మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో హైకోర్టు కీలక తీర్పు

మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో హైకోర్టు కీలక తీర్పు

హైదరాబాద్: మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిందితుడు అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అమృత ప్రణయ్ పరువు హత్య కేసులో.. అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్‌కు న్యాయస్థానం గతంలో జీవిత ఖైదు విధించింది. జీవిత ఖైదును సవాల్ చేస్తూ శ్రవణ్ కుమార్ తరపున పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణ ముగిసే వరకు బెయిల్ ఇవ్వాలని శ్రవణ్ కుమార్ కోర్టును కోరాడు. అతని వయసు, జైలు జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని అతనికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

2018లో పెద్దలను ఎదిరించి హైదరాబాద్ ఆర్యసమాజ్‌‌‌‌‌‌‌‌లో ప్రణయ్, అమృత ప్రేమ వివాహం చేసుకున్నారు. దీంతో బిడ్డ కులాంతర వివాహం చేసుకున్నదని రగిలిపోయిన మారుతీరావు.. అల్లుడు ప్రణయ్‌‌‌‌‌‌‌‌ని హత్య చేయాలని అస్గర్ అలీకి రూ.కోటి సుపారీ ఇచ్చాడు. అస్గర్ ఏడుగురితో కలిసి గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. ప్రణయ్‌‌‌‌‌‌‌‌ని హత్య చేయడానికి సుభాష్ శర్మ మిర్యాలగూడలో రెక్కీ నిర్వహించి మూడుసార్లు ప్రయత్నించి, ప్లాన్ అమలు చేయలేకపోయాడు. చివరకు అమృత మిర్యాలగూడలోని జ్యోతి హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు చెకప్ కోసం వస్తున్నదని తెలుసుకొని 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్‌‌‌‌‌‌‌‌ను అంతమొందించాడు.
    
హత్య జరగక ముందు అమృత తండ్రి మారుతీరావు ఎస్పీ, కలెక్టర్ ఆఫీసులలో అధికారులను కలిసేందుకు ప్రయత్నించినట్టు సీన్ క్రియేట్ చేశాడు. ప్రణయ్‌‌‌‌‌‌‌‌ని సుభాష్ శర్మ హత్య చేసిన తర్వాత మారుతీరావుకు అస్గర్ అలీ కాల్ చేసి చెప్పడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. రెండు రోజుల అనంతరం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో మారుతీరావును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా సుపారీ ఇచ్చి హత్య చేయించినట్టు వెల్లడించాడు. ఆరేళ్లకు పైగా ప్రణయ్ హత్య కేసు విచారణ జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన మారుతీరావు 2020 సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఆర్యవైశ్య భవన్‌‌‌‌‌‌‌‌లో ఆత్మహత్య చేసుకున్నాడు.