ఆకతాయిలకు సింహస్వప్నం షీ టీమ్స్ అని తెలిపారు హైదరాబాద్ సీపీ సజ్జనార్. 2025లో 3826 మంది ఆకతాయిలు రెడ్ హ్యాండెడ్గా చిక్కారని తెలిపారు. హైదరాబాద్‌లో మహిళల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆడబిడ్డల జోలికొస్తే జైలు తప్పదని హెచ్చరించారు. ఆదివారం (జనవరి 25) ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో.. ఒక్క ఫోన్ కాల్ చాలు – షీ టీమ్స్ మీ రక్షణ కవచం అంటూ మహిళలకు భరోసా ఇచ్చారు.
హైదరాబాద్‌లో ఏడాది కాలంలో 11 వందల 49 షీ టీమ్స్ ఫిర్యాదులు నమోదయ్యాయని.. అన్నింటికీ పరిష్కరించినట్లు చెప్పారు. మహిళలపై వేధింపులకు అడ్డుకట్టగా క్షేత్రస్థాయిలో పకడ్బందీ నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏడాది కాలంలో 15 షీ టీమ్స్ బృందాలు మఫ్టీలో పనిచేసినట్లు చెప్పారు. 2025 లో 3 వేల 826 మంది ఆకతాయిలు రెడ్ హ్యాండెడ్‌గా షీటీమ్స్ కు చిక్కారని తెలిపారు.
ఇందులో సోషల్ మీడియా పరిచయాలతో బ్లాక్‌మెయిలింగ్ కేసులు 366 ఉన్నాయని చెప్పారు. వ్యక్తిగత ఫోటోలు, వీడియో కాల్స్ రికార్డింగ్‌తో డబ్బుల డిమాండ్ చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అర్ధరాత్రి అసభ్య కాల్స్, కొత్త నంబర్లతో వేధింపుల కేసులో 121 మందిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. మానసిక వేధింపులకు గురైన 50 మంది మహిళలకు షీ టీమ్స్ అండగా నిలిచిందన్నారు.
ఫేక్ ఐడీలు, అసభ్య కంటెంట్ షేరింగ్ కేసులు 82 నమోదయ్యాయని.. సాంకేతిక ఆధారాలతో పరిష్కారం చూపినట్లు తెలిపారు. ప్రేమ, పెళ్లి పేరుతో మోసాల కేసులో 98 ఫిర్యాదులు రాగా, కౌన్సెలింగ్‌తో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మహిళలపై వేధింపులు జరిగినా.. ఆన్ లైన్ లేదా ఫోన్ ల ద్వారా వేధింపులకు పాల్పడినా 100 కు డయల్ చేయాల్సిందిగా సూచించారు. షీ టీమ్స్ వాట్సాప్ నెంబర్ కు మెసేజ్ పెట్టినా లేదా ఫోన్ చేసినా యాక్షన్ తీసుకోనున్నట్లు తెలిపారు.
ఫిర్యాదు ల కోసం డయల్ 100, షీ టీమ్స్ వాట్సాప్: 9490616555
