తహసీల్దార్​ ఆఫీస్​ ఎదుట బైఠాయించిన టీఆర్ఎస్ ​లీడర్లు

తహసీల్దార్​ ఆఫీస్​ ఎదుట బైఠాయించిన టీఆర్ఎస్ ​లీడర్లు

రామచంద్రాపురం/అమీన్​పూర్, వెలుగు: ప్రభుత్వ భూమిలో చేపట్టిన నిర్మాణాలను తహసీల్దార్​కూల్చివేయించడంతో  టీఆర్ఎస్​లీడర్లు ధర్నాకు దిగారు. మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్​630,  శ్రీరాంనగర్ కాలనీలో ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేస్తున్నారంటూ తహసీల్దార్​విజయ్​ఆదేశాల మేరకు రెండు రోజుల క్రితం అధికారులు కూల్చివేశారు. దీనిపై అధికార పార్టీకి చెందిన మున్సిపల్​చైర్మన్​పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్​నర్సింహా గౌడ్,​ ఇతర టీఆర్ఎస్ కౌన్సిలర్లు తహసీల్దార్​ఆఫీసు ఎదుట మంగళవారం నిరసనకు దిగారు.

ఆ నిర్మాణాల క్రమబద్ధీకరణకు నిర్మాణదారులు 58, 59 జీఓ కింద అప్లై చేసుకున్నారని, అయినా కావాలనే అధికారులు కూల్చివేశారని చైర్మన్ ​ఆరోపించారు. అందుకే బాధితులకు అండగా నిరసనకు దిగినట్లు చెప్పారు. సర్వే నంబర్​ 630 అనేది ప్రభుత్వ భూమని, గతంలో చాలామంది అక్కడ ఇళ్లు నిర్మించుకోగా ప్రభుత్వం క్రమబద్ధీకరించిందని తహసీల్దార్​ చెప్పారు. అయితే ఇటీవలి కాలంలో కొందరు ఇష్టానుసారం ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేస్తుండగా అడ్డుకున్నామని చెప్పారు. పాత నిర్మాణాలను తాము కూల్చలేదని,  కొత్తగా నిర్మిస్తున్న వాటిపైనే చర్యలు తీసుకున్నామన్నారు.