ఓట్ల కోసం  ఒట్లు

ఓట్ల కోసం  ఒట్లు
  • హుజూరాబాద్​లో టీఆర్​ఎస్​ జిమ్మిక్కులు
  • ఆత్మీయ సమ్మేళనాల పేరిట కులాల వారీగా లీడర్ల మీటింగ్​లు
  • ఆత్మగౌరవ భవనాలు, ఆలయాలకు అక్కడికక్కడే ఫండ్స్ శాంక్షన్
  • కులపోళ్లందరి ఓట్ల కోసం ప్రమాణాలు, ఏకగ్రీవ తీర్మానాలు

ఈ నెల 7న హుజూరాబాద్ లో గౌడ, పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మంత్రి గంగుల కమలాకర్​ హాజరయ్యారు. పద్మశాలీలకు టౌన్​లో  ఆత్మ గౌరవ భవన నిర్మాణం కోసం ఎకరం భూమితో పాటు రూ. కోటి ఫండ్స్​ మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అంతకు కొద్దిరోజుల ముందే గౌడ కులస్తులకు కూడా ఎకరా భూమిలో రూ. కోటితో ఆత్మగౌరవ భవనం నిర్మిస్తామని మంత్రి శ్రీనివాస్​గౌడ్​ హామీ ఇచ్చారు. దీంతో 7న జరిగిన మీటింగ్​లోనే గౌడ, పద్మ శాలీల కుల పెద్దలతో తామంతా టీఆర్ఎస్​కే ఓటు వేస్తామని ఇట్ల ప్రమాణం చేయించుకున్నారు. ఏకగ్రీవ తీర్మానం కూడా రాయించుకున్నారు. 


హుజూరాబాద్​లో ఓట్ల కోసం టీఆర్​ఎస్  లీడర్లు ప్రజలతోటి ఇమానాలు చేయించు కుంటున్నరు. ఏం కావాల్నంటే అవి చేసిపెడ్తమని, అయితే ముందుగల్ల తమ పార్టీ అభ్యర్థికి ఓటేస్తమంటూ ఒట్టెయ్యాలని కండిషన్​ పెడ్తున్నరు. ప్రత్యేకంగా కుల సంఘాలతో మీటింగ్​లు పెట్టి, ప్రమాణాలు చేయించు కుంటున్నరు. అక్కడికక్కడే ఫండ్స్​ శాంక్షన్​ చేస్తూ.. 
ఓట్ల కోసం తీర్మానాలు రాయించుకుంటున్నరు.  తీర్మాన కాపీలు ఒకటొకటిగా సోషల్​ మీడియాలో ప్రత్యక్షమవు తున్నయ్​. ఈ తీర్మానాలు కుల సంఘాల్లో పంచాదులు పెడుతున్నయ్​. తమకు తెలియకుండా మీరెట్ల మాటిచ్చి వస్తరని కులంలోని మిగితావాళ్లు మండిపడుతున్నరు.

 

కరీంనగర్, వెలుగు: ఇప్పటికే ఎన్నికల్లో ప్రయోజనం కోసమే హుజూరాబాద్​లో దళిత బంధును ప్రవేశపెట్టినట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు మిగిలిన కులాల ఓట్లకు గాలం వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఎన్నికల వాయిదాతో దొరికిన టైంను ఇందుకు వాడుకుంటున్నది. ఒక్కో ఊరిలో ఒకటి, రెండు కుల సంఘాలతో ఆత్మీయ సమ్మేళనాల పేరిట మంత్రులు, ఎమ్మెల్యేలు మీటింగ్​లు పెడుతున్నారు. అన్ని రకాల తాయిలాలు ఎరజూపుతున్నారు. ఆయా పట్టణాలు, గ్రామాల్లో  ప్రతి కుల సంఘానికి 10 గుంటలు మొదలుకొని ఎకరా వరకు భూమి, ఆత్మగౌరవ భవనం నిర్మాణానికి రూ. కోటి దాకా ఫండ్స్​ మంజూరు చేస్తున్నారు. కొందరు కుల పెద్దలకు  లక్షలు ముట్టజెప్పి మరీ జనాల్ని సమీకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వేదికలపైనే మంత్రులు.. ఆయా కులసంఘాలకు భూమి, ఫండ్స్​ మంజూరు చేస్తూ ప్రకటనలు ఇస్తున్నారు. అక్కడే కులసంఘాల సభ్యులతో ప్రమాణాలు చేయించుకొని కులపెద్దలతో తీర్మానాలు రాయించుకుంటున్నారు. ఆయా కులాల్లో అందరికీ ఆమోదం ఉన్నా.. లేకున్నా  కుల సంఘం లెటర్ హెడ్ మీద  ఏకగ్రీవ తీర్మానాలు రాయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 
ఊరూరా ఆత్మీయ సమ్మేళనాలు  
ఆగస్టులో ఉప ఎన్నికల నోటిఫికేషన్​వస్తుందని మొదట్లో భావించిన టీఆర్ఎస్​ హైకమాండ్​.. ఊరూరా సీసీరోడ్లు, డ్రైనేజీలు, డివైడర్లు, సెంట్రల్​ లైటింగ్​ లాంటి అభివృద్ధి పనులపై ఫోకస్​ పెట్టాలని పార్టీ ఇన్​చార్జులుగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలను ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన లీడర్లు నియోజకవర్గంలో వాడవాడలా తిరుగుతూ వివిధ పనులతో లిస్టులు తయారుచేసి పంపించారు. 


