కత్తులతో దాడి చేసినా పోలీసుల నో యాక్షన్​

కత్తులతో దాడి చేసినా పోలీసుల నో యాక్షన్​
  • ఎంపీ కాన్వాయ్​పై కత్తులతో దాడి చేసినా పోలీసుల నో యాక్షన్​
  • నిందితుల ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చినా పట్టించుకోలే
  • పసుపు రైతులపై నెపం పెట్టి టీఆర్ఎస్​ బూమరాంగ్​
  • దాడితో సంబంధం లేదని ప్రకటించిన రైతు ఐక్య వేదిక
  • టీఆర్​ఎస్​కు 15 మంది రాజీనామా
  • మొన్న జర్నలిస్టుపై, ఇప్పుడు ఎంపీపై దాడి చేయడమేందని మండిపాటు

నిజామాబాద్ ​/ ఆర్మూర్​, వెలుగు: నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​ నియోజకవర్గంలో ఎంపీ ధర్మపురి అర్వింద్ కాన్వాయ్​పై మంగళవారం జరిగిన దాడిని పోలీసులు లైట్​గా తీసుకున్నట్లు కనిపిస్తున్నది. దాడి జరిగి రెండు రోజులైనా ఇప్పటివరకు నిందితుల్లో ఒక్కరిని కూడా అరెస్ట్​ చేయలేదు. నందిపేట పర్యటనకు వెళ్తున్న తమపై దాడి జరిగే అవకాశముందని అర్వింద్​ ముందే పోలీసులకు చెప్పినప్పటికీ, దాడి జరిగిన తర్వాత స్వయంగా ఆయన పోలీస్​ కమిషనర్​కు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి యాక్షన్​ తీసుకోలేదు. 

కత్తులు, ఇతర ఆయుధాలతో విరుచుకుపడ్డ టీఆర్ఎస్​ కార్యకర్తలు.. అర్వింద్​కారుతో పాటు మరో ఆరు కార్లను ధ్వంసం చేశారు. భయంతో పరుగులుపెట్టిన బీజేపీ లీడర్లను కత్తులతో పొడిచేందుకు ప్రయత్నించారు. అధికార పార్టీ లీడర్ల దాడిలో బీజేపీ కార్యకర్తలు విజయ్, అరుట్ల రమేశ్, చిన్నయ్య తీవ్రంగా గాయపడ్డారు. ఎంపీ పీఏ నారాయణకు కూడా గాయాలయ్యాయి. ఈ దాడులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు మంగళవారం సాయంత్రమే బయటకు వచ్చాయి. ఫొటోల్లో నిందితులు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, పేర్లతోపాటు ఎంపీ ఫిర్యాదు చేసినప్పటికీ వాళ్లంతా రూలింగ్ ​పార్టీ ​నేతలు కావడం వల్లే అరెస్ట్​ చేసేందుకు పోలీసులు వెనుకాడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. 

ఆర్మూర్​పై ఎంపీ ఫోకస్​తో!

ఈసారి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న బీజేపీ లీడర్లు.. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఎంపీ అర్వింద్​ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్​ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. కొంతకాలంగా ఆయన ఆ​ నియోజకవర్గంపై ఫోకస్​ పెట్టారు. తన క్యాంప్​ ఆఫీసును ఆర్మూర్​ టౌన్​కు మార్చి, అక్కడి నుంచే పొలిటికల్ యాక్టివిటీస్​నడిపిస్తున్నారు. ఎంపీ ల్యాడ్స్​తో  నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే టీఆర్​ఎస్​లోని కీలకమైన నేతలు బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇది అక్కడి సిట్టింగ్​ టీఆర్ఎస్​ ఎమ్మెల్యే జీవన్​రెడ్డికి మింగుడు పడడం లేదని, ఈ కోపంతోనే ఎమ్మెల్యే తన అనుచరులను ఎంపీపై దాడికి ఉసిగొల్పినట్లు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. తన కాన్వాయ్​పై దాడి వెనుక ఎమ్మెల్యే జీవన్​రెడ్డి ఉన్నారని ఎంపీ అర్వింద్​ కూడా అన్నారు.  


టీఆర్ఎస్​ బూమరాంగ్​..

