మూడెకరాల భూపంపిణీలో ఫెయిలైనం

మూడెకరాల భూపంపిణీలో ఫెయిలైనం

ఇది సీఎం కేసీఆరే ఒప్పుకున్నరు: ప్రభుత్వ విప్‌ సునీత
యాదాద్రి, వెలుగు: దళితులకు మూడెకరాల భూమి ఇవ్వడంలో తమ సర్కార్ ఫెయిలైందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. ఇది సీఎం కేసీఆర్ గతంలోనే ఒప్పుకున్నారని చెప్పారు. రాష్ట్రం వచ్చాక భూముల ధరలు పెరిగిపోయాయని, దీంతో తమ ప్రభుత్వం భూములు కొనలేకపోయిందని తెలిపారు. ఈ విషయాన్ని స్వయంగా కేసీఆరే అసెంబ్లీలో చెప్పారన్నారు. శుక్రవారం యాదాద్రి జిల్లా ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో ఆమె మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేకనే, ఏదో ఒక విధంగా లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతోనే స్కీమ్ లు అమలు చేస్తున్నామని చెప్పారు. దళితబంధు కోసం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రిజైన్ చేయాలంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్లను ప్రస్తావిస్తూ.. అలాంటి బెదిరింపులు మానుకోవాలని హెచ్చరించారు. అయినా తాము రాజీనామా చేస్తే ఎన్నికల పండగ వస్తుందని... నాగార్జునసాగర్, హుజూరాబాద్​లో లెక్క తమ కార్యకర్తలు పండగ చేసుకుంటారని అన్నారు. ఎన్నికల వల్లనైనా ప్రజలను కలిసి సమస్యలు తెలుసుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.