అంగట్ల పత్తి అడ్డికి పావుశేరే! సీసీఐ సెంటర్‌లో తూకాల్లో భారీ మోసం

అంగట్ల పత్తి అడ్డికి పావుశేరే! సీసీఐ సెంటర్‌లో తూకాల్లో భారీ మోసం

రాష్ట్రంలో ఎక్కడా మద్దతు ధర దక్కట్లే

సీసీఐ సీన్​లో లేకపోవడంతో దళారుల దందా

నవంబర్​ ఫస్ట్​ వీక్​లో తెరుచుకోనున్న సీసీఐ సెంటర్లు

తేమ 12% లోపు ఉంటేనే కొంటామంటున్న ఆఫీసర్లు

ఫస్ట్​ పికింగ్​లో 8 నుంచి 12% కష్టమంటున్న రైతులు

ఇదే అదునుగా అగ్గువకు కొంటున్న ప్రైవేట్​వ్యాపారులు

వెలుగు, నెట్​వర్క్​: ఈ వానకాలం సీజన్​లో ఫస్ట్​ టైం పత్తి ఏరుకొని మార్కెట్లకు తెస్తున్న రైతులకు మద్దతు ధర దక్కుతలేదు. జిల్లాల్లో ఇంకా పూర్తిస్థాయిలో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటే కాలేదు. సీసీఐ పాయింట్లు తెరుచుకున్న ఒకటి, రెండు చోట్ల తేమసాకుతో పెద్దగా కొంటలేరు. 8 నుంచి 12శాతం లోపు మాయిశ్చర్​​ ఉంటేనే ఎంఎస్​పీతో కొంటామని ఆఫీసర్లు అంటున్నరు. కానీ ఇటీవలి వర్షాలు, తాజాగా కురుస్తున్న మంచు వల్ల తేమ ఎక్కువగా ఉంటోందని రైతులు చెబుతున్నరు. సీసీఐ కొర్రీల గురించి తెలిసిన వాళ్లంతా ఎప్పట్లాగే ప్రైవేట్​ వ్యాపారులను ఆశ్రయిస్తున్నరు. ఇదే అదునుగా వాళ్లు రైతుల నుంచి వడ్డీకి పావుశేరు కొంటున్నరు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర రూ.5,825 కాగా, రూ.2500 నుంచి రూ.4వేలలోపే పడుతుండడంతో రైతులు లబోదిబోమంటున్నరు.

ఇంకా తెరుచుకోని సీసీఐ సెంటర్లు..

ఈ వానాకాలం సీజన్​లో రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి పండించారు. ఎకరాకు సగటున 10 నుంచి 12 క్వింటాళ్ల చొప్పున 65 నుంచి 78 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు.  ఫస్ట్ పికింగ్​ కింద ఎకరానికి 2 నుంచి 3 క్వింటాళ్ల చొప్పున13 నుంచి 19 లక్షల టన్నుల దిగుబడి రావచ్చని చెబుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వరంగల్​, మహబూబ్​నగర్​, ఆదిలాబాద్​ బ్రాంచిల పరిధిలో110  కేంద్రాలను ఏర్పాటుచేసి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని సీసీఐ నిర్ణయించింది. ఈ నెల  రెండోవారం నుంచే చాలా జిల్లాల్లో ఫస్ట్​ పికింగ్​ స్టార్ట్​ అయినప్పటికీ ఆదిలాబాద్​, వరంగల్​లాంటి ఒకటి రెండు చోట్ల తప్ప సీసీఐ సెంటర్లు ఇంకా తెరవలేదు.

తేమతోనే సమస్య..

సీసీఐ ఎంటర్​ కాకపోవడంతో పత్తి మార్కెట్లలో వ్యాపారుల హవా నడుస్తున్నది. కేంద్రం క్వింటాల్​ పత్తికి రూ.5,825 మద్దతు ధర ప్రకటించగా, దళారులు తేమశాతం, రంగుమారడాన్ని సాకుగా చూపి రూ.4వేల లోపే కొంటున్నారు. పత్తి లో తేమ 10శాతం లోపు ఉండి, క్వాలిటీ బాగుంటేనే 4500 నుంచి 5వేల దాకా పెడుతున్నారు. కీలకమైన ఖమ్మం, ఏనుమాముల, జమ్మికుంట మార్కెట్లలో గురువారం కనిష్ఠంగా క్వింటాల్​ రూ.2500 నుంచి రూ.3వేలు పలికిందంటే రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మూడు సెంటర్లలో గరిష్ఠ ధర కేవలం రూ.4870 మాత్రమే. ఇప్పటికిప్పుడు 110చోట్ల  సీసీఐ సెంటర్లు తెరుచుకున్నా ఫస్ట్​ పికింగ్​ పత్తికి ధర అనుమానమేనని ఆఫీసర్లే చెబుతున్నారు. ఇటీవలి వర్షాలు, తాజాగా కురుస్తున్న మంచు కారణంగా తేమశాతం 12  దాటిపోతుండడం, పత్తి రంగుమారడంతోతో సీసీఐ ఎట్టిపరిస్థితుల్లో కొనుగోలు చేయదని రైతులు అంటున్నారు. ఆఫీసర్లు ఏదో నామమాత్రంగా 10, 15 క్వింటాళ్లు కొనివెళ్లిపోతారని, ఆ తర్వాత ప్రైవేట్ వ్యాపారులే దిక్కవుతారని చెబుతున్నారు.
అందువల్ల వాళ్లకు వడ్డీకి పావుశేరు అన్నట్లు అమ్ముకొని నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తొలి రోజే తూకాల్లో తేడా..
ఆదిలాబాద్ లో రైతులు ఆందోళన


