దుబ్బాక ఓటమితో జీహెచ్ఎంసీ ఎన్నికలకు తొందరపడుతున్న టీఆర్ఎస్

దుబ్బాక ఓటమితో జీహెచ్ఎంసీ ఎన్నికలకు తొందరపడుతున్న టీఆర్ఎస్

జీహెచ్ఎంసీ ఎన్నికలు దబ్బున పెడ్దం

దుబ్బాక ఓటమితో టీఆర్ఎస్ ఆలోచన

ఎలక్షన్స్​ లేట్​చేస్తే బీజేపీ పుంజుకుంటదేమోనని భయం..
కేడర్​ వలసపోతుందేమోనని అనుమానం

ఎట్ల ముందుకు వెళ్లాలన్న దానిపై గ్రేటర్​ లీడర్లతో మంతనాలు

వరద సాయాన్ని జనం మరువక ముందే ఎన్నికలు పెట్టేందుకు వ్యూహం

హైదరాబాద్, వెలుగు: దుబ్బాక బై ఎలక్షన్​లో బీజేపీ గెలువడంతో టీఆర్ఎస్ పెద్దలకు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బుగులు పట్టుకుంది. గ్రేటర్ ఎలక్షన్స్​ను ఆలస్యం చేస్తే బీజేపీ పుంజుకుంటుందని, పార్టీ కేడర్  వలసపోవచ్చనే భయం వారిని వెంటాడుతున్నది. దీంతో వీలైనంత త్వరగా ఎన్నికలు పెట్టాలని టీఆర్​ఎస్​ పెద్దలు అనుకుంటున్నారు. ఇందుకోసం గ్రేటర్ పరిధిలోని లీడర్లతో మంతనాలు జరుపుతున్నారు. దుబ్బాక రిజల్ట్​ ప్రభావం గ్రేటర్ లో పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై చర్చలు సాగిస్తున్నట్లు తెలిసింది. పైగా  హైదరాబాద్​లో వరద సాయం పంపిణీ కొనసాగుతున్నందున ఆ సాయం గురించి జనం మరువక ముందే ఎలక్షన్స్​ పెడితే ఫాయిదా ఉంటుందని అంచనాలు వేసుకుంటున్నట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పాలక మండలి గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ముగియనుంది.

గ్రేటర్ పరిధిలో బీజేపీకి పుంజుకునే చాన్స్ ఇవ్వొద్దన్న ఆలోచనలో టీఆర్ఎస్ పెద్దలు ఉన్నారు. దుబ్బాక ఫలితం తర్వాత గ్రేటర్​లో బీజేపీ బలం పెంచుకునేందుకు  ట్రై చేస్తున్నదని, అలాంటి అవకాశం ఇవ్వకుండా వెంటనే ఎన్నికలు పెట్టేలా సమాలోచనలు జరుపుతున్నట్లు టీఆర్​ఎస్​ లీడర్లు చెప్తున్నారు. దుబ్బాక పోలింగ్ తర్వాతి రోజునుంచే గ్రేటర్ పై బీజేపీ ఫోకస్ పెట్టిందని, ఎన్నికలు ఆలస్యం చేస్తే  చాలా సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వారు అంటున్నారు. ‘‘దుబ్బాకలో ఓడినందుకు జీహెచ్​ఎంసీ ఎలక్షన్లు ఆలస్యం చేస్తారనే భయం టీఆర్​ఎస్​ కేడర్​లో ఉంది. అలాగైతే బీజేపీలోకి వలసలు కొనసాగే ప్రమాదం ఉంది. వెంటనే ఎలక్షన్లు పెడితే మంచిదన్న డిస్కషన్ ప్రగతిభవన్ లో నడుస్తున్నది’’ అని టీఆర్ఎస్​కు చెందిన సీనియర్ ఎమ్మెల్యే చెప్పారు. 30 డివిజన్లలో బీజేపీ ప్రభావం ఉన్నట్టు 15 రోజుల కింద నిఘా వర్గాలు ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చినట్టు తెలిసింది. దుబ్బాక రిజల్ట్ తర్వాత ఆ ప్రభావం మరిన్ని డివిజన్లకు విస్తరించొచ్చని టాక్​ వినిపిస్తోంది.

వలసల భయం

మొన్నటి వరకు ప్రతిపక్ష పార్టీలను బలహీన పరిచేందుకు ఆపరేషన్ ఆకర్ష్ ను అమలు చేసిన టీఆర్ఎస్​కు ఇప్పుడు వలసల భయం పట్టుకుంది.  గ్రేటర్ ఎన్నికలను ఆలస్యం చేస్తే ఓడిపోతున్నామనే అనుమానం తమ కేడర్​లో కలుగుతుందని, బీజేపీలోకి వలసలు పెరిగే ప్రమాదం ఉందని టీఆర్ఎస్ లీడర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీటిని అడ్డుకోవాలంటే ఎలక్షన్స్​ ముందుగా పెట్టడమే మంచిదని భావిస్తున్నారు.

వరద సాయం మరువక ముందే..

వరద సాయాన్ని ప్రజలు మరువక ముందే జీహెచ్​ఎంసీ ఎన్నికలు పెట్టాలని ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నట్టు తెలిసింది. గత నెల గ్రేటర్​లో  వరదలు ముంచెత్తడంతో అనేక కాలనీలు, బస్తీలు నీట మునిగి జనం తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ. 550 కోట్లు విడుదల చేసింది. ఒక్కో కుటుంబానికి రూ. 10 వేల చొప్పున 5.50 లక్షల మందికి నగదు సాయం చేయాలని నిర్ణయించింది. ఇప్పటికి 4.50 లక్షల మందికి ఆర్థిక సాయం చేసినట్లు టీఆర్​ఎస్​ లీడర్లు చెప్తున్నారు. లోకల్ కార్పొరేటర్​,  లీడర్ల పర్యవేక్షణలో సాయం పంపిణీ జరుగుతోంది. బాధితుల సంఖ్య పెరిగితే మరిన్ని నిధులు విడుదల చేసేందుకు సర్కారు సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. సర్కారు ఆర్థిక పరిస్థితి సరిగా లేని టైంలో అందించిన ఈ సాయాన్ని ఓట్లుగా మల్చుకోవాలని టీఆర్​ఎస్ నేతలు భావిస్తున్నట్లు చర్చ నడుస్తున్నది.

For More News..

సర్కారు నిర్ణయాలతో గందరగోళం.. మొట్టికాయలు వేసిన హైకోర్టు

హైదరాబాద్​కు ‘స్పుత్నిక్​ V’.. త్వరలో ట్రయల్స్