యశ్వంత్ కు టీఆర్ఎస్ గ్రాండ్ వెల్ కం

యశ్వంత్ కు టీఆర్ఎస్ గ్రాండ్ వెల్ కం
  • ప్రేక్షక పాత్ర వహించిన కాంగ్రెస్​
  • ఎయిర్​పోర్టులో సిన్హాకు కేసీఆర్​ స్వాగతం 
  • జలవిహార్​ వరకు భారీ బైక్​ ర్యాలీ
  • పరిచయ కార్యక్రమం తర్వాత ప్రగతిభవన్​లో యశ్వంత్​, సీఎం లంచ్​
  • ఎంఐఎం నేతల వద్దకు తీసుకెళ్లిన టీఆర్​ఎస్​ లీడర్లు

హైదరాబాద్​, వెలుగు: ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా రంగంలోకి దిగిన యశ్వంత్​ సిన్హా హైదరాబాద్​ టూర్​ను టీఆర్​ఎస్​ హైజాక్​ చేసింది. సిన్హా అభ్యర్థిత్వాన్ని బలపరిచిన కాంగ్రెస్​ మాత్రం ప్రేక్షక పాత వహించింది. శనివారం ఉదయం రాష్ట్రానికి వచ్చిన యశ్వంత్​ సిన్హా పరిచయ కార్యక్రమాన్ని టీఆర్​ఎస్​ దగ్గరుండి చూసుకుంది. అంతా తామై కార్యక్రమాన్ని నడిపించింది. సీఎం కేసీఆర్​ స్వయంగా బేగంపేట​ ఎయిర్​పోర్టుకు వెళ్లి యశ్వంత్​ సిన్హాకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి సభాస్థలి అయిన జలవిహార్​ వరకు భారీ ఎత్తున బైక్​ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో  తమ పార్టీ మాత్రమే యశ్వంత్​కు మద్దతు పలుకుతున్నట్లుగా టీఆర్​ఎస్​ కార్యక్రమాన్ని నడిపించింది. పరిచయ కార్యక్రమం ముగిశాక  సీఎం కేసీఆర్​, యశ్వంత్​ సిన్హాను ప్రగతి భవన్​కు తీసుకెళ్లారు. ఇద్దరు అక్కడే లంచ్​ చేశారు. తర్వాత ఎంఐఎం నేతలతో ఒక హోటల్​లో జరిగిన భేటీకి యశ్వంత్​ను టీఆర్​ఎస్​ నేతలే దగ్గరుండి తీసుకెళ్లారు. ఈ భేటీ తర్వాత యశ్వంత్​ బేగంపేట నుంచి బెంగుళూరు వెళ్లిపోయారు. ఈ మొత్తం విజిట్​లో కాంగ్రెస్​ పూర్తిగా దూరంగా ఉండిపోయింది. 

గాంధీభవన్​ విజిట్​ ఉన్నా..!

నిజానికి యశ్వంత్​ షెడ్యూల్​లో రాష్ట్ర కాంగ్రెస్​ కార్యాలయం గాంధీభవన్​ విజిట్​ కూడా ఉంది. కానీ రెండు రోజులకు ముందే పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి  ఒక స్టేట్​మెంట్​ ఇచ్చారు. టీఆర్​ఎస్​ నేతలను ముందు కలిసి తర్వాత తమ వద్దకు వస్తామంటే ఆయనతో భేటీ అయ్యే సమస్యే లేదని తేల్చి చెప్పారు. యశ్వంత్​ రాగానే కేసీఆర్​ను కలుస్తారనే సమాచారంతో రేవంత్.. ‘ఆ ఇంటి మీది కాకి ఇక్కడ వాలేదే లేదు” అని అన్నారు. ముందు తమ వద్దకు వస్తే కలిసే ఆలోచన చేస్తామని తెలిపారు. తాము యశ్వంత్​ను ఢిల్లీలో తమ పార్టీ నేతలతోపాటు కలుస్తామని శనివారం ప్రకటించారు. దాంతో ప్రతిపక్షాల మద్దతు కోరే ఉద్దేశంతో రాష్ట్రానికి వచ్చిన యశ్వంత్​ కార్యక్రమానికి కాంగ్రెస్​ దూరంగా ఉన్నట్లయింది.