
- బీజేపీ నుంచే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- అభ్యర్థుల ఎంపికపై టీఆర్ఎస్, కాంగ్రెస్ మల్లగుల్లాలు
- పార్టీల బలాబలాలపై చర్చలు
నల్గొండ, వెలుగు : మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా ప్రకటనతో మూడు ప్రధాన పార్టీల్లో హడావిడి మొదలైంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్స్ లాంటి మునుగోడు పోరులో గెలిచేందుకు కసరత్తు ప్రారంభించాయి. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం దాదాపు ఖాయం కావడంతో ఆ పార్టీ అభ్యర్థి ఆయనేనని తేలిపోయింది. ఇక టీఆర్ఎస్, కాంగ్రెస్ క్యాండిడేట్లు ఎవరనే అంశం ఆసక్తి రేపుతోంది. ఈ రెండు పార్టీల హైకమాండ్స్అభ్యర్థుల వేట మొదలుపెట్టాయి. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పడంతో ఆ పార్టీ ఇప్పుడు కొత్త అభ్యర్థిని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికార పార్టీది కూడా ఇంచుమించూ ఇదే పరిస్థితి. ప్రస్తుతానికి నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. 2014లో ప్రభాకర్‌రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో హైకమాండ్ ఆయన వైపే మొగ్గుచూపే అవకాశం ఉంది. కాకపోతే నియోజకవర్గంలోని టీఆర్ఎస్ నేతలు ప్రభాకర్‌రెడ్డి వైఖరి పట్ల కొంత అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైకమాండ్ సర్వేలు చేయిస్తోంది. కొంతమంది ముఖ్యుల పేర్లతో ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటోంది. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ఇప్ప టికే రెండు రకాల రిపోర్టులను హైకమాండ్ కు పంపినట్లు తెలిసింది. సర్వే నివేదికలు, ప్రజల అభిప్రాయాలను విశ్లేషించి, తుది నిర్ణయానికి వచ్చేదాకా తమ అభ్యర్థి విషయంలో సైలెంట్‌గా ఉండాలని హైకమాండ్ భావిస్తున్నట్లు పార్టీ సీనియర్ నాయకుడొకరు చెప్పారు.
పాత సంప్రదాయాన్నే కొనసాగిస్తుందా..?
టీఆర్ఎస్ అభ్యర్థి విషయంలో పార్టీ హైకమాండ్ పాత సంప్రదాయాన్నే కొనసాగిస్తుందా..లేదంటే కొత్త ఈక్వేషన్ ఏమైనా తెరపైకి తీసుకొస్తుందా? అనే చర్చ జరుగుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన రెండు ఉప ఎన్నికల్లో పార్టీ అనేక సర్వేలు చేయించినప్పటికీ చివరికి తామనుకున్న అభ్యర్థినే బరిలో దింపింది. 2018 ఎన్నికల్లో హుజూర్‌నగర్‌లో ఓడిపోయిన శానంపూడి సైదిరెడ్డికే బైపోల్లో సీటు దక్కింది. నాగార్జునసాగర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చనిపోవడంతో ఆయన కొడుకు నోముల భగత్‌నే బరిలో దింపింది. నిజానికి సాగర్‌లో సీనియర్ నాయకుడు జానారెడ్డితో తలపడేందుకు టీఆర్ఎస్ అనేక మంది పేర్లతో రకరకాల సర్వేలు చేయించింది. చివరికి ఉపఎన్నికల సెంటిమెంట్‌ను మార్చకుండా పాత సంప్రదాయం వైపే మొగ్గుచూపింది. ఈ నేపథ్యంలో మునుగోడులో కూడా అదే సీన్ రీపీట్ అవుతుందని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఈలెక్కన ప్రభాకర్‌రెడ్డినే అభ్యర్థిగా ఫైనల్ చేస్తే పార్టీలో నెలకొన్న గ్రూపు తగాదాలతో ఏమైనా నష్టం జరుగుతుందా? అనే కోణంలోనూ హైకమాండ్ఆలోచిస్తోంది. అందుకే ప్రత్యామ్నయంగా మరికొందరు ముఖ్యుల పేర్లను పరిశీలిస్తున్నట్లు చెప్తున్నారు.
కాంగ్రెస్ కు సవాల్..
రాజగోపాల్ రెడ్డి స్థానాన్ని రీప్లేస్ చేయడం కాంగ్రెస్ పార్టీకి సవాల్‌గా మారింది. 2018 ఎన్నికల్లో మునుగోడు సీటుపై ఆశపెట్టుకున్న పాల్వాయి స్రవంతి ప్రస్తుతం తెరపైకి వచ్చారు. 2014 ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన స్రవంతి సెకండ్ ప్లేస్‌లో నిలిచారు. గత ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి వల్ల స్రవంతికి టికెట్ దక్కలేదు. ఈమెతో పాటు, నియోజకవర్గంలో పలువురు పారిశ్రామికవేత్తల పేర్లను కూడా హైకమాండ్ పరిశీలిస్తోంది. నారాయాణ్ పూర్ మండలం మల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త చల్లమల్ల కృష్ణారెడ్డి పేరు ప్రచారంలో ఉంది. ఈయన అన్న నర్సింహారెడ్డి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి ముఖ్య అనుచరుడు. బీసీ సామాజిక వర్గం నుంచి చండూరు ఎంపీపీ భర్త పల్లె రవికుమార్ గౌడ్ పేరు కూడా వినిపిస్తోంది. వీళ్లతోపాటు, నియోజకవర్గంలోని టీఆర్ఎస్ ముఖ్యులతోనూ రహస్యంగా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది.
