ఎన్టీఆర్కు టీఆర్ఎస్ మంత్రులు, నేతల నివాళి

ఎన్టీఆర్కు టీఆర్ఎస్ మంత్రులు, నేతల నివాళి
  • జయంతి సందర్భంగా  ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి నివాళులర్పించిన మంత్రులు, టీఆర్ఎస్ నేతలు

హైదరాబాద్: ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలన్నారు టీఆర్ఎస్ నేతలు. ఎన్టీఆర్ ఘాట్ దగ్గర శత జయంతి ఉత్సవాల్లో పాల్గొని నివాళులర్పించారు. పేదల కష్టాలు తెలుసుకున్న నాయకుడు ఎన్టీఆర్ అని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. భూస్వాముల పెత్తనాన్ని పక్కన పెట్టిన మహానాయకుడని వారు పేర్కొన్నారు. ఎన్టీఆర్ సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనే గొప్ప చరిత్ర సృష్టించారని ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచిన ధీశాలి అని.. ప్రధాని అయ్యే అవకాశం కొద్దిలో తప్పిపోయిందన్నారు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతలందరూ ఎన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకున్నామని.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్టీఆర్ ను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడుస్తున్నారని తెలిపారు. తెలుగువారందరూ గర్వించదగ్గ నాయకుడైన ఎన్టీఆర్ ను స్మరించుకుని ఆయన ఆశీర్వాదం తీసుకునేందుకే వచ్చామన్నారు. జై కేసీఆర్.. జై తెలంగాణ.. జై ఎన్టీఆర్ అని నినదించారు మంత్రి మల్లారెడ్డి. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలనే డిమాండ్ కు టీఆర్ఎస్ పార్టీ మద్దతిస్తుందని.. తమ ఎంపీలు పార్లమెంటులో పోరాడతారని మంత్రి మల్లారెడ్డి ప్రకటించారు. 
ఎంపీ నామానాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ ఒక చరిత్ర.. యుగ పురుషుడని.. తెలుగు జాతి ఉన్నంత కాలం ఎన్టీఆర్ పేరు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతుందన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా విప్లవాత్మక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని నామా నాగేశ్వరరావు కొనియాడారు. ప్రతి ఒక్కరికీ కడుపు నిండా తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట.. ఉండడానికి ఇల్లు.. అని ఆలోచన చేసిన మహానాయకుడని..  అలాంటి గొప్ప నాయకుడిని వందో జన్మదినం సందర్భంగా స్మరించుకుంటున్నామని తెలిపారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో సీఎం కేసీఆర్  రైతులు, బడుగు, బలహీనులకు అండగా ఉండాలని ముందుకు సాగుతున్నామని చెప్పారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఎన్టీఆర్ తోపాటు.. పీవీ నరసింహారావుకు భారత రత్న ఇవ్వాలని కోరతామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులుతోపాటు ఇతర టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ఇవి కూడా చదవండి

నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహానికి బాలకృష్ణ నివాళులు

విశ్వవిఖ్యాతకు జూనియర్ ఎన్టీఆర్ నివాళులు

ఎన్టీఆర్ ఒక ప్రభంజనం..ఒక సంచలనం