త్వరలోనే సీఎంగా కేటీఆర్​.. మంత్రులు, లీడర్ల ప్రచారం

త్వరలోనే సీఎంగా కేటీఆర్​.. మంత్రులు, లీడర్ల ప్రచారం
  • మున్సిపోల్స్ ముందు బయటకు తీసిన టీఆర్​ఎస్​
  • లోక్​సభ ఎలక్షన్లప్పుడూ ఇదే ప్రచారం
  • తర్వాత పంచాయతీ, జెడ్పీ ఎన్నికల ముందూ ఇదే ముచ్చట
  • పనిగట్టుకుని చెప్తున్న మంత్రులు, లీడర్లు
  • పదేళ్లు నేనే అని కేసీఆర్​ చెప్పినా అదే పాట
  • కేటీఆర్​ సీఎం అయితడన్న ఎర్రబెల్లి, శ్రీనివాస్​గౌడ్, మాలోతు కవిత

హైదరాబాద్​, వెలుగు:

టీఆర్ఎస్  వర్కింగ్​ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్​ త్వరలో సీఎంగా బాధ్యతలు చేపడతారనే ప్రచారం జోరందుకుంది. మున్సిపల్​ ఎలక్షన్లయ్యాక కేటీఆర్​కు పట్టాభిషేకం జరుగుతుందనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. పది రోజులుగా సొంత పార్టీ శ్రేణులే ఈ క్యాంపెయిన్​ చేస్తుండటం ఆసక్తి రేపుతోంది. స్వయంగా మంత్రులు, పార్టీ ముఖ్యులు సీఎం కేసీఆర్​ తర్వాత కాబోయే తెలంగాణ సీఎం కేటీఆరేనంటూ జపం చేస్తుండటం కొత్త పరిణామం. నిజానికి కేటీఆర్​ సీఎం అవుతారనే ప్రచారం కొత్తదేమీ కాదు. లోక్​సభ ఎన్నికల సమయంలో కూడా టీఆర్ఎస్​ ఇదే కార్డు వేసింది. ‘సారు.. కారు.. పదహారు’ అనే నినాదంతో జనంలోకి వెళ్లింది. కేసీఆర్​ కేంద్రంలో చక్రం తిప్పుతారని, రాష్ట్రంలో కేటీఆర్​ పగ్గాలు చేపడతారని ప్రచారం చేసింది. కానీ తక్కువ ఎంపీ సీట్లొచ్చి ఎదురుదెబ్బ తగలడంతో ఆ ముచ్చట సైలెంట్​ అయింది. తర్వాత పంచాయతీ, జెడ్పీ ఎలక్షన్లలో కేటీఆర్​ సీఎం అంశాన్ని తెరపైకి తెచ్చారు. పార్టీ వ్యవహారాలన్నీ ఆయన చుట్టే కేంద్రీకృతమయ్యేలా చేశారు. తాజాగా మున్సిపోల్స్​ రావటంతో ప్రచార వ్యూహంలో భాగంగానే మళ్లీ టీఆర్ఎస్  సీఎం కార్డు ప్రయోగించింది.

కేసీఆర్‍ తర్వాత కేటీఆరే సీఎం అవుతారని తాజాగా పంచాయతీరాజ్‍ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు వ్యాఖ్యలు చేశారు. జనమంతా కేసీఆర్‍ తర్వాత కేటీఆర్‍ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని అన్నారు. గురువారం వరంగల్‍ రూరల్‍ జిల్లా దమ్మన్నపేటలో రెండో విడత పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎర్రబెల్లి.. మీడియా అడిగిన ప్రశ్నలకు ఈ జవాబిచ్చారు. ‘‘కాంగ్రెస్‍ పార్టీలో నెహ్రూ తర్వాత ఆయన బిడ్డ ఇందిరాగాంధీ. తర్వాత ఆమె కొడుకు.. మళ్లా కొడుకు కొడుకైండు. వాళ్లు స్వాతంత్ర్యం తెచ్చి వరుసగా పదవులు నిలబెట్టుకున్నరు. ఇయ్యల తెలంగాణ తెచ్చుకున్నం. ఇక్కడ కూడా కేసీఆర్‍ తర్వాత కేటీఆరే ఆయనలా అయితరు. తప్పేముంది? ఎప్పడనేది కేసీఆర్‍ నిర్ణయిస్తరు. కేటీఆర్‍ అన్ని తీర్ల సమర్థుడు.. పార్టీని నడిపిస్తున్నడు. కేటీఆర్​ నాయకత్వంలోనే అన్ని ఎన్నికలు గెలుచుకున్నం. మున్సిపల్​ ఎన్నికలు గెలుస్తం. కేటీఆర్‍ సమర్థమైన నాయకుడు. చంద్రబాబు కొడుకు లోకేశ్​లా, కాంగ్రెస్‍లో రాహుల్‍గాంధీలా అసమర్థుడు కాదు. సీఎం కేసీఆర్‍కు ఎంత సమర్థత ఉందో .. కేటీఆర్‍కు అంతే సమర్థత ఉంది..’’ అని పేర్కొన్నారు.

