మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు తాము ఎంచుకునే ప్లాన్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని '1 ఫైనాన్స్ రీసెర్చ్' తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. సాధారణంగా ఇన్వెస్టర్లు మంచి పోర్ట్‌ఫోలియో ఉన్న ఫండ్లను ఎంచుకుంటే సరిపోతుందని భావిస్తారు. కానీ 'రెగ్యులర్' ప్లాన్లలో దాగి ఉండే కమిషన్లు ఇన్వెస్టర్ల సంపదను నిశ్శబ్దంగా కరిగించేస్తున్నాయని రిపోర్ట్ స్పష్టం చేసింది. ఒకే మ్యూచువల్ ఫండ్‌కు సంబంధించి 'డైరెక్ట్' ప్లాన్‌తో పోలిస్తే 'రెగ్యులర్' ప్లాన్‌లో పెట్టుబడి పెట్టిన వారు 10 ఏళ్ల కాలంలో తమకు రావాల్సిన లాభాల్లో దాదాపు 25 శాతం కంటే ఎక్కువ నష్టపోతున్నట్లు వెల్లడైంది. వాస్తవానికి ఇది చాలా పెద్ద నష్టం ఇన్వెస్టర్లకు.
నష్టపోతున్న 80 శాతం ఇన్వెస్టర్లు..
పదేళ్ల కాలపరిమితి కలిగిన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీముల్లో 80 శాతం కంటే ఎక్కువ ఫండ్స్.. రెగ్యులర్ ప్లాన్ ఇన్వెస్టర్లకు 25 శాతం తక్కువ లాభాలను అందించాయి. ఇంకా ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. ప్రతి ఐదు స్కీములలో ఒకటి 50 శాతానికి పైగా సంపదలో అంతరాన్ని చూపింది. అంటే ఒక డైరెక్ట్ ప్లాన్ ఇన్వెస్టర్ పొందిన లాభంతో పోలిస్తే.. రెగ్యులర్ ప్లాన్ ఇన్వెస్టర్ సగం లాభాన్ని మాత్రమే పొందగలిగారని డేటా చెబుతోంది. దీనికి ప్రధాన కారణం రెగ్యులర్ ప్లాన్లలో ఉండే అధిక 'ఎక్స్‌పెన్స్ రేషియో' (Expense Ratio) అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లకు చెల్లించే కమిషన్లు ఈ ఖర్చులో కలిసి ఉండటం వల్ల ప్రతి ఏటా ఇన్వెస్టర్ల రాబడిపై ప్రతికూల ప్రభావం చూపుతోందని తేలింది.
ఎక్కువ కాలం పెట్టుబడితో ఎక్కువ నష్టాలు..
రెగ్యులర్ ఫండ్స్ లో పెట్టుబడి కాలం పెరిగేకొద్దీ ఈ నష్టం తీవ్రత కూడా పెరుగుతుందని గుర్తించబడింది. ఐదేళ్ల కాలపరిమితి కలిగిన స్కీములను పరిశీలిస్తే.. 53 శాతం ఫండ్లలో డైరెక్ట్ ప్లాన్లకు, రెగ్యులర్ ప్లాన్లకు మధ్య లాభాల్లో 15 శాతం తేడా గమనించబడింది. కానీ పదేళ్లకు వచ్చేసరికి ఈ లాభాల గ్యాప్ ఏకంగా 25 నుంచి 50 శాతానికి చేరుకుంటోంది. చిన్నపాటి వార్షిక ఖర్చుల తేడా కాంపౌండింగ్ ప్రభావం వల్ల దీర్ఘకాలంలో భారీ సంపదను హరించివేస్తోందని 1 ఫైనాన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రజనీ తాండలే హెచ్చరించారు. ఇది ఏదో ఒక సందర్భంలో జరిగేది కాదని.. రెగ్యులర్ ప్లాన్ల నిర్మాణంలోనే ఉన్న లోపమని ఆమె చెబుతున్నారు.
ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. రెగ్యులర్ ప్లాన్ ఇన్వెస్టర్లు డైరెక్ట్ ప్లాన్ ఇన్వెస్టర్ల కంటే ఎక్కువ కాలం తమ పెట్టుబడులను కొనసాగిస్తున్నారంట. కనీసం చాలా మంది 5 ఏళ్ల కంటే ఎక్కువ సమయం పెట్టుబడిని కొనసాగిస్తున్నట్లు తేలింది. క్రమశిక్షణతో ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేసినప్పటికీ, అధిక కమిషన్ల కారణంగా వారు ఆశించిన స్థాయిలో సంపదను సృష్టించలేకపోతున్నారు. ఈ నష్టానికి కారణం ఫండ్ పనితీరు కాదని, కేవలం ఇన్వెస్టర్ ఎంచుకున్న ప్లాన్ అని నివేదిక స్పష్టం చేసింది. పోర్ట్‌ఫోలియోలు ఒకేలా ఉన్నప్పటికీ.. కేవలం కమిషన్ల భారం వల్ల ఇన్వెస్టర్లు తమ కష్టార్జితంలో భారీ మొత్తాన్ని కోల్పోతున్నారు. అందుకే మంచి ఫండ్‌ను ఎంచుకోవడంతో పాటు.. తక్కువ ఖర్చులు ఉండే 'డైరెక్ట్' ప్లాన్‌ను ఎంచుకోవడం కూడా అంతే ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.
