మునుగోడు ఉపఎన్నిక : టీఆర్ఎస్, కాంగ్రెస్ లో టికెట్ పంచాయతీ

మునుగోడు ఉపఎన్నిక : టీఆర్ఎస్, కాంగ్రెస్ లో టికెట్ పంచాయతీ
  • కూసుకుంట్ల ప్రభాకర్​రెడ్డికి ఇవ్వొద్దంటూ టీఆర్​ఎస్​లో పంచాది
  • మంత్రి జగదీశ్​ ముందు నేతల అసంతృప్తి.. సీఎంను కలిసే ప్రయత్నం
  • గాంధీభవన్​కు కాంగ్రెస్​ ఆశావహులు.. వారితో ముఖ్య నేతల చర్చలు
  • 16 నుంచి మండలాల వారీగా అభిప్రాయాల సేకరణ

హైదరాబాద్​ / నల్గొండ, వెలుగు: మునుగోడు టికెట్​ కోసం టీఆర్​ఎస్, కాంగ్రెస్​లో లొల్లి మొదలైంది. తమకంటే తమకు టికెట్​ ఇవ్వాలంటూ ఆశావహులు పోటీ పడుతున్నారు. బుధవారం రెండు పార్టీల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. టీఆర్​ఎస్​ నేతల హడావుడి మినిస్టర్​ క్వార్టర్స్​, ప్రగతి భవన్​ చుట్టూ తిరిగింది. గాంధీభవన్​ వేదికగా కాంగ్రెస్​ నేతల టికెట్ల పోరు జరిగింది. 

కూసుకుంట్లకు ఇవ్వొద్దంటూ..!

టీఆర్​ఎస్​ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసిన కూసుకుంట్ల ప్రభాకర్​ రెడ్డి పేరును సీఎం కేసీఆర్​ ఖరారు చేశారనే సమాచారంతో పార్టీ నియోజకవర్గ నేతలు అలర్ట్​ అయ్యారు. బుధవారం హైదారాబాద్​కు తరలివచ్చి మినిస్టర్​ క్వార్టర్స్​లో మంత్రి జగదీశ్​రెడ్డిని కలిశారు. నియోజకవర్గం నుంచి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. కూసుకుంట్లకు టికెట్​ ఇస్తే తాము ఎన్నికల్లో సహకరించబోమని మంత్రికి వారు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ విషయం పైనే తాము వారం కింద లేఖలు రాశామని గుర్తు చేసినట్లు సమాచారం. అయితే ఇది సీఎం డెసిషన్​ అని మంత్రి జగదీశ్​రెడ్డి బుజ్జగించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది.  బీసీ కో టా నుంచి టికెట్​ ఆశిస్తున్న మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్​ను కూడా బుజ్జగించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. 

రాత్రి ఏడు గంటల సమయంలో అసంతృప్త నేతలందరూ కలిసి ప్రగతి భవన్​కు వెళ్లారు. తమ ఆవేదనను సీఎంకు నేరుగా నివేదించాలని ప్రయత్నించారు. అయితే.. ఆ సమయంలో అక్కడ ఉన్న పార్టీ నల్లొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్​, జిల్లా ఇన్​చార్జ్​, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్​రావును మాత్రమే కలిశారు. ఈ ఇద్దరు సీఎంను కలిశారు. మంత్రి జగదీశ్​రెడ్డి ఆధ్వర్యంలో మినిస్టర్​ క్వార్టర్స్​లో జరిగిన సమావేశం పూర్తి వివరాలను వీరు సీఎంకు వివరించారు. 