2019 లోక్​సభ ఎన్నికల్లో నిజామాబాద్​ సిట్టింగ్​ ఎంపీ, సీఎం కూతురు కవితను ధర్మపురి అర్వింద్ ​ఓడించి సంచలనం సృష్టించారు. నాటి నుంచి ఈ లోక్​సభ  నియోజకవర్గం పరిధిలో టీఆర్ఎస్​, బీజేపీ నడుమ పోరు నడుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఫెయిల్యూర్స్​ను  ఎంపీ అర్వింద్​ఎండగడుతుండగా..  పసుపు బోర్డు సాధించలేకపోయారంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీ అర్వింద్​ను ఇరుకునపెడుతూ వస్తున్నారు.​ ఈ క్రమంలో తాజాగా ఎంపీ కాన్వాయ్​పైన పసుపు రైతులే దాడి చేసినట్లు ఎమ్మెల్యే జీవన్​రెడ్డి ఆరోపించారు. అయితే ఎంపీపై జరిగిన దాడికి, పసుపు రైతులకు ఎలాంటి సంబంధం లేదని రైతు ఐక్య వేదిక ప్రతినిధులు ప్రకటించారు. దాడిని రైతు ఐక్య వేదిక తీవ్రంగా ఖండిస్తున్నదని, కొంతమంది టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు దాడి చేసి పసుపు రైతుల పేరును వాడుకోవడం ఏమిటని మండిపడ్డారు. దీంతో ఎమ్మెల్యే జీవన్​రెడ్డి​ వ్యూహం బెడిసికొట్టిందని, అది రూలింగ్ ​పార్టీకే బూమరాంగ్​లా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. 
టీఆర్ఎస్​కు 15 మంది  రాజీనామా
ఎంపీ అర్వింద్‌‌పై దాడిని ఖండిస్తూ, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌‌రెడ్డికి వ్యతిరేకంగా పలువురు టీఆర్​ఎస్​ లీడర్లు బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. వీరిలో  ఆర్మూర్​ మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్, సీనియర్ టీఆర్ఎస్ లీడర్‌‌ భాస్కర్, జంబి హనుమాన్ కమిటీ మాజీ చైర్మన్ పుప్పాల పోశెట్టి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న ఎంపీపై టీఆర్ఎస్ లీడర్లు దాడి చేయడం అప్రజాస్వామికమన్నారు. తెలంగాణ ఉద్యమంలో తాము ముందుండి పోరాడామని, టీఆర్ఎస్‌‌తో అభివృద్ధి జరుగుతుందని భావించినా ఏడేండ్లుగా నిరాశే ఎదురైందని చెప్పారు. మొన్న జర్నలిస్టుపై, ఇప్పుడు ఎంపీపై దాడి చేయడాన్ని బట్టి ఆర్మూర్​ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఫ్యాక్షన్‌‌ రాజకీయాలకు తెరతీసినట్లు అర్థమవుతోందన్నారు. తాము ఏ పార్టీలో చేరబోయేది త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. టీఆర్ఎస్‌‌కు రాజీనామా చేసిన వారిలో చేగంటి విజయ్, మారంపల్లి మోహన్, రవి, సాయిలు, సుమన్, బాలు, బాద్గుణ శ్రీను, సునీల్ వర్మ, విక్రమ్, చిట్టి నరేందర్, కందూర్ శ్రీను కూడా ఉన్నారు.

నేడు ఆర్మూర్​కు బీజేపీ నేతలు

అర్వింద్​పై జరిగిన దాడిలో గాయపడ్డ బీజేపీ కార్యకర్తలను పరామర్శించేందుకు గురువారం ఆ పార్టీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్, ఇతర సీనియర్ నేతలు ఆర్మూర్​కు వెళ్లనున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు ఎంపీ ధర్మపురి అర్వింద్​తో కలిసి సంజయ్, ఇతర నేతలు ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట మండలంలో పర్యటించి, దాడిలో గాయపడ్డ పార్టీ కార్యకర్తలను కలుసుకొని, వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోనున్నారు. ఎంపీ అర్వింద్​పై జరిగిన దాడి విషయంలో పార్టీ పరంగా ఎలాంటి ఆందోళనలు చేపట్టాలనే దానిపై బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ముఖ్య నేతలతో సంజయ్  భేటీ అయ్యారు. సమావేశంలో సీనియర్ నేతలు ఇంద్రసేనా రెడ్డి, మంత్రి శ్రీనివాస్, ప్రేమేందర్  రెడ్డి, నందీశ్వర్ గౌడ్, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చింది. ‘ప్రత్యేక రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ’ పేరుతో ఫిబ్రవరి 4 న డీజీపీని కలువాలని నిర్ణయించింది.