జగన్ గజదొంగ: ఏపీ అక్రమ ప్రాజెక్టులపై టీఆర్ఎస్ నేతల ఫైర్

జగన్ గజదొంగ: ఏపీ అక్రమ ప్రాజెక్టులపై టీఆర్ఎస్ నేతల ఫైర్
  • ఆంధ్రోడు ఎవరైనా సరే మనకు వ్యతిరేకమే..
  • దొంగతనంగా ప్రాజెక్టులు కడుతున్నారన్న మంత్రి వేముల
  • సీఎం డైరెక్షన్​తో రంగంలోకి మంత్రులు.. ఉన్నట్టుండి తెరపైకి కృష్ణా నీళ్ల దోపిడీ
  • ఏపీ ప్రాజెక్టులపై ఇన్నాళ్లు సైలెంట్​గా ఉండి ఇప్పుడు ఆంధ్రా పేరుతో సెంటిమెంట్​
  • రాయలసీమ, ఆర్డీఎస్ కుడి కాల్వ వెంటనే ఆపేయాలంటూ డిమాండ్లు

మహబూబ్ నగర్ , వెలుగు:  కృష్ణానదిపై ఏపీ కడుతున్న అక్రమ ప్రాజెక్టులను పట్టించుకోకుండా ఇంతకాలం అక్కడి సీఎం జగన్​తో చెట్టపట్టాలేసుకున్నట్లు మెదిలిన తెలంగాణ ప్రభుత్వం సడెన్​గా ప్లేట్ మార్చింది. ఇప్పుడే కృష్ణా నీళ్లు గుర్తుకు వచ్చాయో లేదంటే ఇటీవలి కేబినెట్ మీటింగ్​లో సీఎం కేసీఆర్ కామెంట్ల ఎఫెక్టో గానీ ఒక్కొక్కరుగా మినిస్టర్లు నోరు విప్పుతున్నారు. సోమవారం టీఆర్​ఎస్​ఎల్పీలో మంత్రి శ్రీనివాస్​గౌడ్ ప్రెస్​మీట్ పెట్టి మరీ ఏపీ నీళ్ల దోపిడీ చేస్తోందని మండిపడ్డారు. 

పొరుగు రాష్ట్రాలతో స్నేహంగా ఉండాలని సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఆలోచిస్తుంటే ఏపీ సీఎం మాట తప్పారని విమర్శించారు. ఏపీ కడుతున్న ప్రాజెక్టులతో పాలమూరు లిఫ్ట్ ప్రశ్నార్థకంగా మారుతుందని, దక్షిణ తెలంగాణకు నీళ్లు రావని ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా మంగళవారం మంత్రి ప్రశాంత్​రెడ్డి కృష్ణా ప్రాజెక్టుల విషయంలో ఏపీ సీఎం జగన్​ను టార్గెట్​చేస్తూ మాట్లాడారు.
లంకలో ఉన్నోళ్లందరూ రాక్షసులే..
మహబూబ్​నగర్ జిల్లా దివిటిపల్లి గ్రామంలో డబుల్​బెడ్​రూం ఇండ్లను ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్​గౌడ్​తో కలిసి రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ శాఖమంత్రి ప్రశాంత్​రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీ చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులపై ప్రశాంత్​రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘పోతిరెడ్డిపాడు ద్వారా ఆరోజు కృష్ణానీటిని తీసుకుపోయి వైఎస్ నీళ్లదొంగ అయిండు.. కొడుకు మారిండేమోనని అనుకున్నం.. కానీ తెలిసిపోయింది.. లంకలో ఉన్నోళ్లోందరు రాక్షసులే.. ఆంధ్రోడు ఆంధ్రోడే.. తెలంగాణోడు తెలంగాణొడే.. ఎవరైనా సరే ఆంధ్రోడు మనకు వ్యతిరేకమే.. ఆరోజు ఆయన పోతిరెడ్డిపాడును కట్టి నీటిని దొంగలిస్తే... ఈయన రాయలసీమ(సంగమేశ్వరం) ఎత్తిపోతల పథకం, ఆర్డీఎస్ కెనాల్​రెండు కట్టి గజదొంగ అయిండు’ అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. నాటి నీటి దొంగ వైఎస్ రాజశేఖర్​రెడ్డి, నేటి గజదొంగ వైఎస్ జగన్ చర్యల్ని మనం ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వెంటనే రాయలసీమ ప్రాజెక్టును, ఆర్డీఎస్ రైట్ కెనాల్ పనులను ఏపీ సీఎం జగన్ ఆపాలని, లేదంటే యుద్ధం చేయడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నీళ్ల వాటా విషయంలోనే ఉమ్మడి రాష్ట్రంలో టీఆర్ఎస్ మంత్రులు రాజీనామా చేస్తే ఇదే జిల్లాకు కాంగ్రెస్ మంత్రి ఆంధ్రోళ్లకు హారతులు పట్టారని ప్రశాంత్​రెడ్డి విమర్శించారు. ‘కేసీఆర్​ కఠిన మైన నిర్ణయాలు తీసుకోబోతుండు.. వాళ్ల రాయలసీమ ప్రాజెక్టుకు గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతిలేదు.. కట్టవద్దని గ్రీన్​ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది.. నేను కడ్తలేనని సీఎం జగన్ లెటర్ కూడా ఇచ్చిండు.. కానీ ఇప్పుడు దొంగతనంగా కడ్తున్నడు. అక్కడ పనులు జరుగుతున్న ఫొటోలన్నీ కేసీఆర్‌‌‌‌‌‌‌‌ తెప్పించిండు అనుమతి లేకుండా కట్టిన రాయలసీమ ప్రాజెక్టును, ఆర్డీఎస్ రైట్​కెనాల్​ను ఆపాలని గ్రీన్​ట్రిబ్యునల్​ను, ప్రధానమంత్రి మోడీని అడగబోతున్నడు..ఇంతజేసినా పనులు ఆపకపోతే మనం ప్రజాయుద్ధానికి రెడీ కావాలె.. పోరుబాట పట్టాలె.. ఆ ఉద్యమానికి మహబూబ్​నగర్ జిల్లాలో మంత్రులు శ్రీనివాస్​గౌడ్, నిరంజన్​రెడ్డి నాయకత్వం వహించే సందర్భం తొందర్లో వస్తది’ అని ప్రశాంత్​రెడ్డి చెప్పారు.  
ఏపీ ఎత్తులను చిత్తు చేస్తం..
కేసీఆర్ మంచి వారికి మంచి వాడని, చెడు చేస్తే.. అంతు చూస్తడని శ్రీనివాస్​గౌడ్​ కామెంట్ చేశారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లాలు కలిసికట్టుగా ఆంధ్ర ఎత్తులను చిత్తు చేస్తామన్నారు. రాయలసీమ ప్రాజెక్టులను అడ్డుకుంటామని పేర్కొన్నారు. త్వరలోనే మంత్రి కేటీఆర్‌తో ఐటీ పార్కు ప్రారంభిస్తామని..- వెయ్యి కోట్లతో అగ్రిమెంట్ చేసుకుంటున్నామని చెప్పారు. కేంద్రం నుంచి నిధులు బాజాప్తా తెచ్చుకొని రాష్ట్రాభివృద్ధికి ఖర్చుచేస్తామన్నారు. పాలమూరు-–రంగారెడ్డిని త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు.