అధికారంలోకి రాగానే మాట మార్చిన కేసీఆర్

అధికారంలోకి రాగానే మాట మార్చిన కేసీఆర్

పెద్దపల్లి జిల్లా: మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో రాజీనామా చేసి చార్మినార్ లో పోటీ చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. జాతీయ జెండాను ఎగురవేయని పార్టీ గుర్తింపును ఎన్నికల కమిషన్ రద్దు చేయాలని కోరారు.  హిందూ వాహిని రామగుండం కార్పొరేషన్ శాఖ ఆధ్వర్యంలో ఎన్టీపీసీలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవంలో ఆయన  పాల్గొని మాట్లాడారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిందని రఘునందన్ రావు గుర్తు చేశారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం నవాబ్ హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ లో విలీనం చేశాడన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఉద్యమ సమయాల్లో సెప్టెంబర్ 17ను అధికారికంగా జరుపుకుంటామని చెప్పిన ఉద్యమ నాయకుడు కేసీఆర్.. అధికారంలోకి రాగానే మాట మార్చాడని ఆరోపించారు. కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ 8 ఏళ్లపాటు తెలంగాణ సమాజాన్ని వంచించిందని ఆయన పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నాడని రఘునందన్ రావు ఆరోపించారు. ఓడ దాటే దాకా ఓడ మల్లన్న,  ఓడ  దాటినాక బోడి మల్లన్న అన్న తీరుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ముస్లిం ఓట్ల కోసం, అసెంబ్లీ సీట్ల కోసం భయపడ్డ కేసీఆర్.. బీజేపీ ప్రకటన వల్లే జాతీయ జెండాను పట్టుకున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. హోం మంత్రి అమిత్ షా ప్రకటనతో ఖంగుతున్న కేసీఆర్.. సంవత్సరం ముందే తెలంగాణకు వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి రాగానే సెప్టెంబర్ 17ను అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో హిందూ వాహిని సంయోజకులు హరిశ్ఛంద్ర రెడ్డి, పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ మల్లికార్జున్, రామగుండం బీజేపీ నాయకులు కౌశిక్ హరి, అమరేందర్ రావు తదితరులు పాల్గొన్నారు.