హైదరాబాద్ పంజాగుట్టలో డ్రగ్స్ కలకలం.. ఐదు మంది కాలేజీ స్టూడెంట్స్ అరెస్ట్

హైదరాబాద్ పంజాగుట్టలో డ్రగ్స్ కలకలం.. ఐదు మంది కాలేజీ స్టూడెంట్స్ అరెస్ట్

యువత డ్రగ్స్ కు దూరంగా ఉండండి.. చదువు, కెరీర్ ను నాశనం చేసుకోవద్దు అంటూ పోలీసులు ఎంత హెచ్చరించినా స్టూడెంట్స్ డ్రగ్స్ కు అట్రాక్ట్ అవుతూనే ఉన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున పంజాగుట్టలో ఆదివారం (జనవరి 25) ఐదు మంది విద్యార్థులు డ్రగ్స్ తీసుకుని పోలీసులకు పట్టుబడటం కలకలం రేగింది. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ పరిధిలో డ్రగ్స్ తీసుకుంటూ తిరుగుతున్న ఐదుగురు కాలేజీ విద్యార్థులను పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

డ్రగ్స్ తీసుకున్న స్టూడెంట్స్ నుంచి సుమారు 10 గ్రాముల ఎండీఎంఏ (MDMA) డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పంజాగుట్ట ఇన్స్పెక్టర్ రామకృష్ణ తెలిపారు. నాగార్జున సర్కిల్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులను గమనించిన పోలీసులు తనిఖీలు చేపట్టగా, వారు డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు గుర్తించారు. విచారణలో ఐదుగురూ పంజాగుట్టలోని హామ్‌స్టెక్ (HAMSTECH) కాలేజీకి చెందిన విద్యార్థులుగా నిర్ధారించారు.

కాలేజీ సెల్లార్‌లో డ్రగ్స్ వినియోగించినట్టు గుర్తించిన పోలీసులు, డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరి ద్వారా సరఫరా జరుగుతోంది అనే కోణంలో లోతైన విచారణ చేపట్టారు. ఐదు మంది కాలేజీ విద్యార్థులు డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డారన్న ఘటనతో పంజాగుట్ట ప్రాంతంలో ఉత్కంఠ మొదలైంది. అదే కాలేజీలో చదువుతున్న తమ పిల్లల గురించి చాలా మంది పేరెంట్స్ ఆందోళనకు గురయ్యారు. డ్రగ్ సరఫరా వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను బయటపెట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.