పార్టీ బలబలాలపై ఆసక్తికర చర్చ..
రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ప్రస్తుతం మునుగోడులో పార్టీ బలాబలాల పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయన బీజేపీలో చేరితే కాంగ్రెస్ లో ఇన్నాళ్లూ రాజగోపాల్‌రెడ్డి వెంట నడిచిన లీడర్ల దారెటు? అనే ప్రశ్న వస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ హైకమాండ్.. రాజగోపాల్‌రెడ్డి అనుచరులంటూ నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులను బుధవారం సస్పెండ్ చేసింది. గురువారం చౌటుప్పుల్, నారాయణ్‌పూర్ మండలాల లీడర్లను సస్పెండ్ చేస్తారని తెలిసింది. ఈ పరిణామం కాస్తా రాజగోపాల్‌రెడ్డికే అనుకూలంగా మారిందని విశ్లేషకులు అంటున్నారు. ఇవే పరిస్థితులు కంటిన్యూ అయితే కాంగ్రెస్ లోని సెకండ్ క్యాడర్ అంతా రాజగోపాల్ రెడ్డి వైపు టర్న్ అవుతారనే అంచనాలున్నాయి. ఇందుకు తగ్గట్లే తనను సస్పెండ్చేయడంపై చండూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీటీసీ అయిన పల్లె వెంకన్న హైకమాండ్ తీరుపై మండిపడ్డారు. అవసరమైతే ఎంపీటీసీ పదవికి రాజీనామా చేసి, రాజగోపాల్‌రెడ్డితో కలిసి నడుస్తానని ప్రకటించారు. మరోవైపు నియోజకవర్గంలో లక్షా 98 వేల849 ఓట్లు ఉండగా, గత ఎన్నికల్లో లక్షా 95 వేల757 ఓట్లు పోలయ్యాయి. దీంట్లో కాంగ్రెస్ పార్టీకి 97,239 ఓట్లు పోలుకాగా, టీఆర్ఎస్కు 74,687 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 12,725 ఓట్లు వచ్చాయి. తాను అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే కావడం వల్లే టీఆర్ఎస్ ప్రభుత్వం తన నియోజకవర్గానికి ఫండ్స్ ఇయ్యకుండా ఇన్నాళ్లూ అభివృద్ధిని అడ్డుకున్నదని రాజగోపాల్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. తన రాజీనామాతోనైనా అభివృద్ధి జరుగుతుందనే రిజైన్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సెంటిమెంట్తనకు కలిసి వస్తుందని రాజగోపాల్‌రెడ్డి తో పాటు బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఓటు బ్యాంకు తనవైపే మళ్లుతుందని, ప్రస్తుతం బీజేపీ ఓటు బ్యాంకు కూడా గతంలో కంటే రెండు, మూడు రెట్లు పెరిగినందున గత ఎన్నికలతో పోలిస్తే భారీ మెజారిటీతో గెలుస్తానని రాజగోపాల్‌రెడ్డి భావిస్తున్నారు. కాగా, రాజగోపాల్‌రెడ్డి కారణంగానే నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని, అందువల్ల అధికారపార్టీనే గెలిపించాలని ప్రజలు భావిస్తున్నారని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్, బీజేపీ మధ్య చీలితే తామే బయటపడ్తామని చెప్తున్నారు. కాంగ్రెస్ కూడా తమ ఓటు బ్యాంకు పై ఆశలు పెట్టుకుంది. తన స్వలాభం కోసం పార్టీ వీడుతున్న రాజగోపాల్‌రెడ్డికి జనం బుద్ధి చెప్తారని, కాంగ్రెస్‌నే గెలిపిస్తారని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు.
టీఆర్ఎస్ టికెట్ రేసులో ప్రముఖులు
టీఆర్ఎస్ నుంచి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రి కావాలనే కోరిక గుత్తాకు ఎప్పటి నుంచో ఉంది. హుజూర్నగర్, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలప్పుడు కూడా గుత్తా పేరు తెరపైకి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఆయన కొడుకు అమిత్‌రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకురావాలని భావిస్తున్న గుత్తా తాజాగా వచ్చిన మునుగోడు ఉప ఎన్నికను ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్న కంచర్ల కృష్ణారెడ్డి కూడా రేసులో ఉన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో అన్నదమ్ములిద్దరూ సీఎంను కలిశారు. బీసీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, కేటీఆర్ సన్నిహితుడు కర్నాటి విద్యాసాగర్, మునుగోడు జడ్పీటీసీ భర్త నారబోయిన రవి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
క్యాడర్‌ను కాపాడుకునే పనిలో కాంగ్రెస్..
రాజగోపాల్‌రెడ్డి రాజీనామా ప్రకటనతో కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్ అయింది. క్యాడర్ చేజారకుండా కాపాడుకునే పనిలో పడింది. ఈమేరకు హైకమాండ్ మధుయాష్కీగౌడ్, సీతక్క, అంజన్ కుమార్ యాదవ్, దామోదర్ రెడ్డిలతో మునుగోడు ఎన్నికల ప్రచార కమిటీ వేసింది. ఈ కమిటీ గురువారం నియోజకవర్గంలో పర్యటించనుంది. శుక్రవారం చండూరులోని ప్రభుత్వ హైస్కూల్లో బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు, జిల్లా, రాష్ట్ర ముఖ్య నేతలు హాజరుకానున్నారు. క్యాడర్ చేజారకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై ప్రధానంగా చర్చించనున్నారు.