దేశాలకు టూరిజం రూపంలో గత ఏడాది భారత్ రూ.4వేల కోట్ల కంటే ఎక్కువ ఆదాయాన్ని అందించిందని పేర్కొన్నారు. ఇది అక్కడి ఆర్థిక వ్యవస్థను, హోటల్స్, విమానయానం సహా అనేక రంగాల్లో ఉపాధి అవకాశాలను కల్పించిందని అన్నారు. కానీ పహల్గామ్ దాడి తర్వాత ఆ దేశాలు పాకిస్థాన్ వెంట నిలబడటాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రపంచంలో అలాగే మనదేశంలో ఆ రెండు దేశాల కంటే అందమైన అనేక ప్రాంతాలు ఉన్నాయన్నారు గోయంకా. ఈ క్రమంలో ప్రజలు టర్కీ, అజర్బైజాన్ కు వెళ్లటాన్ని మానుకోవాలని సూచించారు.