మంత్రుల మాటల ఆంతర్యమేంటి?

రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్​ తర్వాత కేటీఆర్​నే సీఎంగా చూడాలనుకుంటున్నారని, ఆయనే కాబోయే సీఎం అని మంత్రి శ్రీనివాస్​గౌడ్  ఇటీవలే తెలంగాణ భవన్​లో బహిరంగంగా మాట్లాడారు. ఇప్పుడు మంత్రి ఎర్రబెల్లి కూడా అదే సిగ్నల్​ ఇవ్వటం గమనార్హం. ఒకరోజు ముందే మహబూబాబాద్​ ఎంపీ మాలోతు కవిత కూడా తర్వాత కేటీఆరే సీఎం అవుతరని హరితహారం కార్యక్రమంలోనే మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్​ కనుసైగ లేకుండా మంత్రులు, టీఆర్ఎస్  నేతలు మాట్లాడే పరిస్థితి లేదని, ఈ టైమ్​లో కీలకమైన ఇద్దరు మంత్రులు చేసిన కామెంట్ల వెనుక సీక్రెట్​ ఏమిటని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేమని.. ఇప్పుడే తన తనయుడిని సీఎంగా చూడాలని కేసీఆర్ కోరుకుంటున్నట్టు కొందరు చెప్తున్నారు. సీఎం కాదన్నా.. కేటీఆర్​ ఖండిస్తున్నా పట్టించుకోకుండా పార్టీ ముఖ్యులు ప్రచారం చేయటం వెనుక బలమైన సంకేతాలే ఉంటాయని అంటున్నారు.

మంచి రోజులు.. యాగ ముహూర్తం

సెకండ్​ టర్మ్  సీఎంగా కేసీఆర్​, వర్కింగ్​ ప్రెసిడెంట్​గా కేటీఆర్​ ఏడాది పూర్తి చేసుకున్నరు. యాగాలు, ముహూర్త బలానికి అనుగుణంగా త్వరలోనే కేసీఆర్​ వారసుడికి బాధ్యతలు అప్పగిస్తారని కేడర్​లో చర్చ జరుగుతోంది. జనవరి చివరివారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో యాదాద్రిలో మరో భారీ యాగం చేపట్టేందుకు సీఎం సిద్ధమవుతున్నారు. ఈ ఏర్పాట్లలో భాగంగానే హడావుడిగా ఎర్రవెల్లి ఫామ్​ హౌస్‌​ నుంచి యాదాద్రికి డైరెక్ట్ రోడ్డు​ వేయిస్తున్నారు. 45 రోజుల్లోనే రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది. యాగం తర్వాత అదే నెలలో మంచి ముహూర్తాలు ఉన్నాయని, అప్పుడే కేటీఆర్​కు పట్టాభిషేకం జరగొచ్చని అంటున్నారు.

పదేళ్ల దాకా లేదన్న కేసీఆర్

స్వయంగా తండ్రీకొడుకులిద్దరూ కేటీఆర్  పట్టాభిషేకం ప్రచారాన్ని పలుమార్లు తోసిపుచ్చారు. ఇప్పట్లో కేటీఆర్​కు సీఎం పదవి ఇచ్చేది లేదని, సెప్టెంబర్​ 15న కేసీఆర్​ అసెంబ్లీలోనే చెప్పారు. ‘‘కేసీఆర్​ ఆరోగ్యం ఖతమైంది. అమెరికా పోతడట.. కేసీఆర్​ దిగిపోయి కేటీఆర్​ను సీఎం చేస్తడట అని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నరు. నాకేమైందని దిగిపోత. నా ఆరోగ్యం బేషుగ్గా ఉంది. దుక్కలాగున్నా. ఇప్పుడు నాకు 66 ఏండ్లు. ఇంకో పదేండ్లు నేనే ఉంట..’ అని తేల్చి చెప్పారు. తాజాగా న్యూ ఇయర్​ సందర్భంగా మీడియాతో చిట్​చాట్ చేసిన కేటీఆర్.. తాను సీఎం అవుతానన్న ప్రచారాన్ని తోసిపుచ్చారు. పదేళ్లు సీఎంగా ఉంటానని కేసీఆర్ చెప్పాక కూడా మళ్లీ ఊహగానాలు, చర్చ ఎందుకని పేర్కొన్నారు.

