కరీంనగర్లో అర్ధరాత్రి ఓటర్లకు డబ్బుల పంపకం

కరీంనగర్లో అర్ధరాత్రి ఓటర్లకు డబ్బుల పంపకం
  • అడ్డుకోబోయిన బీజేపీ లీడర్
  • టీఆర్ఎస్​ కార్యకర్తల దాడిలో తీవ్రగాయాలు

కరీంనగర్‍టౌన్‍, వెలుగు: ఓటర్లకు డబ్బులు పంచుతుండగా అడ్డుకున్న బీజేపీ లీడర్​పై టీఆర్ఎస్​ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. త్రి టౌన్​ పోలీస్‍ స్టేషన్‍ సీఐ విజ్ఞాన్‍రావు వివరాల ప్రకారం.. కరీంనగర్‍ కార్పొరేషన్‍ 25వ డివిజన్‍ నుంచి బీజేపీ అభ్యర్థిగా నవ్యశ్రీ పోటీ చేస్తున్నారు. ఇక్కడ శుక్రవారం ఎన్నికలు జరుగుతున్నాయి. బుధవారం అర్ధరాత్రి టీఆర్‍ఎస్‍ నాయకులు ఓటర్లకు మద్యం, డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు నవ్యశ్రీ భర్త, బీజేపీ నాయకుడు చాడ ఆనంద్‍కు సమాచారం అందింది. దాంతో ఆయన వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో వారంతా ఆనంద్‍పై బీరు సీసాలతో దాడి చేశారు. తీవ్ర గాయాలైన ఆనంద్​ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి విషయం తెలిసినా పోలీసులు స్పందించలేదని బీజేపీ నాయకులు ఆరోపించారు.

బాధితుడిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించిన అనంతరం పోలీసులకు లిఖి తపూర్వకంగా ఫిర్యాదు చేశారు. నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్‍ చేస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణరావు ఆధ్వర్యంలో త్రీటౌన్‍ పోలీస్‍ స్టేషన్‍ ఎదుట ధర్నా నిర్వహించారు. టీఆర్‍ఎస్‍ తరఫున ఎడ్ల అశోక్‍ మూడు రోజులుగా డబ్బు, మద్యం సీసాలు పంచుతున్నాడని తెలిసి 100 కి డయల్‍ చేసినా పట్టించుకోలేదన్నారు. బుధవారం సైతం మద్యం పంపిణీ చేస్తున్నారనే సమాచారంతో అడ్డుకునేందుకు వెళితే బీరు సీసాలతో దాడి చేసి చంపడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​చేశారు. అక్రమంగా డబ్బు, మద్యం పంపిణీతో ఓట్లు దండుకోవాలని చూస్తున్న టీఆర్‍ఎస్‍కు ప్రజలు గుణపాఠం చెప్పాలని కోరారు.

ఓటమి భయంతోనే దాడులు

ఆనంద్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడం రాష్ట్రంలో అరాచక పాలనకు నిదర్శనమని ఎంపీ బండి సంజయ్ అన్నారు. దాడిలో గాయపడి సివిల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆనంద్ ను ఎంపీ పరామర్శించారు. దాడి జరిగిన తీరును తెలుసుకున్నారు. అధైర్య పడవద్దని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా , టీఆర్ఎస్ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎవరైనా డయల్ 100కు ఫోన్ చేస్తే ఆ వివరాలను టీఆర్ఎస్ నేతలకు లీక్ చేస్తున్నారని ఆరోపించారు. డయల్ 100 టీఆర్ఎస్ సమాచార కేంద్రంగా మారిపోయిందని మండిపడ్డారు.