దేశంలో ఏ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు ఇస్తలేరు

దేశంలో ఏ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు ఇస్తలేరు

నర్సింహుల పేట, వెలుగు: పెన్షన్ తీసుకొనే ప్రతి ఒక్కరు టీఆర్ఎస్‌‌కు ఓటు వేయాలని టీఆర్‌‌‌‌ఎస్‌‌ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహుల పేట, పెద్ద నాగారంలో లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ అందించి ఆయన మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు ఇస్తలేరన్నారు. కేవలం ఈ ఒక్క మండలంలోనే 962 పెన్షనర్లకు కోటి రూపాయలు ఇస్తున్నామని చెప్పారు. పెన్షన్లు రావాలంటే సీఎం కేసీఆర్ ఉండాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రంలో లేని పథకాలు మన రాష్ట్రంలో అమలు అవుతున్నాయని పేర్కొన్నారు. 

ఓటేసినం కాబట్టే పింఛన్ అడుగుతున్నం
అర్హులను వదిలేసి, అనర్హులకు పింఛన్లు ఇచ్చారని పెన్షన్ రాని వాళ్లు ఎమ్మెల్యే రెడ్యానాయక్‌‌తో మొరపెట్టుకున్నారు. నర్సింహులపేటలో పెన్షన్లు ఇచ్చి వెళ్తున్న క్రమంలో ఎమ్మెల్యే కారుకు అడ్డుపడ్డారు. అన్ని అర్హతలు ఉన్నా తమకు పెన్షన్లు ఇవ్వడంలో ఆఫీసర్లు, లోకల్ లీడర్లు చేతివాటం చూపించారని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగం ఉన్న కుటుంబాలకు, ఒకే ఇంట్లో ఒకే రకమైన పెన్షన్లు ఇచ్చారని వాగ్వాదానికి దిగారు. ఓటేసినం కాబట్టే పింఛన్ అడుగుతున్నామని ఎమ్మెల్యేను నిలదీశారు.