హుజురాబాద్ లో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి చర్చ సభతో రచ్చ

హుజురాబాద్ లో  ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి చర్చ సభతో  రచ్చ
  • టీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కౌశిక్​రెడ్డి ‘చర్చ సభ’తో రచ్చ
  • ఎక్కడికక్కడ బీజేపీ నేతల అరెస్టులు.. లాఠీచార్జ్​
  • చర్చకు వచ్చిన బీజేపీ నాయకురాలిని కిందికి తోసేసిన టీఆర్ఎస్ కార్యకర్తలు


కరీంనగర్/ హుజూరాబాద్ , వెలుగు: ‘హుజూరాబాద్ అభివృద్ధిపై చర్చ’ పేరుతో టీఆర్ఎస్  ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి శుక్రవారం చేపట్టిన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బీజేపీ నేతల ముందస్తు అరెస్టులు, పోటాపోటీ ర్యాలీలు, తోపులాటలు, లాఠీచార్జీలతో ఒక దశలో హుజూరాబాద్​ రణరంగంలా మారింది. ఎమ్మెల్సీ కౌశిక్​రెడ్డి ర్యాలీగా సభావేదికకు వెళ్లేందుకు అనుమతిచ్చిన పోలీసులు.. బీజేపీ లీడర్లను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్ట్​లు చేశారు. ఆధారాలతో వస్తామన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కొందరు నేతలు పోలీసుల నుంచి తప్పించుకొని చర్చా వేదిక వద్దకు చేరుకోగా.. టీఆర్ఎస్​ నేతలు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. మహిళా మోర్చా లీడర్ లతను కిందికి లాగిపడేశారు. పలువురు బీజేపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్​ చేశారు. 

బీజేపీ నేతల ముందస్తు అరెస్టులు 

హుజూరాబాద్ అభివృద్ధిపై చర్చ కు రావాలంటూ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​కు ఎమ్మెల్సీ కౌశిక్​రెడ్డి మూడు రోజుల కింది నుంచే సవాల్​ విసురుతున్నారు. ఈ మేరకు టీఆర్ఎస్​ లీడర్లు హుజూరాబాద్​ను భారీ హోర్డింగ్​లు, ఫ్లెక్సీలతో నింపేశారు. ఈక్రమంలో కౌశిక్​రెడ్డి స్థాయికి ఈటల రాజేందర్​ ఎందుకని, తామే వస్తామంటూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ఇతర బీజేపీ నేతలు ప్రతి సవాల్ విసిరారు. గురువారం బీజేపీ జెండాలు పెట్టుకునే దగ్గర ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగడంతో ఓ బీజేపీ కార్యకర్తకు గాయాలయ్యాయి. దీంతో శుక్రవారం తలపెట్టిన చర్చ ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉందని భావించిన పోలీసులు గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం దాకా కరీంనగర్​ జిల్లా వ్యాప్తంగా 152 మంది బీజేపీ నేతలను అరెస్టు చేశారు. జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డితో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ బీజేపీ నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్లకు తరలించారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావును,  జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు మల్లేశ్​, హుజూరాబాద్ పట్టణ అధ్యక్షుడు రాముల కుమార్, ఇల్లందకుంట, తిమ్మాపూర్, సైదాపూర్ మండలాల నాయకులను అదుపులోకి తీసుకొని సైదాపూర్ పోలీస్ స్టేషన్  కు తరలించారు. కానీ ఒక్క టీఆర్ఎస్  కార్యకర్తను కూడా అరెస్టు చేయలేదు. పోలీసులు  ఓ వైపు చర్చకు అనుమతి లేదంటూనే సహకరించడంతో కౌశిక్ రెడ్డి  భారీ ర్యాలీ నడుమ టీఆర్ఎస్ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తాకు చేరుకున్నారు.  

బీజేపీ మహిళా లీడర్ ను తోసేసిన్రు

కౌశిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి చర్చా వేదిక వద్దకు చేరుకున్నారు. సరిగ్గా అదే టైంలో ఈటల రాజేందర్ కు బదులు తాను చర్చకు వచ్చానంటూ సిగ లత అనే మహిళా మోర్చా నాయకురాలు వేదిక ఎక్కి  కౌశిక్ రెడ్డికి సవాల్ విసిరారు. దీంతో టీఆర్ఎస్ శిబిరంలో కలకలం మొదలైంది.  ఆమెకు తోడుగా మరో మహిళా నాయకురాలు పంజాల లక్ష్మి అక్కడికి చేరుకొని ‘జై బీజేపీ’, ‘జై ఈటల’ అంటూ నినాదాలు చేశారు.  దీంతో లతను టీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలు కిందికి తోసేశారు. వెంటనే పోలీసులు చేరుకుని.. ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకొని జనాల మధ్యలోంచి పోలీస్ స్టేషన్ కు లాక్కొని వెళ్లారు. 

కేసీఆర్ కాలిగోటికి సరిపోడు: కౌశిక్ రెడ్డి 

కేసీఆర్​పై ఇష్టారీతిగా మాట్లాడుతున్న ఈటల రాజేందర్​ ఆయన కాలిగోటికి కూడా సరిపోరని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. శుక్రవారం అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు  చేసిన సమావేశంలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఎలాంటి అభివృద్ధి చేయలేదు కాబట్టే అభివృద్ధిపై చర్చకు- ముఖం చాటేశాడు. నియోజకవర్గంలో సీఎం -కేసీఆర్ రూ. 100 కోట్లతో అభి వృద్ధి పనులు చేశారు. -18 ఏండ్లు ఎమ్మెల్యేగా, ఏడున్నరేండ్లు  మంత్రి గా ఉన్నా..  సొంత ఊరు కమలాపుర్ లో బ స్టాండ్ కూడా కట్టించలేదు” అని దుయ్యబట్టారు. కేసీఆర్ ను మాటలు అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ -కార్యక్రమానికి టీఆర్​ఎస్​ నియోజకవర్గ ఇన్ చార్జ్​ గెల్లు శ్రీనివాస్ యాదవ్ దూరంగా ఉన్నారు. 


తోపులాట.. లాఠీచార్జ్​

కౌశిక్ రెడ్డి ప్రసంగం కొనసాగుతుండ గానే బీజేపీ లీడర్లు, కార్యకర్తలు పార్టీ జెండాలు పట్టుకుని పెద్ద సంఖ్యలో అంబేద్కర్ చౌరస్తాకు చేరుకుని  బీజేపీకి, ఈటల రాజేందర్​కు అనుకూలంగా నినాదాలు చేశారు. వారిని పోలీసులు అడ్డుకొని వెనక్కి పంపారు. అటు నుంచి ఓ గల్లీలోకి చేరుకున్న బీజేపీ శ్రేణులు  రోడ్డు పై బైఠాయించి కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిపై లాఠీచార్జ్​ చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. తర్వాత  అందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు వెహికల్​లో స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు. వెంటనే అదే గల్లీలోంచి మరో బీజేపీ బ్యాచ్ పెద్ద సంఖ్యలో చేరుకొని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేసింది. పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టారు. మీటింగ్ పూర్తయ్యాక ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగిస్తుంటే కట్టెలు మీద పడి అక్కడ నిల్చున్న ఓ వ్యక్తికి గాయాలయ్యాయి.