యువతా.. నిరుద్యోగ భృతి అంటూ కేసీఆర్ చేస్తోన్న మోసాన్ని తిప్పికొట్టండి

V6 Velugu Posted on Feb 02, 2021

హైదరాబాద్: తెలంగాణ వ‌చ్చాక టిఆర్ఎస్ పాలనలో ఎక్కువ నష్టపోయింది యువత, నిరుద్యోగులేన‌ని మాజీ శాసనసభ్యులు, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. మంగళవారం గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ..  14 ఏళ్ల పాటు  యువత నిరుద్యోగుల పోరాటాన్ని, త్యాగాన్ని పునాదిగా చేసుకొని వాళ్లు పేర్చిన మెట్ల మీద ముఖ్యమంత్రి గద్దె ఎక్కిన కేసీఆర్, వాళ్లకు తీరని ద్రోహం చేశారన్నారు. ఉద్యమంలో కీలక భూమిక అయిన ఉద్యోగ ఉపాధి రంగాన్ని కేసీఆర్ ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యం చేసింద‌న్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా 2018 లో ఇస్తామన్న నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదని అన్నారు. ఇన్నేళ్ల కేసీఆర్ హయాంలో ప్రభుత్వం నియమించిన ఉద్యోగాల కన్నా తొలగించిన ఉద్యోగాలే ఎక్కువని ఆయ‌న అన్నారు.

రాబోయే మండలి, కార్పొరేషన్, నాగార్జున సాగర్ ఎన్నికలలో లబ్ది కోసం కేసీఆర్ మరోసారి యువతను మోసం చేసే కుట్ర చేస్తుందని అన్నారు. తాజాగా 50 వేల ఉద్యోగాలు, త్వరలో నిరుద్యోగ భృతి అంటూ టీఆర్ఎస్ ప్ర‌భుత్వం మరో మోసానికి పూనుకున్న‌ద‌న్న వంశీచంద్ రెడ్డి.. ఇప్పటి వరకు ఎవరు నిరుద్యోగి, ఎంతమంది నిరుద్యోగులు అనే అంశంపైనా ఒక కమిటీ వేయలేదని, విధి విధానాలు రూపొందించలేదన్నారు. యువత కేసీఆర్ కుట్రలను అర్థం చేసుకొని ఆయన ఎత్తులను, మోసాన్ని తిప్పికొట్టాలని చెప్పారు.

వివిధ శాఖల్లో 2 లక్షలకు పైగా ఉన్న ఖాళీలకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాల‌ని వంశీచంద్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 25లక్షలకు పైగా నమోదైన‌ నిరుద్యోగులకు 2018 సంవత్సరం నుంచి నిరుద్యోగ భృతి చెల్లించాలన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి నిరుద్యోగి అకౌంట్లో 75వేలు జమ చేసి, ప్రతి నెల రూ. 3016 అకౌంట్లో వేయాలన్నారు. ఉద్యోగ భర్తీకి క్యాలెండర్ విడుదల చేయాల‌ని చెప్పారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్చింగ్, గెస్ట్ ఫ్యాకల్టీ పేరుతో శ్రమ దోపిడీ ఆపి నిరుద్యోగులకు అండగా నిలవాలని, ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆయ‌న డిమాండ్ చేశారు.

Tagged committing another scam, TRS Government, unemployment benefit, Vamshi Chand Reddy

Latest Videos

Subscribe Now

More News