మంచిర్యాల జడ్పీ మీటింగ్కు జడ్పీటీసీలు, ఎంపీపీలు దూరం

మంచిర్యాల జడ్పీ మీటింగ్కు జడ్పీటీసీలు, ఎంపీపీలు దూరం
  • వెళ్లొద్దని జడ్పీటీసీలు, ఎంపీపీలకు ఆదేశాలు ?
  • కోరం లేక వాయిదా పడిన సమావేశం
  • చైర్ పర్సన్​ కాంగ్రెస్లో చేరడంతోనే దూరం 

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జడ్పీ జనరల్​బాడీ మీటింగ్​కు టీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు డుమ్మా కొట్టారు. చైర్​పర్సన్​నల్లాల భాగ్యలక్ష్మి, ఆమె భర్త, మాజీ విప్​నల్లాల ఓదెలు ఇటీవల టీఆర్ఎస్​నుంచి కాంగ్రెస్​లో చేరడంతోనే వీళ్లంతా గైర్హాజరైనట్టు చర్చించుకుంటున్నారు. రూల్స్​ప్రకారం ప్రతి మూడు నెలలకోసారి జడ్పీ జనరల్​బాడీ మీటింగ్​నిర్వహించాలి. దీనికి జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారు. ఈ ఏడాది మార్చి 30న సమావేశం జరగ్గా, మళ్లీ ఈ బుధవారం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు జడ్పీ సీఈఓ నరేందర్​జూన్​15న ప్రభుత్వ విప్​ బాల్క సుమన్​, పెద్దపల్లి, ఆదిలాబాద్ ఎంపీలు బోర్లకుంట వెంకటేశ్​నేత, సోయం బాపురావు, ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండె విఠల్​, బెల్లంపల్లి, మంచిర్యాల, ఖానాపూర్​ ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, నడిపెల్లి దివాకర్​రావు, అజ్మీరా రేఖానాయక్​తో పాటు జడ్పీటీసీలు, ఎంపీపీలకు ఆహ్వానాలు పంపారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు మీటింగ్​ప్రారంభం కావాల్సి ఉండగా.. జడ్పీ చైర్​పర్సన్​ భాగ్యలక్ష్మి, కాంగ్రెస్​కు చెందిన లక్సెట్టిపేట, దండేపల్లి, భీమిని జడ్పీటీసీలు ముత్తె సత్తయ్య, గడ్డం నాగరాణి, పోతరాజుల గంగవ్వ, లక్సెట్టిపేట ఎంపీపీ అన్నం మంగ హాజరయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్​రెడ్డి, అడిషనల్​ కలెక్టర్​ మధుసూదన్​నాయక్​తో పాటు ఆయా శాఖల అధికారులు వచ్చారు. అయితే మధ్యాహ్నం 12 గంటల వరకూ టీఆర్ఎస్​కు చెందిన సభ్యులెవరూ రాలేదు. కోరం లేకపోవడంతో మీటింగ్​వాయిదా వేస్తున్నట్టు చైర్​పర్సన్​ప్రకటించారు. అయితే చైర్​పర్సన్​తో పాటు ఆమె భర్త కాంగ్రెస్​లో చేరడంతోనే టీఆర్ఎస్​ సభ్యులందరూ మీటింగ్​కు దూరంగా ఉన్నట్టు తెలిసింది. ఈ మేరకు స్వయంగా ఎమ్మెల్యేలే.. జడ్పీటీసీలకు, ఎంపీపీలకు ఫోన్లు చేసి మీటింగ్​కు వెళ్లొద్దని హుకుం జారీ చేసినట్టు సమాచారం.  

ప్రజా సమస్యల పరిష్కారం ఎట్లా? 
జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై జడ్పీ మీటింగ్​లో కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు పలు తీర్మానాలు ఆమోదించాల్సి ఉంటుంది. ప్రస్తుతం జడ్పీలో 16 మంది జడ్పీటీసీలు, ఇద్దరు కో ఆప్షన్​ మెంబర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆరుగురు కలిపి మొత్తం 24 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో కాంగ్రెస్​కు చెందిన వారు నలుగురు మాత్రమే. మీటింగ్​జరగాలంటే 1/3 కోరం అంటే 8మంది సభ్యులు హాజరుకావాలి. తీర్మానాలు ఆమోదించడానికి 2/3 కోరం అంటే 16 మంది సభ్యులుండాలి. రానున్న రోజుల్లో టీఆర్ఎస్​ మెంబర్లు హాజరైతే తప్ప జడ్పీ సమావేశాలు ముందుకు సాగే పరిస్థితి లేదు. 

దళిత మహిళ కావడంతోనే...
జడ్పీ చైర్​పర్సన్​తో వ్యక్తిగతంగా, రాజకీయంగా విభేదాలుంటే జడ్పీని రాజకీయ కక్షసాధింపులకు వేదికగా వాడుకోవడం ఏమిటని ఎమ్మెల్సీ టి.జీవన్​రెడ్డి విమర్శించారు. జడ్పీ చైర్​పర్సన్​ దళిత మహిళ కావడంతోనే అవమానిస్తున్నారన్నారు. వానాకాలం సీజన్​లో రైతులు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని మీటింగ్​లో వాటి గురించి చర్చించే అవకాశం లేకుండా చేశారని అన్నారు.