
మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముగ్గురు నిందితుల రిమాండ్ ను ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తిరస్కరించారు. ఇవాళ సాయంత్రం పోలీసులు నిందితులను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అయితే సరైన ఆధారాలు లేవంటూ రిమాండ్ పిటిషన్ ను జడ్జి కొట్టేశారు. ఈ కేసులో ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ పీసీ యాక్ట్ వర్తించదన్నారు. 41 CRPC నోటీస్ ఇచ్చి విచారించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
ఈ కేసులో ముగ్గురు నిందితులను సరూర్ నగర్ లోని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నివాసానికి తీసుకుళ్లారు. పోలీసులు భారీ బందోబస్తు నడుమ 8 పోలీస్ వాహనాల్లో నిందితులను తరలించారు. ఈ కేసులో రామచంద్ర భారతి, నంద కుమార్, సింహ యాజ్ లను న్యాయమూర్తి ముందు పోలీసులు హాజరుపరిచారు. జడ్జి ఇంటి ముందు పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.
ఈ కేసులో నిందితులకు వైద్య పరీక్షలు చేశారు. శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నే వైద్య పరీక్షలు పూర్తి చేసినట్టు వైద్యులు చెప్పారు. నర్కుడ పీహెచ్ సీ వైద్యుడు పీఎస్ కు వచ్చి నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ముగ్గురి సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ డేటా ఆధారంగా వీరు ఎవరితో టచ్ లో ఉన్నారన్న కోణంలో ఎంక్వైరీ చేశారు.