ఇండియా-పాక్ మ్యాచ్ : యాడ్స్ ట్రోలింగ్ మామూలుగా లేదు

ఇండియా-పాక్ మ్యాచ్ : యాడ్స్ ట్రోలింగ్ మామూలుగా లేదు

ఇండియాలో క్రికెట్ అనేది ఓ ఎమోషన్. దాంతో.. ఆడుకోవడానికి ఎవరు ట్రై చేసినా చీరి చింతకు కడుతున్నారు మన అభిమానులు. ఇండియన్స్ ను కించపరిచేలా పాకిస్థాన్ యాడ్ చేస్తే.. తూ మీ బతుకు చెడ అంటున్నారు. ఇండియా స్థాయి తగ్గిస్తూ.. పాకిస్థాన్ ను ట్రోల్ చేసినా కూడా సన్నాసి తెలివితేటలు అంటూ తిట్టిపోస్తున్నారు. కామెంట్లతో అగ్గిపుట్టిస్తున్నారు. మీమ్స్ తో గత్తర లేపుతున్నారు.

జూన్ 16న ఇండియా – పాకిస్థాన్ మధ్య వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ జరగబోతోంది. ఇండియా – పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఒకప్పుడు నరాలు తెగిపోయేంత టెన్షన్ ఉండేది. రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలే కారణం కావొచ్చు. ఐతే… ఆ ఉద్రిక్తత ఆటలోనూ కనిపించింది. ఎందుకంటే.. ఒకప్పుడు ఇండియా, పాకిస్థాన్ రెండు జట్లు బలంగా ఉండేవి. ఆటే అయినా.. అది నిజం యుద్ధమే అన్నంత ఫీల్ ఉంటేది. అందుకే.. మ్యాచ్ ఆసక్తి రేపేది. వరల్డ్ కప్ లో పాకిస్థాన్ తో మ్యాచ్ అంటే ఇండియా గెలవడం ఆనవాయితీ అయిపోయింది.

ఇండియా-పాక్ మ్యాచ్ అంటే ఇప్పుడు అప్పటంత సీన్ లేదు. ఇపుడు ఇండియా మాత్రమే స్ట్రాంగ్ టీమ్. పాకిస్థాన్ కు అంత సీన్ లేదు. ఆటను ఆటలాగే చూడాలన్న అభిప్రాయం కూడా పెరిగిపోయింది. ఐనా కూడా.. వరల్డ్ కప్ లో రెండు దేశాల మధ్య భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు అటు పాక్ మీడియా, ఇటు ఇండియన్ స్పోర్ట్స్ మీడియా చేసిన ప్రయత్నాలు ఫెయిలయ్యాయి.

అభినందన్ లా ఓ వ్యక్తికి గెటప్ వేసి.. వెకిలి యాడ్ తయారుచేసింది పాకిస్థాన్ మీడియా. “మళ్లీ పాక్ కు కప్ తీసుకొద్దాం” అంటూ రూపొందించిన యాడ్ లో ‘ఓ వార్ హీరో’ను కించపరిచారంటూ దుమ్మెత్తిపోస్తున్నారు క్రీడాభిమానులు. ఇండియా – పాక్ మ్యాచ్ క్రేజ్ పెంచేందుకు ఇలాంటి సిగ్గుమాలిన యాడ్ తీస్తారని అనుకోలేదంటూ సీరియస్ అవుతున్నారు.

దీనికి కౌంటర్ గా స్టార్స్ స్పోర్ట్స్ ఇండియా మరో యాడ్ రిలీజ్ చేసింది. ఇండియాకు సపోర్ట్ గానే ఉన్నా కూడా… ఈ యాడ్… ట్రోలింగ్ నుంచి తప్పించుకోలేకపోయింది. పాక్ పై భారత్ గెలుపు ఖాయమేననీ.. జూన్ 16న ఫాదర్స్ డే ఎంజాయ్ చేద్దాం అంటూ.. స్టార్ స్పోర్ట్స్ యాడ్ తీసింది. ఇంత దరిద్రంగా రేసిజంతో కూడిన యాడ్ తీస్తారనుకోలేదంటూ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. హ్యూమర్ ఏదైనా సరదాగా ఉండాలి కానీ.. ఫాదర్స్ డే అంటూ కించపరిచేలా ఉండొద్దని కొందరన్నారు. మౌకా మౌకా యాడ్ ఎంత బాగుందో.. ఇది అంత చెండాలంగా ఉందని నెటిజన్స్ అంటున్నారు.

 

క్రికెట్ మ్యాచ్ చూసే ప్రేక్షకులను ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దు. ఎమోషన్ ను బ్యాలెన్స్ చేయడం వారికి బాగా తెలుసన్నసంగతి యాడ్ మేకర్స్ కే తెలియడం లేదు.