ఓటేయలేదు.. పైసలిచ్చేయ్‌‌

ఓటేయలేదు.. పైసలిచ్చేయ్‌‌

తమ దగ్గర డబ్బులు తీసుకుని ఓటెందుకు వేయలేదంటూ శాయంపేట మండలం కొత్తగట్టుసింగారంలో టీఆర్‌‌ఎస్‌‌ నేత పొలెపెల్లి శ్రీనివాస్‌‌రెడ్డి తనపై దాడి చేశారని బత్తిని విమల అనే మహిళ ఆరోపించారు. అతనితో తనకు ప్రాణభయం ఉందని ఆమె పోలీసులకు కంప్లయింట్‌‌ చేశారు. వరంగల్​రూరల్ జిల్లా శాయంపేట మండలంలోని కొత్తగట్టుసింగారం, మాందారిపేట ఎంపీటీసి స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా సునీల్‌‌ పోటీ చేశాడు. అతని మేనత్త విమల కొత్తగట్టు సింగారంలో బీజేపీ తరఫున ప్రచారం చేశారు. ఇక్కడ నుంచి పోటీ చేసిన టీఆర్‌‌ఎస్‌‌ అభ్యర్థి తరఫున  పార్టీ నాయకుడు పొలెపెల్లి శ్రీనివాస్‌‌రెడ్డి ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. ఊళ్లో అందరికీ పంచినట్టే విమల డబ్బులు పంచారు. ఈ ఎన్నికలో టీఆర్‌‌ఎస్‌‌ అభ్యర్థే గెలిచినా ప్రత్యర్థులకు కూడా బాగా ఓట్లు రావడంతో శ్రీనివాసరెడ్డి కినుక వహించాడు.

ఎంపీటీసీ ఎన్నికలతోపాటు అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన  రూ. 5 వేలు వాపసివ్వాలని, లేకుంటే బంగారుగొలుసైనా ఇవ్వాలని బలవంతపెట్టినట్టు విమల తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పు తెచ్చయినా పైసలిస్తానని బతిమిలాడినట్టు, అక్కడున్న వారు సర్దిచెప్పడంతో అతడు వెళ్లిపోయాడని తెలిపారు. వృద్ధురాలి మీద దాడి చేసిన శ్రీనివాస్ రెడ్డి ని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్​ చేశారు.  తనదగ్గర డబ్బులు తీసుకుని వేరే వారికి ప్రచారం చేయడాన్ని ప్రశ్నించానే కానీ దాడి చేయలేదని,  బీజేపీ నాయకులు కావాలనే తనపై ఫిర్యాదు చేయిస్తున్నారని పొలెపెల్లి శ్రీనివాస్‌‌రెడ్డి చెప్పారు.