గాంధీభవన్​లో హడావుడి

కాంగ్రెస్​లో ఉదయం నుంచే మునుగోడు అభ్యర్థి ఎంపికపై హడావుడి మొదలైంది. పార్టీ రాష్ట్ర ఇన్​చార్జ్​ మాణిక్కం ఠాగూర్​, ఏఐసీసీ సెక్రటరీలు బోసు రాజు, శ్రీనివాస్​ కృష్ణన్​ వస్తారని, ముఖ్యనేతలంతా వారితో సమావేశం అవుతారని మంగళవారం నుంచి ప్రచారం జరిగింది. మునుగోడు ఆశావహులను గాంధీభవన్​కు పిలిపించరు. టికెట్ ఆశిస్తున్న పాల్వాయి స్రవంతి, చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవి కుమార్​గౌడ్​, కైలాష్​ నేత బుధవారం మధ్యాహ్నం గాంధీభవన్​కు చేరుకున్నారు. మాణిక్కం ఠాగూర్​ ఢిల్లీ నుంచి రావడం ఆలస్యం కావడంతో ఆశావహులతో బోసు రాజు, వర్కింగ్ ప్రెసిడెండ్లు మహేష్​ కుమార్​ గౌడ్​, అంజన్​ కుమార్​ యాదవ్​, నల్గొండ సీనియర్​ నేత ఆర్.దామోదర్​ రెడ్డి, మాజీ విప్​ ఈరవత్రి అనిల్​ కుమార్​, డీసీసీ అధ్యక్షుడు శంకర్  భేటీ అయ్యారు. మునుగోడులో ఎవరికి టికెట్​ ఇచ్చినా అంతా కలిసి పోటీ చేయాలని వారికి చెప్పి పంపారు. కాగా, బోసు రాజు ఉదయమే సీనియర్​ నేత జానారెడ్డి ఇంటికి వెళ్లి.. మునుగోడు ఎన్నికల గురించి మాట్లాడి వచ్చినట్లు సమాచారం.

ఈలోపు పాల్వాయి స్రవంతి.. నియోజకవర్గ నేత ఒకరితో మునుగోడు టికెట్​పై మాట్లాడిన ఆడియో ఒకటి సోషల్​ మీడియాలో వైరల్​ అయింది. టికెట్​ తనకే ఇస్తారని, వేరే వాళ్లకు అవకాశం లేదని ఆమె అందులో మాట్లాడారు. అయితే తర్వాత స్రవంతి ఈ ఆడియోపై గాంధీభవన్​ వద్ద వివరణ ఇచ్చారు. తాను తప్పుగా ఏమీ మాట్లాడలేదని, కొందరు ఇతర పార్టీల నేతలు దురుద్దేశంతో తప్పుడు సంకేతాలు వెళ్లేలా తన ఆడియోను ప్రచారం చేశారని అన్నారు. తనది కాంగ్రెస్​ రక్తం అని, మూడు సార్లు టికెట్​ రాకపోయినా పార్టీ మారలేదని చెప్పారు. తాను టీఆర్​ఎస్​లోకి పోతున్నట్లు కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అందరి అభిప్రాయం మేరకే టికెట్​ ఇస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. మరో ఆశావహ అభ్యర్థి చల్లమల్ల కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. టికెట్​ ఎవరికి వచ్చినా కలిసి పని చేస్తామన్నారు. స్రవంతి తనకు అక్కలాంటివారని, మునుగోడు కాంగ్రెస్​కు కంచుకోట అని తెలిపారు. 

అభ్యర్థికి హైకమాండే అంతా చూసుకుంటుంది!

మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్​ అభ్యర్థిగా ఎవరు ఎంపికైనా వారికి పార్టీనే అండగా ఉంటుందని కాంగ్రెస్​ హైకమాండ్​ నుంచి హామీ వచ్చినట్లు తెలిసింది. పోటీకి ఉత్సాహం చూపుతున్న వాళ్లలో ఎక్కువ మందికి ఆర్థిక స్థోమత అంతంతగానే ఉంది. కనుక అభ్యర్థి ఎవరు ఎంపికైనా వారికి ఆర్థికంగా పార్టీయే అండగా ఉండాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ విషయమే ఆశావహులకు కూడా స్పష్టం చేసినట్లు సమాచారం. ‘‘టికెట్​ ఎవరికి వచ్చినా దీన్ని పార్టీ ఎన్నికగా చూడండి. ఇది అభ్యర్థి బలాబలాలకు సంబంధించిన ఎన్నికగా చూడకండి. అధిష్టానం అన్ని విధాలా ఆలోచించి అభ్యర్థిని ఎంపిక చేస్తుంది. ఎవరికి అవకాశం వచ్చినా అందరూ కలిసి విజయం కోసం కృషి చేయాలి’’ అని మముఖ్య నేత ఒకరు చెప్పినట్లు తెలిసింది.

