టీఆర్‌‌ఎస్‌‌ అసలు స్వరూపం బయటపడింది

టీఆర్‌‌ఎస్‌‌ అసలు స్వరూపం బయటపడింది

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రపతి ఎన్నికలతో టీఆర్‌‌ఎస్‌‌ అసలు స్వరూపం బయటపడిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్‌‌ వెంకటస్వామి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌‌తో కొట్లాడుతున్నామని గప్పాలకు పోయే టీఆర్​ఎస్​ పార్టీ జాతీయ స్థాయిలో అదే కాంగ్రెస్​తో జట్టు కట్టిందని విమర్శించారు. ‘‘జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌‌, బీజేపీకి ప్రత్యామ్నాయంగా రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తామంటూ పదే పదే చెప్తున్న కేసీఆర్‌‌.. కాంగ్రెస్‌‌ మద్దతుతో రాష్ట్రపతి ఎన్నికల బరిలోకి దిగిన యశ్వంత్‌‌ సిన్హాకు మద్దతు పలుకుతున్నరు. కాంగ్రెస్‌‌ పార్టీతో కేసీఆర్‌‌  కలిసే ఉన్నారని చెప్పడానికి ఇదే నిదర్శనం” అని ఆయన  అన్నారు. సోమవారం హైదరాబాద్‌‌లో వివేక్ వెంకటస్వామి మీడియాతో మాట్లాడారు.  రాష్ట్రంలో పరస్పరం రాజకీయ విమర్శలు చేసుకునే టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌, కాంగ్రెస్‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌లో కలిసే ఉన్నాయనడానికి అనేక ఉదంతాలు ఉన్నాయని తెలిపారు. పార్లమెంట్‌‌‌‌ శీతాకాల, బడ్జెట్‌‌‌‌ సమావేశాల్లో కాంగ్రెస్‌‌‌‌ పార్టీతో కలిసే టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఆందోళనలు చేసిందని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్‌‌‌‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిపక్ష పార్టీల సమావేశానికి గతంలో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎంపీలు హాజరయ్యారని పేర్కొన్నారు. యశ్వంత్‌‌‌‌ సిన్హా నామినేషన్‌‌‌‌కు టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ కేటీఆర్‌‌‌‌ హాజరయ్యారని, కాంగ్రెస్​, టీఆర్​ఎస్​  ఒక్కటేనని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుదన్నారు. 

గత్తర లేపుతా అన్నది కాంగ్రెస్​ కోసమేనా?

రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన నేత ద్రౌపది ముర్మును ఎన్డీయే ప్రకటించిందని, స్వాతంత్య్ర భారతదేశ చరిత్రలో ఇలా ఎస్టీ వర్గానికి చాన్స్​ ఇచ్చింది కేవలం బీజేపీనేనని వివేక్​ వెంకటస్వామి తెలిపారు. ద్రౌపది ముర్ము విజయం సాధించడానికి అవసరమైన దానికన్నా ఎక్కువ సంఖ్యాబలమే ఉందని, ఆమె గెలుపు నల్లేరుపై నడకేనని పేర్కొన్నారు. అయినా గిరిజన అభ్యర్థికి కేసీఆర్‌‌‌‌ మద్దతు ఇవ్వకుండా ఎస్టీలపై వ్యతిరేకతను చాటుకున్నారని ఆయన అన్నారు. ‘‘ఢిల్లీ కోటలు బద్దలు కొడుతా, జాతీయ స్థాయిలో గత్తర లేపుతా అంటూ కేసీఆర్ చేసే వ్యాఖ్యలన్నీ కాంగ్రెస్‌‌‌‌కు అనుకూలంగా బీజేపీకి వ్యతిరేకంగా చేస్తున్నవేనని తాజా చర్యలతో తేటతెల్లమైంది. కాంగ్రెస్​తో ఇక్కడ దోస్తీ.. అక్కడ కుస్తీ అన్నట్లుగా టీఆర్​ఎస్​ తీరు ఉంది” అని అన్నారు. రాష్ట్రంలో బీజేపీని ఎదుర్కోలేకనే కాంగ్రెస్‌‌‌‌తో కేసీఆర్ అనైతిక బంధం కొనసాగిస్తున్నారని విమర్శించారు.  అవకాశవాద రాజకీయాలు చేస్తున్న కేసీఆర్‌‌‌‌కు వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని హెచ్చరించారు.