హుస్నాబాద్​లో టీఆర్​ఎస్​ లీడర్ల నయా దందా

హుస్నాబాద్​లో టీఆర్​ఎస్​ లీడర్ల నయా దందా

సిద్దిపేట, వెలుగు : రెండో విడత దళితబంధు మంజూరు కాకుండానే హుస్నాబాద్ నియోజకవర్గంలో లబ్దిదారుల ఎంపిక పేరిట వసూళ్ల దందాకు తెరలేపారు. కొందరు టీఆర్ ఎస్​ నేతలు దళితబంధు ఇప్పిస్తామంటూ పైరవీలు  చేస్తున్నారని, దీనివల్ల నిజమైన అన్ని అర్హతలు ఉన్న వారికి అన్యాయం జరుగుతోందని దళితులు మండిపడుతున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో 1,500 మందికి దళితబంధు మంజూరైందని,  గ్రామానికి పది మందిని  ఎంపిక చేస్తున్నట్టు ఇటీవల ప్రచారం మొదలైంది. దీంతో కొందరు టీఆర్​ఎస్​ లీడర్లు  గ్రామాల వారీగా పదిమంది చొప్పున లబ్దిదారులను సెలక్ట్​ చేసి లిస్టులు రెడీ చేస్తున్నామంటూ ఊళ్లలో తిరుగుతున్నారు. నియోజకవర్గానికి రెండో విడత  దళితబంధు మంజూరేకాలేదని ఆఫీసర్లు చెప్తుండగా.. టీఆర్​ఎస్​ లీడర్లు మాత్రం లిస్టులు తయారు చేయడం అనుమానాలకు తావిస్తోంది. ఒక్కో ఊళ్లో వందల్లో దళిత కుటుంబాలుంటే అధికార పార్టీ సర్పంచ్, స్థానిక ఎంపీటీసీ, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కలిసి తమకు నచ్చిన పది మంది పేర్లు రాసుకుంటున్నారని, దీనివల్ల అర్హులైన తమకు అన్యాయం జరుగుతోందని దళితులు వాపోతున్నారు. 

ఆందోళన బాట...

‘దళితబంధు వచ్చేలా చూస్తాం... మంజూరైన తరువాతే డబ్బు ఇవ్వాలంటూ’ కొందరు రూలింగ్​ పార్టీ లీడర్లు ముందస్తు ఒప్పందాలు చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  ఊరికి పదిమందికే యూనిట్లు వస్తాయని, ఎంతో కొంత ఇచ్చుకోకపోతే లిస్టులో పేరుండదని బెదిరిస్తున్నారు. కోహెడ, హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లో ఎక్కువగా ఇలాంటి ఒప్పందాలు జరుగుతున్నాయంటున్నారు. లబ్దిదారులను ఆఫీసర్లు ఎంపిక చేయాల్సిఉండగా.. టీఆర్ఎస్​ లీడర్లు లిస్టులు తయారు చేస్తుండడంపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  తమకెక్కడ అన్యాయం జరుగుతుందోనన్న భయంతో చాలా చోట్ల దళితులు ఆందోళన బాట పట్టారు.  కోహెడ మండలం గొట్ట మిట్ట లో దళితులు  రాస్తారోకో నిర్వహించగా, అక్కన్నపేట మండలం జనగామ గ్రామానికి చెందిన  దళితులు హుస్నాబాద్ లో ర్యాలీ నిర్వహించి ఆర్డీఓకు వినతిపత్రం ఇచ్చారు. దళితబంధు ఎంపిక అర్హులైన వారికి అన్యాయం జరుగుతోందని సైదాపూర్ మండలానికి చెందిన దళితులు ఇటీవల సిద్దిపేట కలెక్టర్ కు కంప్లైంట్​ చేశారు. 

అర్హులైన వారికే  బంధు ఇవ్వాలి

అర్హులైన పేదలకే దళిత బంధు ఇవ్వాలి. అధికారులే గ్రామాల్లో తిరిగి జాబితాలు రూపొందించాలి.  లబ్దిదారుల ఎంపిక లో రాజకీయ జోక్యం లేకుండా చూడాలి.  హుస్నాబాద్ నియోజకవర్గానికి రెండో విడతలో 1500 మందికి దళితబంధు యూనిట్లు మంజూరైందో లేదో అధికారులు క్లారిటీ ఇవ్వాలి. 
– వేల్పుల రాజు, బీఎస్పీ నేత, హుస్నాబాద్ 

ఎంపిక చేస్తున్నట్టు చెప్తే నమ్మొద్దు

దళిత బంధు కింద మరొకసారి జాబితాలు తయారు చేయాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. హుస్నాబాద్ నియోజకవర్గంలో కొందరు లిస్టులు తయారు చేస్తున్నారంటూ రాస్తారోకో, ఆందోళనలు చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. సైదాపూర్ మండలానికి చెందిన కొందరు కలెక్టర్ ను కలిశారు. రెండో విడత దళితబంధు ఇంకా మంజూరుకాలేదు, లబ్దిదారులను ఎంపిక చేస్తున్నట్టు ఎవరు చెప్పినా దళితులు నమ్మవద్దు. 
– రామాచారి, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్