ఎర్రబెల్లి ప్రదీప్​కు ఎమ్మెల్యే నన్నపునేని పరోక్ష హెచ్చరిక

ఎర్రబెల్లి ప్రదీప్​కు ఎమ్మెల్యే నన్నపునేని పరోక్ష హెచ్చరిక

వరంగల్‍, వెలుగు: ‘వరంగల్​లో ఒకరిద్దరు చెంచాగాండ్లు చెంచాలు కొడుతున్రు. దిక్కులు చూస్తున్రు. మీ బతుకులు బాగుండాలన్నా.. బజార్లో పతారా ఉండాలన్నా టీఆర్‍ఎస్​ జెండా పట్టుకుని సక్కగా ఉండండ్రి. పార్టీలో ఉంటూ మోసం చేయాలనుకుంటే ఇక నుంచి కుదరదు. ఓపెన్‍ చాలెంజ్‍. ఇది నా బర్త్​డే డిక్లరేషన్‍’ అంటూ వరంగల్‍ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‍ పరోక్షంగా రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్‍రావుకు సీరియస్‍ వార్నింగ్‍ ఇచ్చారు. గురువారం అర్ధరాత్రి దాటాక వరంగల్​లో నరేందర్‍ బర్త్​డే వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా నన్నపునేని మాట్లాడుతూ ‘నరేందర్‍ బాగా సైలెంట్‍గా ఉంటడు, అమాయకుడు అనుకుంటున్రు. అరేయ్‍.. వేషాలు, మీ కథ, మీ ఖార్కాన నా తల్లి కడుపులో ఉండంగనే చూశానురా.. వరంగల్‍ నియోజకవర్గాన్ని 65 సంవత్సరాల నుంచి ఏ ఒక్కరూ డెవలప్‍ చేయలే. మేము మేమంటూ చెప్పుకుంటున్నారు. ఏమన్నా ఉంటే వరంగల్‍ సిటీ డెవలప్‍మెంట్‍ మీద మాట్లాడాలే. నేను నిజాయతీగా ఉన్నా. అతి త్వరలో నా పాదయాత్ర ఉంటది’ అన్నారు. ఎప్పుడూ లేనట్లుగా నరేందర్‍ ఇలా మాట్లాడటం ఉమ్మడి వరంగల్‍ జిల్లాలో హాట్‍టాపిక్‍ అయింది.