ప్రతి ఎన్నికలకిదే ప్రచారం

తొమ్మిది నెలల కింద.. ఎంపీ ఎన్నికల టైమ్​లో కేటీఆర్​ సీఎం అవుతారంటూ ఇప్పటికంటే ఎక్కువగా క్యాంపెయిన్​ జరిగింది. అప్పుడు టీఆర్ఎస్ రాష్ట్రంలో మొత్తం 16 ఎంపీ సీట్లను గెలుస్తుందని, ఫెడరల్ ఫ్రంట్​సారథిగా కేసీఆర్​ ఢిల్లీలో చక్రం తిప్పుతారని టీఆర్ఎస్​ శ్రేణులు బలంగా విశ్వసించాయి. అదే జరిగితే రాష్ట్రంలో కేటీఆర్​కు పరిపాలనా బాధ్యతలు అప్పగించటం ఖాయమనే వాదనలు బలంగా వినిపించాయి. కానీ అనుకున్నన్ని ఎంపీ సీట్లు గెలవకపోవటంతో ప్రచారం సద్దుమణిగింది. ఈలోగా వచ్చిన పంచాయతీ ఎలక్షన్లు, మండల పరిషత్​, జిల్లా పరిషత్ ఎన్నికల్లో వర్కింగ్​ ప్రెసిడెంట్​ హోదాలో కేటీఆర్​ అన్నీ తానై చక్రం తిప్పారు. హుజూర్​నగర్​ ఉప ఎన్నికకు కేసీఆర్​ దూరంగా ఉన్నా కేటీఆర్​ భారీ మెజారిటీతో గెలిపించిన ముద్ర వేసుకున్నారు. ఈలోగా మున్సిపల్​ ఎన్నికలు రావడంతో మళ్లీ కేటీఆర్​ సీఎం అవుతారనే ప్రచారం మొదలైంది. పార్టీ నేతలందరూ కేటీఆర్​ సెంట్రిక్​గా.. ఆయన చుట్టూ తిరిగేలా చేసే ప్లాన్ లో భాగంగానే ఈ ప్రచారం మొదలైనట్లు కొందరు సొంత పార్టీ నేతలే చెప్తున్నారు. ఇదే సమయంలో వరుసగా మంత్రులంతా కేటీఆర్​కు జై కొడుతున్న తీరు, పార్టీ శ్రేణులను కన్ఫ్యూజన్​కు గురి చేస్తోంది.

దుక్కలా ఉన్నా.. పదేండ్లు నేనే సీఎం – 2019 సెప్టెంబర్​ 15న అసెంబ్లీలో కేసీఆర్

పదేండ్లు సీఎంగా ఉంటానని కేసీఆర్​ చెప్పినంక మళ్లీ చర్చ దేనికి..? – బుధవారం మీట్​ ది ప్రెస్​లో కేటీఆర్

జనం అంతా కేటీఆర్‍ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. తర్వాత కేటీఆరే సీఎం – గురువారం వరంగల్​ రూరల్​ జిల్లా పల్లెప్రగతిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు

రాష్ట్ర ప్రజలు కేటీఆర్​ను తర్వాతి సీఎంగా చూడాలనుకుంటున్నరు – తెలంగాణభవన్​లో డిసెంబర్​ 26న మంత్రి శ్రీనివాస్​గౌడ్

వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పార్టీని ముందుకు తీసుకెళ్తూనే, మినిస్టర్​గా కేటీఆర్ ​కీలక పాత్ర పోషిస్తున్నరు. కేసీఆర్‌ తర్వాత కేటీఆరే సీఎం

బుధవారం మహబూబాబాద్​లో ఎంపీ మాలోతు కవిత

ఫ్యూచర్​ ప్లాన్.. ఝులక్!

సీఎం కేసీఆర్​ సెకండ్​ టర్మ్​ అధికారంలోకి వచ్చాక అటు పార్టీలో, ఇటు పాలనలో వారసుడికి కీలక బాధ్యతలు కట్టబెట్టే పనిపెట్టుకున్నారు. అందులో భాగంగానే అసెంబ్లీ ఎన్నికలవగానే కేటీఆర్​ను టీఆర్ఎస్​పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​గా నియమించారు. కేబినెట్​ విస్తరణలో మంత్రి పదవి ఇచ్చారు. అదే వరుసలో ఇప్పుడు సీఎం చేసే అవకాశం ఉందని కేడర్​ భావిస్తోంది. ఇదంతా ఉత్తుత్తిదేనని.. పార్టీ నేతలు, కార్యకర్తలంతా కేటీఆర్​ చుట్టూ తిరిగేలా చేసే ప్లాన్​ మాత్రమేనని, పార్టీలోని సీనియర్లకు ఝలకిచ్చే ఎత్తుగడేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.