మూడింట ఒకవంతు నీరు కలుషితం..జల్‌‌‌‌‌‌‌‌ జీవన్‌‌‌‌‌‌‌‌ మిషన్‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌లో వెల్లడి

మూడింట ఒకవంతు నీరు కలుషితం..జల్‌‌‌‌‌‌‌‌ జీవన్‌‌‌‌‌‌‌‌ మిషన్‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌లో వెల్లడి
  • మధ్యప్రదేశ్​లోని గ్రామీణ ప్రాంతాల్లో జనం ఇక్కట్లు
  • 36.7% నీటిలో బ్యాక్టీరియా లేదా హానికర కెమికల్స్‌‌‌‌‌‌‌‌
  • జల్‌‌‌‌‌‌‌‌ జీవన్‌‌‌‌‌‌‌‌ మిషన్‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌లో వెల్లడి

భోపాల్‌‌‌‌‌‌‌‌: మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో తాగునీరు నిశ్శబ్ద ప్రజారోగ్య ముప్పుగా మారింది. ఇటీవల కలుషిత నీరు తాగి 10 మంది మృతిచెందిన ఘటన మరువకముందే డ్రింకింగ్ వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన దిగ్భ్రాంతికర సమాచారం బయటకు వచ్చింది.  

కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, ఆ రాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లో లభించే తాగునీటిలో పావు వంతు కంటే ఎక్కువ నీరు తాగేందుకు ఏమాత్రం సురక్షితం కాదని తేలింది. 

గ్రామీణ ప్రాంతాలనుంచి సేకరించిన తాగునీటి నమూనాల్లో కేవలం 63.3శాతం  మాత్రమే నాణ్యత పరీక్షల్లో సేఫ్‌‌‌‌‌‌‌‌ అని తేలాయి. జాతీయ సగటు 76 శాతం కాగా, ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. అంటే 36.7శాతం నీరు బ్యాక్టీరియా లేదా రసాయన కాలుష్యంతో నిండి ఉంది.

అధ్వానంగా దవాఖానలు, స్కూళ్లలో నీళ్లు..

ప్రభుత్వ ఆసుపత్రుల్లోని  నీటి నమూనాల్లో కేవలం 12శాతం మాత్రమే సురక్షితమని తేలింది. అంటే సుమారు 88శాతం దవాఖానలు రోగులకు కలుషిత నీటిని సరఫరా చేస్తున్నాయి. స్కూళ్లలో సేకరించిన నమూనాల్లో 26.7శాతం నాణ్యతా పరీక్షలో ఫెయిల్‌‌‌‌‌‌‌‌ అయ్యాయి. ఇది విద్యార్థుల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నది. గిరిజన ప్రాంతాల్లో తీవ్ర నీటి సంక్షోభం ఉన్నట్టు జల్ జీవన్ మిషన్ నివేదికలో తెలిపింది. 

అనుప్పూర్, దిండోరిలాంటి గిరిజన జిల్లాల్లో సేకరించిన ఒక్క నమూనా కూడా సురక్షితంగా లేదని నివేదిక స్పష్టం చేసింది. బాలాఘాట్, బెతుల్, చింద్వారాలాంటి జిల్లాల్లో 50 శాతానికి పైగా నీరు కలుషితమైందని తేలింది. రాష్ట్రంలో కేవలం 31.5% ఇండ్లకు మాత్రమే నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఇక 99.1%  గ్రామాల్లో పైపులైన్లు ఉన్నప్పటికీ, కేవలం 76.6% నల్లాలు మాత్రమే పనిచేస్తున్నాయి. 

ఇండోర్ జిల్లాలో 100% కనెక్షన్లు ఉన్నట్లు ప్రకటించినప్పటికీ, అక్కడ కేవలం 33% ఇండ్లకు మాత్రమే సురక్షితమైన నీరు అందుతున్నది. కాగా, ఈ రాష్ట్రంలోని ఇండోర్‌‌‌‌‌‌‌‌ భగీరథ్‌‌‌‌‌‌‌‌పురలో ఇటీవల కలుషిత నీటిని తాగి 10 మంది మరణించారు. 429 మంది ఆసుపత్రి పాలయ్యారు.  ఈ ఘటన అనంతరం నీటి నాణ్యత మెరుగుపడకపోతే రాష్ట్రానికి వచ్చే నిధులను తగ్గిస్తామని కేంద్ర సర్కారు హెచ్చరించింది.