వెనువెంటనే  వందల కోట్ల విలువైన పనులకు శాంక్షన్ ఇవ్వడంతో ఎడాపెడా శంకుస్థాపనలు చేశారు. కానీ అప్పటికే దాదాపు హుజూరాబాద్​, జమ్మికుంట పట్టణాలతో పాటు అన్ని గ్రామాల్లో సీసీరోడ్లు, డ్రైనేజీలు ఉండడంతో మళ్లీ వాటి మీదనే కొత్త రోడ్లు, డ్రైనేజీలు వేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. అదే సమయంలో వరుస పండుగల తర్వాతే ఉప ఎన్నిక  నిర్వహిస్తామని ఈసీ ప్రకటించడంతో.. ఈసారి కులసంఘాల ఓట్లను టీఆర్ ఎస్​ టార్గెట్​ చేసింది. బై పోల్​కు కావాల్సినంత టైం ఉండడంతో ఊరూరా రోజూ ఒకటి, రెండు కులాలవారితో మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశాలు పెడుతున్నారు. గడిచిన వారం రోజులుగా ఆత్మీయ సమ్మేళానాలు జోరందుకున్నాయి. ఇప్పటికే హుజురాబాద్‍లో గౌడ, పద్మశాలి, నాయి బ్రాహ్మణ, విశ్వకర్మలతో.. వీణవంకలో మున్నూరు కాపులతో టీఆర్​ఎస్​ ఆత్మీయ సమ్మేళనాలు ముగిశాయి.   హుజూరాబాద్ లో ఆదివారం మున్నురుకాపు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ వరుస ఆత్మీయ సమ్మేళనాలకు మంత్రి గంగుల కమలాకర్‍, మంత్రి హరీశ్ రావు హాజరవుతున్నారు. 
భూమి, ఆత్మగౌరవ భవనాలకు హామీ.. 
కుల సంఘాలతో ఆత్మీయ సమావేశాల సందర్భంగా మంత్రులు..   కుల సంఘాల భవనాలకు, కులదేవతల ఆలయాలకు కావాల్సిన భూమి, ఫండ్స్​ మంజూరు చేస్తున్నారు. కేవలం మంజూరు చేస్తే జనం నమ్ముతారో లేదోనని  కమ్యూనిటీ  హాల్స్, దేవాలయాలకు లీడర్లు భూమి పూజలు చేస్తున్నారు. 
    ఈ నెల 9న హుజూరాబాద్‍లో రంగనాయకుల గుట్ట వద్ద  ముదిరాజ్‍ కుల దైవం పెద్దమ్మగుడి నిర్మాణానికి మంత్రి హరీశ్​రావు భూమి పూజ చేశారు. ఈ దేవాలయాన్ని రూ.30 లక్షలతో ఆరు నెలల్లోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 
    వీణవంక మండలంలోని గన్ముకుల, మల్లారెడ్డి పల్లి, చల్లూరు గ్రామాల్లో వివిధ కమ్యూనిటీ హాల్స్ కు ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌‌రావు శంకుస్థాపన చేశారు. 
    కోరుకల్‍ గ్రామంలో లక్ష్మీ నర్సింహస్వామి ఆలయంలో  రూ. 33 లక్షలతో మండపం నిర్మాణానికి మంత్రి హరీశ్​ భూమి పూజ చేశారు. 
    జమ్మికుంట మండలంలో కోటి రూపాయలతో నిర్మించే వైశ్య భవన్‍ కు మంత్రి హరీశ్​రావు భూమి పూజ చేశారు. వడ్డెర సంఘం భవనానికి రూ.20 లక్షలు, ఆబాద్‍ జమ్మికుంటలో ఇదివరకే ఉన్న  పెద్దమ్మ గుడికి మరో  రూ. 29 లక్షలు మంజూరు చేశారు. స్థానికంగా ఓ చర్చికి  రూ. 10 లక్షలు మంజూరు చేశారు. చౌడపల్లి లో యాదవ సంఘ భవనానికి శంకుస్థాపన చేశారు.
    హుజూరాబాద్‍లో వైశ్య భవన్‍కు ఎస్‍ఆర్‍ఎస్‍పీ ల్యాండ్‍లో మంత్రి గంగుల  శంకుస్థాపన చేశారు. ఇదే ఏరియాలో ముదిరాజ్, రజక , యాదవ భవనాలకు కూడా స్థలాలు కేటాయించారు. 
    హుజూరాబాద్​లోనే రూ. 18 లక్షలతో నాగమయ్య టెంపుల్​ను,  రూ. 33 లక్షలతో  పెద్దమ్మగుడికి  రిపేర్లు చేయిస్తామని హరీశ్ హామీ ఇచ్చారు. ఈ పనులకు గురువారం భూమి పూజ చేశారు. 
    వెంకట్రావు పల్లి లో హనుమాన్‍ ఆలయం అభివృద్ధికి ఫండ్స్​ కేటాయించారు. నాయిబ్రాహ్మణులు, విశ్వకర్మలకు కూడా స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కమలాపూర్‍ మండలంలో దాదాపు అన్ని గ్రామాలకు కమ్యూనిటీ హాల్స్, గ్రామ దేవతల ఆలయాలకు నిధులు మంజూరు చేశారు. ఇటీవల ఉప్పల్‍, శనిగరం, అంబాల గ్రామాల్లో రేణుక ఎల్లమ్మ ఆలయాలకు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి భూమి పూజ చేశారు.


