కరోనా రూల్స్.. ఒక్కోసారి ఒక్కోలా!

కరోనా రూల్స్.. ఒక్కోసారి ఒక్కోలా!
  • టీఆర్ఎస్ కార్యక్రమాలకు అడ్డురాని ఆంక్షలు
  • ప్రతిపక్షాల నిరసనలకు మాత్రం అడుగడుగునా అడ్డంకులు
  • ఆంక్షల పేరుతో అరెస్టులు, నిర్బంధాలు
  • మంత్రులు, ఎమ్మెల్యేల సంబురాలు, ర్యాలీలకు నో కొవిడ్ రూల్స్
  • టీఆర్ఎస్ ప్రోగ్రామ్​లకు అన్నీ తామై పనిచేస్తున్న పోలీసులు 

హైదరాబాద్, వెలుగు: కరోనా పేరుతో అధికార టీఆర్ఎస్ పార్టీ పొలిటికల్ గేమ్ ఆడుతోంది. ప్రతిపక్షాలను అణచివేసేందుకు కొవిడ్ ఆంక్షలను తన అవసరాలకు అనుగుణంగా మార్చుకుంటోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు వందల మందితో సంబురాలు చేసుకున్నా.. వేలాది మందితో ర్యాలీలు తీసినా.. మాస్క్‌‌లు పెట్టుకోకున్నా.. ఫిజికల్ డిస్టెన్స్ పాటించకున్నా పట్టించుకోని సర్కారు.. అపొజిషన్ చేపట్టే నిరసన కార్యక్రమాలను మాత్రం కరోనా రూల్స్ చెప్పి అడ్డుకుంటోంది. దీంతో ఫస్ట్, సెకండ్ వేవ్ టైంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన ప్రభుత్వం ఇప్పుడు కరోనాతోనే రాజకీయం మొదలు పెట్టిందని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. మరోవైపు టీఆర్ఎస్ కార్యక్రమాల్లో అన్నీ తామై పనిచేస్తున్న పోలీసులు.. ప్రతిపక్షాల నిరసనలకు మాత్రమే రూల్స్‌‌ మాట్లాడుతున్నారు. యాసంగిలో సీఎం వరి సాగు చేసి.. రైతులను వేయొద్దని చెప్పడంపై గజ్వేల్‌‌లో రచ్చబండకు పిలుపునిచ్చిన పీసీసీ చీఫ్‌‌ రేవంత్‌‌ రెడ్డిని ఆంక్షల పేరుతో ఇల్లు దాటి బయటకు రానివ్వలేదు. ఉద్యోగుల పక్షాన జాగరణ దీక్షకు కూర్చున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌‌ని ఆయన ఆఫీస్‌‌ గ్రిల్స్‌‌, డోర్‌‌ పగులగొట్టి మరీ అరెస్ట్‌‌ చేశారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల కుటుంబాల ఆవేదనను పంచుకునేందుకు వైఎస్సార్​టీపీ చీఫ్ షర్మిలకు అనుమతి నిరాకరించారు. సర్కారు కార్యక్రమాలకు అడ్డురాని ఆంక్షలు.. ప్రతిపక్షాల కార్యక్రమాలకే అడ్డొస్తున్నాయా అంటూ జనం ప్రశ్నిస్తున్నారు. టీఆర్‌‌ఎస్ లీడర్లు సభలు, సమావేశాలు పెడితే వైరస్‌ సోకదా, కరోనా కారెక్కిందా అంటూ కామెంట్లు చేస్తున్నరు.

కేసులు పెరుగుతున్నా పట్టించుకోలే.. కానీ..
దేశంలోకి కొత్త వేరియంట్ ఎంటర్ కావడంతో నవంబర్‌‌‌‌లోనే అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. కరోనా ఆంక్షలు విధించడంపై ఆలోచన చేయాలని, పరిస్థితులకు అనుగుణంగా నైట్ కర్ఫ్యూ పెట్టుకోవాలని సూచనలు చేసింది. అయితే సర్కారు అప్పటి నుంచి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. రాష్ట్రంలోకి ఒమిక్రాన్ ఎంటర్ అయినా, కేసుల సంఖ్య పెరుగుతున్నా పట్టించుకోలేదు. కేవలం మాస్క్ మస్ట్ అని, మాస్క్‌‌ పెట్టుకోకుంటే రూ.వెయ్యి జరిమానా విధించాలని డిసెంబర్ 2వ తేదీన ఆర్డర్స్ ఇచ్చి చేతులు దులుపుకుంది. ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై నిరసన కార్యక్రమాలు తలపెట్టిన వెంటనే ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చింది.

కరోనా రూల్స్.. ఒక్కోసారి ఒక్కోలా!
ఒక్కోసారి.. ఒక్కోలా కరోనా రూల్స్ అమలు చేయడం, ప్రజలకు అవసరమైనప్పుడు కాకుండా ప్రతిపక్షాలు పెట్టుకునే కార్యక్రమాలను అడ్డుకునేలా ప్రభుత్వం జీవోలు జారీ చేయడమేమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డిసెంబర్ 27న నిరుద్యోగ దీక్ష చేపట్టనున్నట్లు బీజేపీ ప్రకటించగానే.. ప్రభుత్వం 26న కరోనా ఆంక్షల జీవో విడుదల చేసింది. జనవరి 2 వరకు బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం పెట్టింది. దీంతో ఇందిరాపార్క్‌‌ వద్ద చేపట్టాల్సిన దీక్షను బీజేపీ స్టేట్ ఆఫీసుకు మార్చుకున్నరు. కానీ డిసెంబర్ 31 వేడుకల్లో భాగంగా వైన్స్, బార్లకు మిడ్​నైట్ వరకు ఓపెన్ చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. పబ్‌‌లకూ ఓకే చెప్పింది. ఆ రెండు రోజులూ ఆంక్షలు, రూల్స్‌‌ను పట్టించుకోలేదు. మళ్లీ జనవరి 2 నుంచి 10 వరకు ర్యాలీలు, బహిరంగ సభలు, మత, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు అన్ని సామూహిక కార్యక్రమాలను నిషేధిస్తున్నట్టు సీఎస్  ఉత్తర్వులిచ్చారు.

వైఎస్సార్ టీపీ రైతు ఆవేదనకూ అడ్డంకులు
ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను పరామర్శించేందుకు రైతు ఆవేదన యాత్రను వైఎస్సార్​టీపీ చీఫ్ వైఎస్ షర్మిల చేపట్టారు. ఈ నెల 4 నుంచి రెండో విడత యాత్ర మళ్లీ ప్రారంభించనున్నట్లు మొన్న ప్రకటించారు. ఆ ప్రకటన వచ్చిన మరుసటి రోజే.. కరోనా ఆంక్షలు మరింత కఠినం చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

పోలీసులు.. జీ హుజూర్!
ఇక పోలీసులు టీఆర్ఎస్ తానా అంటే తందానా అంటున్నారు. అధికార పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు గ్రీన్‌‌ సిగ్నల్‌‌ ఇచ్చి, రెడ్‌‌ కార్పెట్‌‌ పరుస్తున్నారు. కానీ అపొజిషన్ చేసే ఆందోళనలపై మాత్రం ఉక్కుపాదం మోపుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నాయకులు సమావేశాలు నిర్వహించినా, సంబురాలు చేసుకున్నా, వందలు, వేలాది మందితో ర్యాలీలు తీసినా ఆంక్షల మాటే ఎత్తడం లేదు. రైతుబంధు వేడుకల పేరుతో లీడర్లంతా పక్కపక్కనే ఉన్నా ఫిజికల్‌‌ డిస్టెన్స్‌‌ విషయమే ఎత్తడం లేదు. సీఎం సహా మంత్రులు, లీడర్లు మాస్క్‌‌లు పెట్టుకోకున్నా.. మాస్క్‌‌ మస్ట్‌‌ అని ప్రభుత్వం ఇచ్చిన జీవోను గుర్తు చేయడం లేదు. అదే ప్రతిపక్షాలు చేపట్టే ఆందోళనలకు మాత్రం కరోనా ఆంక్షల పేరుతో అడ్డంకులు సృష్టిస్తున్నారు.

కాంగ్రెస్ రచ్చబండకు నో పర్మిషన్
సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌‌లోని ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమాన్ని డిసెంబర్ 27న నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అయితే అప్పటికే కరోనా ఆంక్షల జీవో తెచ్చిన సర్కార్.. రచ్చబండ కార్యక్రమానికి అనుమతి లేదని చెప్పింది. దీంతో పీసీసీ చీఫ్ రేవంత్‌‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. డిసెంబర్ 31న జయశంకర్ భూపాలపల్లిలో రచ్చబండకు వెళ్లకుండా మళ్లీ హౌస్ అరెస్ట్ చేశారు.