
తెలంగాణలో ఐటీఐఆర్ ప్రాజెక్టు అమలు కాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేంద్రానికి రోజుకో లెటర్ రాస్తూ టీఆర్ఎస్ నేతలు తమ తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. హైదరాబాద్ చుట్టూ వివిధ క్లస్టర్లలో ఐటీ, హార్డ్ వేర్, ESDM పరిశ్రమలను ఏర్పాటు చేయాలన్నది ఐటీఐఆర్ ప్రాజెక్టు లక్ష్యమన్నారు. ఫలక్ నుమా నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ఎంఎంటీఎస్ , మెట్రో రైల్ పొడిగింపు, రేడియల్ రోడ్ల అభివృద్ధి లాంటి మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయిందన్నారు. మౌలిక వసతులపై రిపోర్టులను క్వార్టర్లీ నివేదికను కేంద్ర ఎలక్ట్రానిక్, ఐటీ శాఖకు పంపలేదన్నారు.
2017లో రివ్యూ మీటింగ్ జరిపిన కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం చొరవ నిరాశాజనకంగా ఉందని చెప్పిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేయకుండా.. ప్రధానికి, దత్తాత్రేయకు లెటర్ రాశాం అని పైపై మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో యువత నుంచి వస్తున్న వ్యతిరేకతను దారి మళ్లించేందుకు టీఆర్ఎస్ వేస్తున్న ఎత్తుగడలను జనం అర్థంచేసుకుంటారన్నారు.
నిర్మాణాత్మకంగా రైల్వే, ఎంఎంటీఎస్, రేడియల్ రోడ్లు డెవలప్ చేసి ఉంటే.. ఐటీఐఆర్ ప్రాజెక్టును కొనసాగించేందుకు కేంద్రం సిద్ధంగా ఉండేదన్నారు. నిర్లక్ష్యం వహించిన తెలంగాణ ప్రభుత్వం .. ఇపుడు గగ్గోలు పెడుతోందన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు అమలు కాకపోవడానికి కారణం.. తెలంగాణ ప్రభుత్వ సహాయ నిరాకరణేనని కాగ్ 2017లో తన రిపోర్టు ఇచ్చిందన్నారు. 914 ఎకరాల్లో అభివృద్ధి చేయబోయే 2 గ్రీన్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను హైదరాబాద్ కు కేంద్రం మంజూరు చేసిందన్నారు.