ఆదిలాబాద్ లో గురువారం సీసీఐ కొనుగోళ్లు అధికారంగా ప్రారంభం కాగా, తొలిరోజే తూకాల్లో తేడా వస్తోందని రైతులు ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ , లోకల్ ఎమ్మెల్యే జోగు రామన్నతో కలిసి పత్తి కొనుగోళ్లను ప్రారంభించారు. విక్రయానికి తెచ్చిన తొలి రైతును శాలువతో సత్కరిం చారు. మార్కెట్ యార్డులో దత్తు అనే రైతుకు చెందిన పత్తిని తూకం వేయగా 34 క్వింటాళ్లు వచ్చింది. అదే జిన్నింగ్ మిల్లు​లో మరోసారి తూకం వేయగా 38 క్వింటాళ్లు వచ్చింది. దీంతో ఆగ్రహానికి గురైన రైతు ఆఫీసర్లను ప్రశ్నించారు. ఇతర రైతులు మద్దతుగా నిలిచి తుకాల్లో తేడాలపై ఆఫీసర్లతో వాగ్వాదానికి దిగారు. జనరేటర్ లో తలెత్తిన సమస్యతో ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పిన ఆఫీసర్లు హుటాహుటిన ఆ కాంటాలను తిరిగి సరి చేశారు. కాగా తుకాల్లో తొలి రోజే తేడాలు రావడం, వాటిని సరిచేయాల్సిన తూనికలు, కొలతల అధికారులు అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, మార్కెటింగ్ ఆఫీసర్ అశ్వక్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

క్వాలిటీ కాటన్​కే మంచి రేటు..

రైతులు సీసీఐ కేంద్రాల్లోనే పత్తిని అమ్ముకోవాలి. ప్రైవేట్ వ్యాపారులకు అమ్మి మోసపోవద్దు. క్వాలిటీ పత్తిని మార్కెట్​కు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలి. తేమ 8నుంచి 12శాతం లోపు ఉండేలా చూసుకోవాలి.  అప్పుడే మంచి ధర వస్తుంది.

–ప్రవీణ్​ రెడ్డి, జిల్లా మార్కెటింగ్​ అధికారి. పెద్దపల్లి

సీసీఐ కొంటలేదు..

వానకాలం రెండెకరాల్లో పత్తి వేశాను. ఈ యేడు వానలకు పత్తి దిగుబడి తగ్గింది. మా మండలంలో మార్కెట్ యార్డ్ ఉన్నా ఓపెన్ చేస్తలేరు. . తేమ సాకుతో సీసీఐ ఏనాడూ కొంటలేదు.  పత్తిని ప్రతిసారీ ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నం. మద్దతు ధర పెడ్తలేరు.

–మడావి తిరుపతి, రైతు, తిర్యాణి

నెలదాక ఉంచితే ఖరాబైతది..

సీసీఐ సెంటర్లు నెల తర్వాత తెరుస్తరని ఆఫీసర్లు చెప్పిన్రు.  అప్పటిదాక ఉంచితే నా పత్తి మొత్తం ఖరాబైతది. ఈసారి మొత్తం పదెకరాల్లో పత్తి పెట్టిన. ఈ నెలల కురిసిన వర్షాలకు చాలవరకు కరాబ్​ అయింది.  తేమశాతం బాగ వస్తది. సీసీఐ వాళ్లు 10 శాతం ఉంటే నే కొంటరు. అందుకే ప్రైవేటోళ్లకు అమ్ముకుంటం.

– గుర్రం జలపతి, గోవింద్ పల్లి, గొల్లపల్లి మండలం, జగిత్యాల జిల్లా

For More News..

10 వేల సాయం పంచుక తింటున్నరు

ఏపీకి ఎదురుదెబ్బ.. సంగమేశ్వరం ఆపండి..

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇంటర్​ పాసైతే చాలు ఇంజనీరింగ్‌లో చేరొచ్చు

కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్తే రూ. 29 లక్షల జీతం