
హుజురాబాద్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమని ప్రకటించి.. వేదిక వద్దకు వెళుతున్న బీజేపీ నేతలను అరెస్టు చేయడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని అరెస్టు చేసి వీణవంక పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు ఆందోళనలు నిర్వహించారు. కౌశిక్ రెడ్డి, టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అంబేద్కర్ చౌరస్తా వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. కౌశిక్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో వారి మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు.
ఇదిలా ఉంటే.. కౌశిక్ రెడ్డి సవాళ్లపై బీజేపీ నేతలు స్పందించారు. మానుకొండలో తెలంగాణ ఉద్యమకారులపై రాళ్లు వేసిన కౌశిక్ రెడ్డితో చర్చకు ఈటల రారని.... హుజురాబాద్ అభివృద్ధిపై మాట్లాడేందుకు తామే వస్తామని నియోజకవర్గ బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. అన్నట్లుగానే సభా వేదిక వద్దకు భారీ ర్యాలీతో కౌశిక్ రెడ్డి చేరుకున్నారు. ఆయన ప్రసంగం ముగిసే సమయానికి కొంతమంది బీజేపీ కార్యకర్తలు చేరుకున్నారు. అప్పటికే భారీ సంఖ్యలో వచ్చిన టీఆర్ఎస్ నేతలు వారిని అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో పరిస్థితి కొంత ఉద్రిక్తతంగా మారింది. వీరిని మరోసారి పోలీసులు చెదరగొట్టారు. మొత్తంగా బహిరంగసభ చర్చతో హుజురాబాద్ హీటెక్కింది.