
- టీఆర్ఎస్ సర్పంచుల నిర్వాకాలు
- ‘ క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్’ ట్యాగ్ కోసం అగచాట్లు
హైదరాబాద్, వెలుగు: క్లీన్ అండ్ గ్రీన్ గ్రామాల ఎంపిక కోసం కేంద్రం చేస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్–-2021 సర్వేలో తమ ఊరి పేరు చేరేలా చూసేందుకు టీఆర్ఎస్ సర్పంచులు నానా అగచాట్లు పడుతున్నట్టు సమాచారం. ఏకంగా సర్వే మెంబర్లను దావతులు తదితర రాచ మర్యాదలతో మానిప్యులేట్ చేయజూస్తున్నారని చెబుతున్నారు. కొందరు సర్వేయర్లు దావతులకు ఖుష్ అయి ఊళ్లలో తిరగకుండానే సర్పంచులకు కావాల్సినట్టుగా రిపోర్టులిచ్చిన్టటు ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో అధికార పార్టీ సర్పంచులు సర్వేయర్లను మర్యాదల్లో ముంచెత్తి తాము చెప్పినట్టు రాయించుకున్నట్టు తెలుస్తోంది. దాంతో సర్వేను కో ఆర్డినేట్ చేస్తున్న స్టేట్ లెవల్ బాడీ అలర్టయింది. ‘‘కేంద్రానికి ఈ తప్పుడు రిపోర్టులే పోతే స్వచ్చ భారత్ లక్ష్యమే దెబ్బ తింటుంది. అంతిమంగా మనమే అభాసుపాలవుతాం” అని సర్వేయర్లను హెచ్చరించిందని తెలిసింది. ఏ సర్వేయర్లు ఏ ఊరికి పోవాలనే లిస్టును కలెక్టర్ల ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ ప్రతినిధులు పకడ్బందీగా తయారు చేస్తున్నారు. సర్పంచులకు ముందుగా లీక్ కాకుండా చూసేందుకు ముందు రోజు రాత్రి దాకా లిస్టును సర్వేయర్లకు కూడా తెలియనివ్వడం లేదు. సర్వేయర్లు కూడా సర్పంచులు చెప్పిన ఏరియాల్లో కాకుండా ఇతర గల్లీలు తిరుగుతూ వాస్తవాలు రాబడుతున్నారు.
వీటిపై సర్వే..
గ్రామ పంచాయతీ ఆఫీసు, గవర్నమెంట్ స్కూళ్లు, అంగన్ వాడీ స్కూళ్లల్లో తాగునీరు, ఊర్లో టాయిలెట్లు, శానిటేషన్, రోడ్లు, డ్రైనేజీ మెయింటెనెన్స్ తదితరాలపై సర్వే జరుగుతోంది. ప్రతి ఇంటికి తాగునీరు, మరుగుదొడ్లున్నాయా, మహిళలు పీరియడ్స్అప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారా, బహిరంగ మల విసర్జనకు ఊళ్లో నూటికి నూరుశాతం దూరంగా ఉన్నారా, తడి, పొడి చెత్తను వేరు చేస్తున్నారా, గ్రామ పంచాయతీ డస్ట్ బిన్లు ఇచ్చిందా, ఊళ్లో డంపింగ్ యార్డుందా, ఓవరాల్‌గా ఊరి డెవలప్ మెంట్‌పై జనం ఏమనుకుంటున్నారనే అంశాల ఆధారంగా మార్కులు వేస్తున్నారు. జిల్లాకు 22 గ్రామాల చొప్పున సర్వే చేస్తున్నారు. ఒక్కో టీంలో ఒక్కరో ఇద్దరో మెంబర్లుంటారు. జనాభాను బట్టి ప్రతి వంద ఇండ్లకు మూడు నుంచి 10 ఇండ్లను శాంపిల్‌గా తీసుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ప్రతి వందకు రెండిళ్లలో సర్వే చేస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి, జనగామ, యాదాద్రి భువనగిరి, ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్తదితర జిల్లాల్లో సర్వే పూర్తయింది. రెండ్రోజుల్లో అన్ని జిల్లాల్లో పూర్తవుతుందని కోఆర్డినేటర్లు చెబుతున్నారు.
పారదర్శకత కోసమే...
కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ భారత్ లక్ష్యం నెరవేరాలంటే సర్వే పారదర్శకంగా జరగాలి. అందుకే మీడియాకు కూడా సమాచారం లేకుండా చేస్తున్నాం. సర్వేయర్లు ఎలాంటి ప్రలోభాలకూ లొంగడం లేదు. రిపోర్టును ఏ రోజుకు ఆ రోజు ఫొటోలతో సహా స్వచ్ఛభారత్ యాప్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. సర్వేయర్లను ఎవరూ మానిప్యులేట్ చేసే చాన్సే లేదు.
- స్వచ్ఛ భారత్ మిషన్ జిల్లా కో ఆర్డినేటర్లు