హోటల్​లో కాంగ్రెస్​ నేతల రహస్య భేటీ

గాంధీభవన్​ మీటింగ్​కు రావాల్సిన మాణిక్కం ఠాగూర్​ ఢిల్లీ నుంచి ఆలస్యంగా హైదరాబాద్​ చేరుకున్నారు. సాయంత్రం 5 గంటలకు సిటీకి వచ్చిన ఆయన నేరుగా ఓ స్టార్​ హోటల్​కు వెళ్లారు. అక్కడ పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డితో రహస్యంగా సమావేశమైనట్లు గాంధీభవన్​ వర్గాలు తెలిపాయి. సీనియర్​ నేత దామోదర్​రెడ్డిని కూడా ఈ భేటీకి పిలిచినట్లు సమాచారం. మునుగోడు టికెట్​ ఎవరికి ఇవ్వాలనే అంశంతోపాటు నియోజకవర్గంలో అనుసరించాల్సిన వ్యూహంపై వీళ్లు కొద్దిసేపు చర్చించినట్లు తెలిసింది. తర్వాత జానారెడ్డి ఇంటికి మాణిక్కం ఠాగూర్ ​వెళ్లి ఆయనతో భేటీ అయినట్లు సమాచారం. 

నేడు మరో మారు భేటీ 

మునుగోడుపై గాంధీభవన్​లో గురువారం ఉదయం కాంగ్రెస్​ ముఖ్య నేతల సమావేశం జరగనుంది. ఇందులో పార్టీ రాష్ట్ర ఇన్​చార్జ్​ మాణిక్కం ఠాగూర్​తోపాటు రేవంత్​ రెడ్డి, భట్టి విక్రమార్క, మధు యాష్కీ, కమిటీ నేతలు పాల్గొంటారని గాంధీభవన్​ వర్గాలు తెలిపాయి. మధ్యాహ్యం మూడు గంటలకు అనుబంధ సంఘాల చైర్మన్లతో సమావేశం ఉంటుంది. కాగా, మునుగోడు ఉప ఎన్నికలో అనుసరించాల్సి వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికపై మండలాలవారీగా ఈ నెల 16 నుంచి అభిప్రాయ సేకరణ జరపాలని కాంగ్రెస్​ నిర్ణయించింది. 20వ తేదీ వరకు జరిగే ఈ సమీక్షా సమావేశాల్లో పార్టీ ముఖ్య నేతలంతా పాల్గొంటారు. 

కేసీఆర్​, కేటీఆర్​ ఆదేశాలతో ముందుకు: జగదీశ్​రెడ్డి

సీఎం కేసీఆర్​ ఏ నిర్ణయం తీసుకున్నా.. ఎవరిని అభ్యర్థిగా పంపించినా ఐక్యంగా పనిచేసి గెలిపించుకుంటామని మంత్రి జగదీశ్​రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్​, టీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ ఇచ్చే ఆదేశాల మేరకు నడుచుకుంటామని, అసంతృప్తులు ఏమీ లేవని మీడియాతో  చెప్పారు. అభ్యర్థి విషయంలో ఎక్కడ ఎలాంటి ఇతర ఆలోచనలు లేవన్నారు.  సీఎం కేసీఆర్​ ఎవరిని ప్రకటించినా మంచి మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. మునుగోడు 
బై ఎలక్షన్ కు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.