
ఏటూరునాగారం, వెలుగు: టీఆర్ఎస్ లీడర్లు మహిళలను తిట్టడంతో వారిపై తిరగబడ్డారు. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలో ఆదివారం టీఆర్ఎస్ గ్రామ కమిటీ ఎన్నిక చేపట్టారు. పాత అధ్యక్షుడు ఈదునూరి రవీందర్ కే తిరిగి అధ్యక్ష పదవి వచ్చేలా సపోర్ట్ చేయాలని ఆయన అనుచరుడు, బిల్ట్ కార్మిక సంఘం నాయకుడు ఖుర్బాన్ అలీ శనివారం ఒడిశా కాలనీకి చెందిన ఒక్కొక్కరికి సుమారు రూ. 1000 వరకు పంచిపెట్టాడు. ఆదివారం గ్రామ కమిటీ ఎన్నిక కార్యక్రమానికి హాజరైన ఒడిశా కాలనీకి చెందిన కొందరు మహిళలు ఈదునూరి రవీందర్‌కు కాకుండా పాత గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు తుక్కాని శ్రీనివాస్‌కు సపోర్ట్ చేశారు. ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన ఖుర్బాన్అలీ తమ డబ్బులు తీసుకుని వాడికి సపోర్ట్ చేస్తున్నారంటూ మహిళలను ఇష్టం వచ్చినట్లు తిట్టాడు. దీంతో మహిళలు అతడిని కొట్టబోయారు. ఈదునూరి శ్రీనివాస్ చేతులు జోడించి తప్పయిందని, క్షమించాలని వేడుకోవడంతో మహిళలు శాంతించారు. ఈ గొడవతో ఎన్నికను వాయిదా వేశారు.