ఈ నెల 8న హుజూరాబాద్ లో లోకల్​ నాయీ బ్రాహ్మణ కులస్తులతో టీఆర్ఎస్​ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు. నాయీ బ్రాహ్మణులకు టౌన్​లో పది గుంటల భూమి కేటాయించి, కుల సంఘ భవనాన్ని నిర్మించి ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. హుజూరాబాద్ పట్టణ నాయీ బ్రాహ్మణ కులస్తులతో తామంతా టీఆర్ఎస్ పార్టీ  అభ్యర్థి శ్రీనివాస్  గెలుపుకు సహకరిస్తామని తీర్మాన పత్రం రాయించుకున్నారు.

ఇది అధికార దుర్వినియోగమే
టీఆర్ఎస్ నేతలు  కులాల వారీగా ఓట్ల కోసం మీటింగ్ లు పెట్టి  కమ్యూనిటీ హాళ్లు, టెంపుళ్ల నిర్మాణానికి హామీలిస్తున్నరు. ఇవి ఆయా కులాలను ప్రలోభపెట్టేందుకే. టీఆర్ ఎస్​కే  ఓట్లు వేయిస్తామని ఏకగ్రీవ తీర్మానాలు, ప్రమాణాలు చేయించుకోవడం అధికార దుర్వినియోగమే. కులపెద్దలను ప్రలోభాలకు గురిచేసి తీర్మానాలు చేయించుకుంటున్నరు. ఇవన్నీ ఓట్ల కోసమే తప్ప ప్రజలపై ప్రేమతో చేయట్లేదు. ఒకవేళ అన్ని కులాలపై ప్రేమ ఉంటే రాష్ట్రమంతా చేయాలి కదా?
- గంగాడి కృష్ణారెడ్డి, బీజేపీ  జిల్లా అధ్యక్షుడు

ఓట్ల కోసం కులాల్లో చిచ్చుపెడుతున్నరు 
ఓట్ల కోసం టీఆర్ఎస్​ లీడర్లు కులాల మధ్యలో  చిచ్చుపెడుతున్నరు. కులసంఘ భవనాలు, టెంపుల్స్​కు భూములు, ఫండ్స్​ ఇస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.  ఇవన్నీ ఓట్ల కొనుగోలుగానే  భావించాలి. టీఆర్ఎస్​ లీడర్ల మధ్య కొట్లాట కారణంగానే ఎన్నికలు  వచ్చాయి. ప్రభుత్వం చేతిలో ఉంది కదాని టీఆర్ఎస్ లీడర్లు ఇష్టారీతిన వ్యవహరిస్తూ..పచ్చని పల్లెల్లో గొడవలకు కారణమవుతున్నరు.
                                                                                                                                            - పత్తి కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు