‘ట్రిపుల్‌ విన్‌’తో మస్త్‌ అవకాశాలు.. జర్మన్‌, ఇతర భాషలపై పట్టుసాధిస్తే గ్లోబల్‌గా మంచి ఉపాధి: మంత్రి వివేక్‌ వెంకటస్వామి

‘ట్రిపుల్‌ విన్‌’తో మస్త్‌ అవకాశాలు.. జర్మన్‌, ఇతర భాషలపై పట్టుసాధిస్తే గ్లోబల్‌గా మంచి ఉపాధి: మంత్రి వివేక్‌ వెంకటస్వామి
  • మోడ్రన్‌ టెక్నాలజీతో గొప్ప విజయాలు సాధించొచ్చు
  • రాష్ట్రంలో మరిన్ని నర్సింగ్​ కాలేజీల ఏర్పాటు.. సీట్ల పెంపునకు కృషిచేస్తా
  • సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని వెల్లడి
  • టామ్ కామ్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న నర్సులతో ముఖాముఖి 

హైదరాబాద్​, వెలుగు: ‘ట్రిపుల్‌ విన్‌’ ప్రోగ్రామ్‌లో భాగంగా శిక్షణ పొందుతున్న నర్సులకు ప్రపంచస్థాయిలో మంచి అవకాశాలుంటాయని మంత్రి వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. జర్మన్ భాషతోపాటు కమ్యూనికేషన్ నైపుణ్యాలపై పట్టు సాధించాలని సూచించారు. ఎక్కువ భాషలు నేర్చుకుంటే ఉపాధి ఈజీ అవుతుందన్నారు. తెలంగాణ యువత కొత్త సంస్కృతులు, అవకాశాలకు అంకితభావంతో, ఆత్మవిశ్వాసంతో అలవాటు పడితే అంతర్జాతీయ స్థాయిలో రాణించే  సామర్థ్యం ఉందని తెలిపారు. 

రాష్ట్రంలో మరిన్ని నర్సింగ్ కళాశాలలు, సీట్ల పెంపుపై సీఎం రేవంత్‌‌రెడ్డితో చర్చిస్తానని అన్నారు.  ట్రిపుల్ విన్ ప్రోగ్రామ్‌‌లో భాగంగా శిక్షణ పొందుతున్న నర్సులతో  మంత్రి వివేక్‌‌ వెంకటస్వామి  మంగళవారం టూరిజం ప్లాజాలో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి అంతర్జాతీయ నర్సింగ్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. “నర్సులు రోగులకు ఇచ్చే ధైర్యం, నమ్మకంతోనే సగం వ్యాధి తగ్గిపోతుంది. మీ పాత్ర ఎంతో గొప్పది” అని  పేర్కొన్నారు. జర్మనీలో పని చేయడం ఒక పెద్ద అవకాశం మాత్రమే కాదని.. చాలెంజ్‌‌ కూడా అని తెలిపారు. కొత్త భాష, కొత్త వాతావరణం, కొత్త విధానాలకు అలవాటు పడాల్సి ఉంటుందని, అయితే కష్టపడి నేర్చుకుంటే విజయాన్ని సాధించవచ్చని పేర్కొన్నారు. 

 జర్మనీలో ఈ బ్యాచ్ మంచి ప్రతిభ కనబరిస్తే, భవిష్యత్తులో మరింత మంది తెలంగాణ యువతకు అవకాశాలు వస్తాయని చెప్పారు.  జర్మన్ భాషపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, డాక్టర్లు సూచించిన మందులను రోగులకు సరిగ్గా అందించేందుకు కమ్యూనికేషన్ చాలా కీలకమని తెలిపారు. సినిమాలు చూడటంతో పాటు ప్రస్తుతం ఆన్‌‌లైన్ ద్వారా కూడా భాషలను సులభంగా నేర్చుకునే అవకాశాలు ఉన్నాయని వివరించారు. టామ్‌‌కామ్ కార్యక్రమాల కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌‌లో ప్రత్యేక నిధులు కేటాయించిందని చెప్పారు. జర్మనీలో ఇప్పటికే నర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్న వారితో మంత్రి ఆన్‌‌లైన్ ద్వారా మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకున్నారు. నర్సులు ఎదుర్కొంటున్న సమస్యలు, అవసరాల గురించి ప్రభుత్వానికి తెలియజేయాలని కోరగా.. సానుకూలంగా స్పందించారు. 

టెక్నాలజీని వాడుకోవాలి..

నర్సులతో ముఖాముఖిలో మంత్రి  వివేక్‌‌ వెంకటస్వామి తన  వ్యాపార అనుభవాలను గుర్తుచేసుకున్నారు. “నేను కేవలం రూ.5 లక్షలతో వ్యాపారం ప్రారంభించా. మద్రాస్‌‌లో బ్యాంక్ లోన్ కోసం వెళ్లినప్పుడు భాష తెలియక ఇబ్బంది పడ్డా. అప్పుడు భాష ప్రాధాన్యత నాకు అర్థమైంది” అని తెలిపారు. 

తమిళనాడులో విజయ్ గెలుపును ఉదహరిస్తూ.. మోడ్రన్‌‌ టెక్నాలజీ, సోషల్ మీడియా, కమ్యూనికేషన్ నైపుణ్యాలను సమర్థంగా ఉపయోగించుకుంటే గొప్ప విజయాలు సాధించవచ్చని చెప్పారు. తమిళనాడులో దళపతి విజయ్‌‌..సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలతో జనాలకు  ఈజీగా రీచ్ అయ్యారని తెలిపారు. ప్రతిరోజూ కనీసం గంట సమయం కేటాయించి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని, జర్మన్ పుస్తకాలు చదివే స్థాయికి ఎదగాలని నర్సులకు సూచించారు. 

విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం  ప్రత్యేక చర్యలు : హరిచందన

విదేశీ ఉద్యోగావకాశాల కోసం రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని లేబర్, ఎంప్లాయ్‌‌మెంట్‌‌ అండ్ ట్రైనింగ్ సెక్రటరీ హరిచందన పేర్కొన్నారు. టామ్‌‌కామ్ టీం మంచి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తోందని తెలిపారు. తాను మొదటిసారి హిందీ భాష నేర్చుకునే సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు. తన తండ్రి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేవారని, హిందీ సినిమాలు చూస్తూ మెల్లగా భాష నేర్చుకున్నానని చెప్పారు.  

తాను ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి అప్పట్లో లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేశానని, కానీ ఇప్పుడు ప్రభుత్వం మీకు ఉచితంగానే నేర్పిస్తున్నదని తెలిపారు. నర్సులు కమిట్‌‌మెంట్‌‌తో జర్మన్ భాష నేర్చుకోవాలని సూచించారు. టామ్‌‌కామ్ సంస్థ జర్మనీలోని ఫెడరల్ ఎంప్లాయ్‌‌మెంట్ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకుందని టామ్‌‌కామ్ డైరెక్టర్ కాంతి వెస్లీ తెలిపారు. ఇప్పటివరకు 46 మంది నర్సులు జర్మన్ భాష శిక్షణ పూర్తి చేసుకోగా, వారిలో 15 మందికి ఆఫర్ లెటర్లు వచ్చాయని వివరించారు. ఇప్పటికే ఏడుగురు జర్మనీలో ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు.