ఓట్ల కోసం సాగర్ ను మనీ,మందులో ముంచుతున్నారు

ఓట్ల కోసం సాగర్ ను మనీ,మందులో ముంచుతున్నారు

సాగర్ ను మనీ, మందులో ముంచుతూ ఓటర్లను టీఆర్ఎస్ మభ్యపెడుతోందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్  తరుణ్ చుగ్ ఆరోపించారు. నాగార్జునుడు నడిచిన నేలను అధికార పార్టీ అపవిత్రం చేస్తోందని, లెగ్, పెగ్ సంస్కృతిని తీసుకువస్తోందని మండిపడ్డారు. సాగర్ బై ఎలక్షన్ ప్రచారంలో కోడ్ను టీఆర్ఎస్ ఉల్లంఘిస్తోందని దుయ్యబట్టారు. ఆదివారం పార్టీ స్టేట్ ఆఫీసులో  తరుణ్ చుగ్  మీడియా చిట్ చాట్ లో మాట్లాడారు. డ్రగ్స్ కేసులో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని, ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి సమాధానం చెప్పుతుందో చూడాలన్నారు. సమస్యలను పరిష్కరించాలని ప్రజలు ఓట్లు వేస్తే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డ్రగ్స్ తీసుకుంటరా అని ఆయన ప్రశ్నించారు. టీఆర్ ఎస్ మిత్రపక్షం ఎంఐఎం కూడా రేవ్ పార్టీలు చేస్తోందని, రెండు పార్టీలు కలిసి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ పెట్టుకునే హక్కు ఎవరికైనా ఉందని,  వైఎస్ షర్మిలకు కూడా ఆ హక్కు ఉందని తరుణ్ చుగ్  చెప్పారు. 

తరుణ్ చుగ్ తో సంజయ్  భేటీ

తరుణ్ చుగ్ తో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ భేటీ అయి నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై చర్చించారు. అక్కడి పరిస్థితిని వివరించారు. అనంతరం తరుణ్ చుగ్ నాగార్జునసాగర్ నియోజకవర్గానికి వెళ్లారు. ఈ నెల 15 వరకు సాగర్ లోనే తరుణ్ చుగ్ ఉండి ప్రచారంలో పాల్గొననున్నారు. ప్రచారానికి మరో నాలుగు రోజులు మాత్రమే ఉండటంతో అనుసరించాల్సిన వ్యూహంపై  పార్టీ నేతలకు ఆయన దిశా నిర్దేశం చేయనున్నారు. 
  
పేదల పాలన రావాలంటే కేసీఆర్ గద్దె దిగాలి: బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ 

రాష్ట్రంలో పేదల పాలన రావాలంటే కేసీఆర్ ను గద్దె దించాల్సిందేనని  బీజేపీ స్టేట్చీఫ్ బండి సంజయ్ అన్నారు. బీసీలు అంటే బాయ్కాట్ అన్న విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుంటే బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు  కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహనీయులకు కనీస గౌరవం ఇవ్వడం లేదన్నారు. దళిత, బహుజనుల, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతులలైన డాక్టర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్, మహాత్మా జ్యోతిరావు పూలేను కేసీఆర్ పట్టించుకోవటం లేదని, వారి జయంతి, వర్ధంతులకు కూడా హాజరుకావటం లేదన్నారు. బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం పార్టీ స్టేట్ ఆఫీసులో పూలే జయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్, సంజయ్ పాల్గొన్నారు. పూలే చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. బీసీ మంత్రులు, నేతలు ప్రగతి భవన్ గేట్ కూడా దాట లేని పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వంలో ఉందని విమర్శించారు. బర్లు, గొర్ల  వరకే బలహీనవర్గాలను కేసీఆర్ పరిమితం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.