లబ్ధిదారుల నుంచి కమీషన్లు గుంజుతున్న టీఆర్ఎస్​ లీడర్లు

లబ్ధిదారుల నుంచి కమీషన్లు గుంజుతున్న టీఆర్ఎస్​ లీడర్లు
  • లిస్టులో పేరు రావాలంటే రూ.3 లక్షల దాకా ముట్టజెప్పాలె!
  • యూనిట్​ శాంక్షన్ అయ్యాక చెల్లించేలా బాండ్ పేపర్లు
  • పోటీ ఎక్కువ ఉన్న చోట సీక్రెట్​గా వేలం పాట

ఖమ్మం/ నెట్​వర్క్, వెలుగు: దళిత బంధు స్కీం అధికార పార్టీ నేతలకు కాసులు కురిపిస్తోంది. ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేయాలని హైకోర్టు సూచించినా, క్షేత్ర స్థాయిలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఇష్టారాజ్యంగా మారింది. ఈసారి నియోజకవర్గానికి 500 మందికే దళిత బంధు ఇస్తుండడంతో గ్రామానికి రెండు మించి రావడం లేదు. ఇదే అదనుగా స్థానిక ప్రజాప్రతినిధులు కమీషన్ల దందా మొదలుపెట్టారు. ఒక్కో యూనిట్​కు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల దాకా కమీషన్ ఫిక్స్ చేసి, శాంక్షన్ అయ్యాక చెల్లించేలా బాండ్ పేపర్లపై అగ్రిమెంట్లు రాసుకుంటున్నారు. పోటీ ఎక్కువ ఉన్నచోట ఏకంగా వేలం పాటలు నిర్వహిస్తున్నారు. మొత్తంమీద రాజకీయ పలుకుబడి, కమీషన్లు ఇవ్వగలిగే వాళ్లు దళిత బంధు లబ్ధిదారుల లిస్టుల్లో చేరిపోతుండగా, డబ్బులు ఇచ్చుకోలేని పేద దళితులు న్యాయం కోసం రోడ్డెక్కుతున్నారు.

ఈ ఏడాది నియోజకవర్గానికి 1500 మంది చొప్పున 1.77 లక్షల మందికి దళిత బంధు ఇస్తామని చెప్పిన రాష్ట్ర సర్కారు మాట తప్పింది. ఫండ్స్ లేక మొదటి విడతలో 500 మందికి ఇవ్వాలని నిర్ణయించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక కొన సాగుతోంది. నియోజకవర్గానికి 500 చొప్పున ఇస్తే ఒక్కో మండలానికి సగటున 80 నుంచి 100 యూనిట్లు వస్తున్నాయి. దీంతో ఎమ్మెల్యేలు ఎంపిక బాధ్యతలను స్థానిక టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు అప్పగిస్తున్నారు.

అర్రాస్​ పాటలు.. 

ఖమ్మం జిల్లాలో దళిత బంధు యూనిట్లు అమ్ముకునేందుకు ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే  గ్రీన్ సిగ్నల్ ఇ చ్చేశారు. మొదటి విడత 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా, వారి నుంచి స్వయంగా ఎమ్మెల్యేనే పైసలు తీసుకొని జాబితాలో పేర్లు ఫైనల్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. వచ్చే ఏడాది ఎన్నికలు ఉండడంతో ఈసారి వసూలు చేసుకునే చాన్స్​సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలకు అప్పగించారు. దీంతో లీడర్లు దళిత బంధు యూనిట్లకు రేట్లు డిసైడ్​ చేసి అమ్ముకుంటున్నారు. 

బాండ్ పేపర్లూ రాయించుకుంటున్నరు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దళిత బంధు కోసం టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు రూ.2లక్షల కమీషన్​ ఫిక్స్​ చేశారు. స్కీం మంజూరు కాగానే పైసలు ఇచ్చేలా అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. ఈ మేరకు బాండ్ పేపర్​ రాసిచ్చినవారి పేర్లనే ఎమ్మెల్యేకు పంపుతున్నారు. వైరా నియోజకవర్గంలోని జూలూరుపాడు మండలం, భద్రాచలం నియోజకవర్గంలో రూ.2లక్షల వరకు, ఇల్లెందు నియోజకవర్గంలో రూ.3 లక్షల వరకు, కొత్తగూడెం నియోజకవర్గంలో రూ.5లక్షల దాకా అగ్రిమెంట్లు చేసుకుంటున్నట్లు తెలిసింది.

పైసలియ్యకుంటే లిస్టుల్లోంచి ఔట్

కమీషన్ ఇచ్చిన వారినే దళితబంధు స్కీంకు ఎంపిక చేశారని హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పెరుమాండ్లగూడెం దళితులు ఆరోపిస్తున్నారు. ఇటీ వల గ్రామానికి చెందిన పది మందిని దళిత బంధు స్కీంకు ఎంపిక చేశారు. వీరిలో 8మంది గ్రా మంలో ఎమ్మెల్యే అనుచరులకు లక్ష రూపాయల చొప్పున చెల్లించారు. ఓ ఇద్దరు డబ్బు ఇచ్చేందుకు నిరాకరించడంతో వారి పేర్లను లిస్టు నుంచి తొలగించారు. విషయం తెలిసి బాధితులతో పాటు మరికొందరు దళితులు 20న జీపీ ఎదుట ఆందోళనకు దిగారు. 

సీఎం సొంత జిల్లాలోనూ ఇదే సీన్​..

సిద్దిపేటలోనూ కమీషన్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఊరికి పది మందికే దళిత బంధు వస్తుందంటూ కోహెడ, హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లో ముందస్తు అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. దీన్ని నిరసిస్తూ కోహెడ మండలం గొర్లమిట్ట, అక్కన్నపేట మండలం జనగామ, సైదా పూర్​కు చెందిన దళితులు ఆందోళన చేశారు. కలెక్టర్​ను కలిసినా ఫలితం లేకుండా పోయింది. 

ఆఫీసర్లూ వదుల్తలేరు..

ఆఫీసర్లు, స్టాఫ్​ కూడా అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కరీంనగర్​ జిల్లాలో దళితబంధు సాంక్షన్ కోసం టీఆర్ఎస్​ లీడర్లు రూ.50వేలు మొదలుకొని లక్ష దాకా వసూలు చేస్తుండగా, ఎస్సీ కార్పొరేషన్ ఆఫీసర్లు, ముస్సిపల్​ సిబ్బంది కూడా మరో లక్ష వరకు వసూలు చేస్తున్నారని దళితులు ఆరోపిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద అమలవుతున్న హుజూరాబాద్ నియోజకవర్గంలోనూ వసూళ్ల దందా కొనసాగుతుండడం గమనార్హం.

ఖమ్మం జిల్లా ఉసిరికాయలపల్లి పంచాయతీ పరిధిలోని నడిమూరులో పది ఎస్సీ కుటుంబాలున్నాయి. ఈ పల్లెకు ఈ విడత ఒకే దళిత బంధు యూనిట్​ వస్తుందని, ఎవరు రూ.3లక్షలు ఇస్తే వారినే ఎంపిక చేస్తామని స్థానిక ప్రజాప్రతినిధి ఆఫర్ ఇచ్చాడు. దీంతో ఊరిలో కాస్త ఆర్థిక స్థోమత ఉన్న ఇద్దరు ఎస్సీలు దళితబంధు యూనిట్ కోసం పోటీపడ్డారు. వీరిద్దరికి సీక్రెట్​గా అర్రాస్​ పెట్టారు. ఇద్దరిలో ఒకరు రూ.3.30 లక్షలకు పాడుకున్నారు.

ఖమ్మం జిల్లాకే చెందిన తోమందుల రాజు (పేరు మార్చాం) తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశాడు. తండ్రి చనిపోయాడు, తల్లి వృద్ధాప్య పింఛన్​పై ఆధారపడి బతుకుతోంది. ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. ఆర్థికంగా దీనస్థితిలో ఉన్నందున కమీషన్ ఇవ్వలేనని, యూనిట్ వచ్చేలా చూడాలని ఇటీవల స్థానిక ప్రజాప్రతినిధిని కలిశాడు. అయినప్పటికీ జాబితా నుంచి తప్పించినట్లు తెలిసింది. దీంతో ఉద్యమకారుడిని అని కూడా చూడలేదని రాజు తన స్నేహితుల వద్ద కన్నీళ్లు పెట్టుకున్నాడు.

దళారుల జోక్యం వద్దు

కాల్వ శ్రీరాంపూర్, వెలుగు: లోకల్​లీడర్లు కమీ షన్లు తీసుకుంటూ దళితబంధుకు ఎంపిక చేస్తున్నారని, దీంతో పేదలు నష్టపోతున్నారని పెద్ద పల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి దళితులు ఆరోపించారు. దళితబంధులో దళా రుల జోక్యాన్ని నిరసిస్తూ మండల కేంద్రంలో మంగళవారం ఆందోళనకు దిగారు. దళితులు మాట్లాడుతూ ఇప్పటికే ఆస్తి పాస్తులున్నవారికి, అర్హత లేకున్నా రాజకీయ పలుకుబడి, కమీషన్లు ఇస్తున్నవాళ్లకే దళిత బంధు ఇస్తున్నారని ఆరోపించారు. గ్రామ సభలు ఏర్పాటు చేసి అందరి సమక్షంలో అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిమాండ్​ చేశారు. తర్వాత మండల అధికారులకు వినతిపత్రం అందజేశారు.

రూ.3 లక్షల దాకా తీసుకుంటున్నరు

దళారులు రూ.3 లక్షల దాకా తీసుకొని ఆర్థికంగా, రాజకీయ అండ ఉన్నవాళ్లకే దళితబంధు ఇప్పిస్తున్నారు. ఏ ఆధారం లేని నిరుపేద దళితులను ఎవరూ పట్టించుకోవడం లేదు. అడిగిన ప్రతిసారీ తర్వాత విడతలో ఎంపిక చేస్తామని చెప్తున్నారు. నిలదీస్తే తర్వాత ఇస్తారో, ఇవ్వరో అనే భయంతో చాలా మంది ముందుకు రావడం లేదు. ఇప్పటికైనా గ్రామ సభ ఏర్పాటు చేసి, నిరుపేదలకు ముందుగా దళితబంధు ఇచ్చేలా సర్కారు చర్యలు తీసుకోవాలి. అప్పుడే దళారులకు అడ్డుకట్ట పడ్తుంది. 

- అసంపల్లి రమేశ్, పెగడపల్లి, పెద్దపల్లి జిల్లా